మహాత్ముడైన దాదూదయాల్ గృహస్థ జీవితం గడుపుతూ జీవనోపాధికోసం వ్యాపారం చేసేవాడు. ఒక నాడు సాయంత్రం అయన తన ఆదాయాన్ని లెక్క పెట్టుకుంటూ దుకాణంలో పనిలో లీనమై ఉంటాడు. బయట వర్షం పడుతోంది. కొంతసేపు అయిన తరువాత దాదూ తల త్రిప్పి చూడగా గురువు వర్షంలో తడుస్తూ కనిపిస్తాడు. దాదూ గాబరా పడుతూ లేచివెళ్ళి అంతవరకు చూడనందుకు క్షమించమని వేడుకుంటాడు.
గురువు అతన్ని వారిస్తూ, వత్సా! నీవు నన్ను చూశావు, పిలిచావు. సరే కానీ నీ గుమ్మం ముందు ఎప్పటినుండో భగవంతుడు నిలచి ఉన్నాడు. ఆయనను ఎందుకు లోనికి రమ్మని పిలవలేకపోతున్నావు అని ప్రశ్నించాడు.
ఆమాట దాదూ హృదయంలో గ్రుచ్చుకొన్నది. ఆమాటే అతడిని మహాత్మునిగా మార్చివేసింది. గురువులాగానే దైవాన్ని కూడా తీసుకునివచ్చి తన ఇంట కూర్చోపెట్టుకునే వరకు నిద్రపోలేదు. దైవాన్ని తన ఇంటికి ఆహ్వానించి తృప్తిగా ఊపిరి తీసుకుంటాడు.
స్వామి విరాజానంద కుటీరంలో ధ్యానమగ్నుడై ఉండగా మూలశంకర్ అనే ఆయన స్వామీజీకి తన ఉనికిని తెలియజేస్తూ బయట నిలబడ్డాడు. కుటీరం లోపల నుండి “ఎవరు” అని ప్రశ్న వినిపించింది. అది తెల్సుకోవాలనే వచ్చాను స్వామీ” అని బదులుపల్కుతాడు. నిరీక్షణ ఎంత కాలంగానో? రా! రా! త్వరగా లోనికి అంటాడు స్వామీజీ.
జ్ఞానచక్షు సంపన్నుడైన గురువు ఇటువంటి సాహసంకల జిజ్ఞాసువును లోపలకు ఆహ్వనించిన ఆక్షణాలే మూలశంకర్ కు “స్వామి దయానంద” గా జన్మను ప్రసాదిస్తాయి.
గురువు అతడిని అన్నివిధాల పరీక్షించాడు, ఆత్మబోధ కల్గించాడు. అటుపైన ఆదేశిస్తూ సమాజంలో వ్యాపంచిన అనాచారం, మూఢవిశ్వాసం, ధర్మం పేరిట జరిగే ఆడంబరం వీటిని అరికట్టటానికి ఒంటరిగానే బయలుదేరమంటాడు. గురుదేవుడు ప్రసాదించిన అనంతమైన శక్తితో బయలుదేరి దయానందుడు నెమ్మదిగా విశ్వమంతా వ్యాపించాడు.
