The Power of Self-Awareness and Spiritual Awakening

వివేకానందుడు రామకృష్ణుని వద్ద కూర్చుని నమస్కరించి, ఓ మహాత్మా! మానవుడు శ్రేష్టుడు, విచారశీలుడు అయినప్పటికీ ఒక దానికొకటి ఏ మాత్రం సంబంధంలేని రెండు విధాలైన భిన్న ప్రవృత్తులు వ్యక్తిలో దృష్టి గోచరమవుతున్నాయి. ఒక స్థాయికి చెందినవారు నికృష్టస్థితిని ఇష్టపడితే రెండవ స్థాయికి చెందినవారు ఉత్కృష్టతను పరమార్థ పరాయణతను ఇష్టపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.

పరమహంస చిరునవ్వు నవ్వి, నాయనా! రెండు సిబ్బెలుగల త్రాసులో ఒక వైపు భారం ఎక్కువై వంగితే రెండవ వైపు భగవంతుడు ఉంటారు. లౌకికమైన పేరు ప్రతిష్టలు, సుఖభోగాలు కోరుకొనే వారి భారం ఎక్కువగా ఉంటుంది. వారి మనస్సు భగవంతుని వైపు పైకి లేచి లౌకికమైన వాటిపట్ల వంగి ఉంటుంది.
వైరాగ్యం, వివేకం, ఆత్మజ్ఞానం వల్ల ప్రజల ఉత్కంఠ ఎవరి మనస్సుని బరువెక్కిస్తే వారి మనస్సు లోకం వైపు నించి బాగా పైకిలేచి భగవంతుని పట్ల వంగి ఉంటుంది అని తెలియజేస్తాడు.

మహాత్ముడైన రామానుజునికి ఒక గృహస్థు నమస్కరిస్తూ, అయ్యా! ఈ కుటుంబాన్ని సంపదను ఏవీ వదలనదానికివసరం లేకుండా స్వర్గాన్ని పొందే ఉపాయం ఏదైనా చెప్పుమని అడుగుతాడు. దానికి రామానుజుడు, వత్సా! స్వర్గం ఎక్కడో లేదయ్యా. నీవు నీ అంతరంగం లోనికి తొంగిచూస్తే చాలు నీకు నీ యథార్థ స్వరూపం అవగతమవుతుంది.

నిద్రపోయే శక్తులను మేల్కొల్పి మానవుడుగా వ్యవహరించినట్లయితే స్వర్గ సుఖాలను అనుభవించటానికి తగిన పాత్రత నీకు లభిస్తుంది. అని తెలియజేస్తాడు. కానీ గృహస్థు సంతృప్తి చెందక ఓ మహాత్మా! మీరు చెప్పినవన్నీ గృహస్థు ధర్మాన్ని వదలి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినవారికే సాధ్యమవుతాయని చెప్తారే! అది ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నిస్తాడు. దానికి రామానుజుడు, నాయనా! ఆత్మ కల్యాణం పట్ల నిజమైన శ్రద్ధ, నిష్ఠకల వ్యక్తి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నరపశువుగా కాక నరనారాయణుడుగా జీవించగలడు. నరకయాతనల నుండి రక్షణ కల్పించుకోవాలనే కోరిక, అభ్యుదయం – వీటినే ఆత్మజాగృతి అంటారు అని తెలియజేస్తాడు.

గౌతమి యొక్క ఏకైక సంతానం మరణిస్తాడు. ఆమె శోకాన్ని భరించలేక బుద్ధుని వద్దకు వచ్చి బిడ్డను బ్రతికించమని ప్రార్థిస్తుంది. బుద్ధుడు ఆమెను ఓదారుస్తూ, ఇంతవరకు ఒక్క మృత్యువైనా సంభవించని గృహంనుండి గ్లాసు నీళ్లు తీసుకుని రమ్మని వాటిని మంత్రించి జల్లితే బిడ్డ బ్రతుకుతాడని తెలియచేస్తాడు. గౌతమి ఇంటింటికి తిరిగి తిరిగి నిరాశతో తిరిగివచ్చి బుద్ధునికి నమస్కరిస్తుంది.

బుద్ధుడు ఆమెకు జ్ఞానోపదేశం చేస్తూ, అమ్మా ప్రకృతి యొక్క శాశ్వత నియమం అయిన ఈ జనన మరణ చక్రంలో తిరుగాడే మనం ఒకరికోసం మరొకరు దుఃఖించటం వృధా. ‘చావు’ అనేది లేని వ్యక్తి అంటూ విశ్వంలో ఎవ్వడు ఉండడు. అందరూ నేడో రేపో సమయం ఆసన్నమవగానే మరణించక తప్పదు అని తెలియజేస్తాడు. గౌతమి లభించిన ఆత్మజ్ఞానం ద్వారా శోకాన్ని శాంతింపచేసుకుని మృత పుత్రునికి అంత్యక్రియలు జరిపించంది.

యక్ష యుధిష్ఠిర సంవాదంలో యక్షుడు ధర్మరాజుని “బ్రాహ్మణత్వం” అనేది దేనివలన సిద్ధిస్తుంది? అని ప్రశ్నిస్తాడు. బ్రాహ్మణత్వం అనేది కులం వల్లగానీ, శాస్త్రాధ్యయనం వల్లగానీ, ఆచార వ్యవహారాలవల్ల గానీ, స్వాధ్యాయ సత్సంగాల వల్లగానీ లభించేది కాదు. సదాచార సంపన్నుడైన వ్యక్తి ఆత్మబోధ ద్వారా అజ్ఞానాన్ని దూరం చేసికొని ద్విజత్వాన్ని పొందుతాడు అని ధర్మరాజు బదులు పల్కుతాడు.

“భగవద్గీత” లో కృష్ణార్జున సంవాదంలో జరిగిన చర్చ అందరికీ తెలిసినదే. ఇది ప్రతీవ్యక్తి యొక్క అంతరంగ స్థితికి సంబంధించినది. అర్జునుని మోహాన్ని చూచి సూత్ర సంచాలకుడైన కృష్ణ భగవానుడు కూడా ఆశ్చర్యచకితుడవుతాడు. పైకి శక్తి వంతుడుగా కనిపిస్తున్న అర్జునుని అంతరంగంలోని దైన్యం, పిరికితనం, మూర్ఖపు ప్రవర్తన వీటిని నిరసిస్తూ అతనికి కృష్ణుడు ఆత్మబోధ చేస్తాడు. ఈ ఆత్మబోధే అర్జునుని పునర్జన్మగా చెప్పవచ్చు. భగవంతుని నిర్దేశానుసారం పయనించటానికి అర్జునుడు ఉద్యుక్తుడవుతాడు. అది ఆత్మబోధ ద్వారా లభించిన ఉపలబ్ది అని అంగీకరించక తప్పదు. అంతరంగం ఏ సందేశాన్ని ఇస్తే దానిని ఈశ్వరీయ ప్రాప్తి తరువాత లభించిన “ఈశ్వరీయ సందేశం” గానే భావించి పయనించినపుడు వ్యక్తి లక్ష్య సిద్ధిని విధిగా పొందగలడు.

The Power of Self-Awareness and Spiritual Awakening

Leave a Comment