కర్మనిష్ఠ ఆత్మజ్ఞానంతో సంయోగం చెందితే మహత్వపూర్ణమైన చమత్కారాలు జరుగుతాయి. వ్యక్తి ఏమంటే అది జరిగితీరుతుంది.
జైతవన్ అనే నగరానికి చెందిన సీమక్ అనే శ్రేష్ఠి కడుపిసినారి. దీని కారణంగా ఆయనను కొడుకులు, కోడళ్ళు, బంధువులు ఎవ్వరూ కూడా గౌరవించేవారు కాదు. సరిగ్గా ఆ నగరంలోనే మహీధరా చార్యుడు అనే ఆయన ఇంటింటికి అందించాలనే కోర్కెతో వేదాలకు భాష్యం వ్రాశాడు. వేదజ్ఞానాన్ని ఇంటింటికి పంచటము అత్యంత ఆవశ్యకమైనదిగా తెలిసికూడా ధనభావం వల్ల ఆయన దానిని అచ్చువేయించలేకపోయాడు.
ఇది ఇలా ఉండగా కర్మనిష్ఠుడై సీమక్ ధనంతో సహా మాయమైనట్లు వార్త సర్వత్రా వ్యాపించింది. చూస్తుండగానే ఇంద్రజాలంవలె మహీధరాచార్యుని వేదభాష్యం ఇంటింటికి అందించబడసాగింది. గర్భదరిద్రుడైన ఆచార్యులవారికి ఈ పని ఎలా సాధ్యం? అని ప్రజలు పర్యవేక్షణ ప్రారంభించారు. సీమక్ రూపురేఖలుగల వ్యక్తి ఈ మహత్కార్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి అందరూ ఆశ్చర్యచకితులవుతారు. కర్మనిష్ఠ, ఆత్మజ్ఞానాల సంయోగంవల్ల ఇటువంటి ఆశ్చర్యకరమైన చమత్కారాలు జరుగుతూ ఉంటాయి.
ఒక వ్యక్తి రోజుల తరబడి బయటే గడుపుతూ ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వస్తూండేవాడు. అతడు ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది ఇరుగు పొరుగు వారికి గూడా అంతుబట్టక ఒకనాడు ప్రక్క ఇంటి ఒక స్త్రీ ఆయనను పిలిచి, అయ్యా! నీవేపని చేస్తుంటావు? కనీసం వేళకి తిండినైనా పట్టించుకోకుండా తిరుగుతావెందుకని? ఆమె ప్రశ్నించింది.
ఆయన చిరునవ్వు నవ్వి అమ్మా! ప్రస్తుతం నేను జీవితంలోని మూడవ అధ్యాయంలో ఉన్నాను. కనీసం ఇప్పుడైనా పూజ, భగవత్ సేవ వంటి పారమార్థికమైన కర్మలు ఆచరించాలి కదా! ఆ పనిలోనే తిరుగుతూ ఉంటానని బదులు పల్కుతాడు. ఇరుగు పొరుగు వారికి ఈ మాటలు నమ్మకంగా తోచలేదు. భగవత్ సేవ ఇంట్లో ఉండి కూడా చేసుకొన వచ్చునే.
ఇదేదో తెలిసికొనవలయునని రహస్యంగా అతడిని వెంబడించసాగారు. తీరా వారు కనుగొన్నదేమంటే అతడు గ్రామ గ్రామం వ్యాయమశాలలు నెలకొల్పి ప్రజలకు శిక్షణ ఇస్తూ ఉంటాడనీ, పూజా, భగవత్ సేవ అని అబద్దం చెపుతాడు అని ఇరుగు పొరుగువారు కోపించి ఇంటికి రాగానే ఆయనపై విరుచుకుపడతారు.
అటుగా వెళుతూ ఇది గమనించిన సమర్థగురు రామదాసు ప్రజలనుద్దేశించి సోదరులారా! తమ సామర్థ్యాన్ని సత్ర్పయోజనాలలో లగ్నం చేసి, రాష్ట్రన్ని శక్తివంతంగా, సమర్థవంతంగా తయారుచేయాలని తపించే పరమార్థ పరాయణుడైన వ్యక్తి అందరినీ మించిన దైవభక్తుడు. కాబట్టి, ఈ భక్తుడు చెప్పిన మాటలో పొరపాటు ఏమీలేదని తెలియచేస్తూ ఆ వ్యక్తిని అక్కున చేర్చుకుంటాడు.
