కోసలరాజైన ప్రసేనచిత్తుడు పరివ్రాజక ధర్మాన్ని స్వీకరిస్తాడు. అలాగే గౌతమి మహిళలకు శిక్షణనిచ్చి సాధనచేయించి కార్యక్షేత్రంలో ప్రవేశపెట్టే బాధ్యతను స్వీకరించింది. ప్రసేనజిత్తుని సోదరియైన సుమననుకూడా పరివ్రాజక వృత్తిలో ప్రవేశపెట్టాలని ఆమె ఆత్రుత చూపేది. ఇది గమనించిన తథాగతుడు గౌతమిని వారిస్తూ “ఆమెను ముందు గృహస్థ ధర్మాన్ని పరిపూర్ణ నిష్ఠతో పాటించనీ.
ఆ ధర్నాన్ని ఆచరిస్తూనే సంఘారామంలో ఆమె చేయగల్గిన సేవాకార్యాలు చేస్తేచాలు. నెమ్మదిగా ఆమెలో కర్మనిష్ఠలో ఉప్పొంగిన భావవీచికలు పరివ్రాజక వృత్తి స్వీకరించుటలో ఆమెను వివశురాలిని చేస్తాయి.” అని తెలియచేస్తాడు. సరిగ్గా నూటికి నూరు పాళ్ళు తథాగతుడు చెప్పినట్లే జరిగింది కూడ. గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తూ పరివ్రాజకురాలైన సుమన గౌతమిని మించిన శ్రేష్ఠస్థాయికి చెందిన మహిళగా కీర్తించబడింది. పరిపక్వస్థితి వచ్చేసరికి వ్యక్తిని దారిమళ్ళించగల ఆలోచనలు వాటంతట అవే వస్తాయి.
ఈశ్వర భక్తికి సరియైన నిర్వచనం మానవునికి అవగతమవ్వాలంటే క్రమంగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పయనించటం వల్లనే సాధ్యమవుతుంది. శ్రమను, కర్మను, అవహేళన చేసే వారికి, అనవసరం అని భావించేవారికి “భక్తి ” అనే పేరు ఎత్తటానికి అర్హతలేదు.
అశ్వఘౌషుడు విసుగుచెంది విరాగియై ఆలుబిడ్డలను వదలి ఈశ్వర దర్శనం కోసం తపిస్తూ తిరుగసాగాడు. తిరిగి తిరిగి చివరకు ఆకలి బాధ తాళలేక ఒక వ్యవసాయదారుని ఇంటిముందు నిలబడతాడు. ఎంతో శాంతితో, ఆనందంతో, తన పనిలో నిమగ్నమైయున్న వ్యవసాయదారుని చూచి, ఓ సోదరుడా! ఈ నీ ప్రసన్నతకు ఆనందనానికి కారణం ఏమిటో? చెప్పమంటాడు.
వ్యవసాయదారుడు “ఈశ్వరదర్శనం” అని బదులు పల్కుతాడు. అశ్వఘౌషుడు తనకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. వ్యవసాయదారుడు సరే నని వంటచేసి వండినదానిలో సగం అశ్వఘౌషునికి తినిపించి సగం తాను తిని తన పనిలో తాను నిమగ్నమవుతాడు. అనేక దినాలుగా తిండిలేక లభించిన భోజనం, ప్రశాంతమైన వాతావరణంలో అశ్వఘౌషుడు ఒడలు మరచి నిద్రపోతాడు.
అలసట, అశాంతి దూరమై ఆ నిద్ర అతనికి గతంలో ఎన్నడూ ఎరుగనంత శాంతిని, ఆనందాన్ని ప్రసాదించింది. వ్యవసాయదారుడు చెప్పిన ఈశ్వరదర్శనం లభించినట్లే అనిపించింది. కర్మను ఎగవెయ్యటం వల్లకాక కర్మ ఫలం పట్ల ఆసక్తిలేకుండా ఆచరించటం వల్లనే ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుందని అశ్వఘౌషుడు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాడు.
తపోసంపన్నుడైన ముద్గలమహర్షి కురుక్షేత్ర ధర్మ భూమిలో నివసించేవాడు. నెలలోని మొదటి పక్షం వనం నుండి ఆహారధాన్యాలను సేకరించటంలో నిమగ్నమయ్యేవాడు. నెలలోని రెండవ పక్షం సేకరించిన వాటినన్నింటినీ యజ్ఞకర్మకు, అతిధి సత్కారానికి ఖర్చుచేసేవాడు. ఋషి శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు, మహర్షిని పరీక్షించదలచి అనేక పర్యాయములు వేల సంఖ్యలో శిష్యులను వెంట పెట్టుకుని ముద్గలమహర్షి ఆశ్రమానికి వచ్చేవాడు.
ప్రతీసారి మహర్షి విశ్వామిత్రుని తన ఆతిథ్యంతో ఆనందపారవశ్యంలో ముంచేవాడు. ఈ రెండు పక్షాలకు మహర్షి ఆచరిస్తున్న కర్మకు మధ్యగల యోగపరమైన సంబంధమే ఇంతటి ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తున్నట్లు విశ్వామిత్రుడు గుర్తించి పూర్ణ పురుషుడైన నీకు స్వర్గసుఖాలు లభించుగాక అని వరమిస్తాడు.
వెంటనే దేవదూతలు ఈయనను స్వర్గానికి రమ్మంటూ ఆశ్రమం ముంగిట నిలబడతారు. కానీ ముద్గలుడు వారిని వారిస్తూ, “దేవదూతలారా! నన్ను ఇబ్బంది పెట్టకండి. కర్మకు తావేలేని దేవలోకానికి వచ్చి సుఖాలు అనుభవించటం తప్ప నేను చేసేది ఏమున్నది? కాబట్టి కర్మాచరణ గావిస్తూ నా ప్రియమైన కర్మభూమిలోనే జీవిస్తానని” తెలియచేస్తాడు.
