ప్రద్యుమ్నుడనే మహారాజుకు అతని రాజ్యం పట్ల గొప్ప మోహం. ఒకసారి ఈయనకు అసాధ్యమైన జబ్బు చేసింది. పరిచర్యకై పరిజనులు పురంధరుడనే మహర్షిని పిలుస్తారు. మరణశయ్యపై నున్న రాజును ఎలాగైనా బ్రతికించమని మహర్షిని ప్రార్థిస్తారు. అంతర్దృష్టితో చూచిన మహర్షి, రాజు శరీరం వదలి తూనీగగా మారి చెట్లపై తిరుగుతూ ఉంటాడనీ, ఎవరైనా దానిని పట్టుకొని చంపితే తిరిగి జీవిస్తాడని తెలియజేస్తారు.
ఈ మాట పరిజనులు అంగీకరిస్తారు. అదేవిధంగా చేస్తారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ పురుగు దొరక్క వారిని త్రిప్పి త్రిప్పి చివరకు ఒక చెట్టు తొర్రలో ప్రవేశించి అక్కడే ఉండిపోతుంది. అశాశ్వతమైన జీవితం కోసం ఇలా మీ కాలాన్ని రోజుల తరబడి తూనీగవెంట తిరుగుతూ వృధా చేస్తన్నట్లే లోభం మోహంలోపడి తిరుగుతూ మనుష్యులు ఈశ్వరుని మరచిపోతున్నారని మహర్షి తెలియజేస్తాడు. వారు ఆ మాటలతో కాలం విలువ గుర్తించి వ్యర్థ ప్రయాసను వదలిపెడతారు.
ఒక మామిడికాయ, చెట్టు యజమాని కోయటానికి వచ్చినపుడు ఆకులమధ్య దాగి అతనికి కనుపించక, రాలిన పండ్లతో పాటు క్రిందరాలక ఒంటరిగా దుఃఖిస్తూ ఉంటుంది. కానీ తనమీద తనకు మోహం పోదు. మిత్రుల ఎడబాటు, ఒంటరితనం ఒక్కొక్కసారి రాలిపోమని చెప్పినా వినక మోహంతో అలాగే కుళ్ళి ఎండిపోతుంది.
మానవుడు కూడా వృద్ధుడైనా, బంధువులు తిరస్కరిస్తున్నా, కావలసిన వారు మరణించి దూరమైనా, దుఃఖిస్తూ కుటుంబాన్ని పట్టుకొని వ్రేలాడతాడేగానీ లోకసేవ కర్తవ్యంగా గుర్తించి ఇల్లు వదలి వెళ్లలేడు. ఎవరైనా హితవు చెప్పినా వినక నా మనుమలు మునిమనుమలు నేను లేకుండా ఏమైపోతారు అంటూ ఇంటికే అంకితమై, కొడుకులు కోడళ్ళు అవమానం తిరస్కారం భరిస్తూ చివరకు జీవచ్ఛవంలా మరణిస్తాడు. ఇలాకాక వృద్ధులు తమ అనుభవాలతో సమాజానికి మేలుచేసి సమాజ ఋణం తీర్చుకుంటే జీవితం సార్థక మవుతుంది.
శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు 6 రోజులుగా భాగవతం వినిపిస్తున్నాడు. అతను 7వ రోజున మరణిస్తాడని భయంతో సర్పం రాకకు మృత్యు ఘడియలకు దుఃఖంతో ఎదురుచూస్తున్నాడు. మరణించే ఘడియలు ఆసన్నమైన మృత్యుభయం వదలని పరీక్షిత్ మహారాజుకి శుకమహర్షి ఒక కథ వినిపిస్తాడు.
రాజా! చాలాకాలం క్రితం ఒక రాజు అడవిలో తిరుగుతూ, దారి మరచిపోయి వెదకగా వెదకగా అతి కష్టం మీద విశ్రమించటానికి అతనికి ఒక గుడిసె కనిపిస్తుంది.
ఆ గుడిసెలో ఒక వ్యక్తి లేవలేక మంచంలోనే మలమూత్రాలు విసర్జిస్తూ తినటానికి ఏనాడో సంపాదించి తెచ్చుకున్న కుళ్ళిన జంతుమాంసాలు దుర్గంధం మధ్య కుక్కిమంచంలో పడి ఉంటాడు. గత్యంతరం లేక రాజు ఆ రాత్రి ఆ గుడిసెలోనే కాలక్షేపం చేస్తాడు. ఆ దుర్గంధానికి పరిసరాలకు రాత్రి అంతా అలవాటు పడిన రాజు మర్నాడు ఆ గుడిసెను వదలి వెళ్ళలేక పోతాడు.
అదేవిధంగా ప్రతీవ్యక్తి ఇహలోకంలోని పరిస్థితులకు అలవాటుపడి మరణ సమయం ఆసన్నమైనా ఈ దుర్గంధ పూరిత వాతావరణాన్ని వదలిపోలేక వ్యధ చెందుతూ ఉంటాడు. జ్ఞాని మరణాన్ని తన అనంత యాత్రలో ఒక మైలు రాయిగా భావించి ఆనందంగా ముందుకు సాగిపోతాడు. అంటూ కథ ముగిస్తాడు.
పరీక్షిత్తుకి జ్ఞానోదయమైంది. శుకమహర్షికి నమస్కరించి ఆనందంతో మృత్యువు కోసం ఎదురు చూడసాగేడు.
