The Divine Power Within: Seven Timeless Lessons for Self-Transformation.

కార్తవీర్యుడు వింధ్య ప్రాంతాన్నంతనూ జయించి సమస్త సేనతోను మిత్రరాజులతోను తరలివస్తూ నర్మదానది ఒడ్డున జమదగ్ని మహర్షి ఆశ్రమం వద్ద విశ్రమిస్తాడు. శిష్టాచారాన్ని పాటించే మహర్షి కార్తవీర్యుని ఆరోజుకి తన ఆతిథ్యం స్వీకరించి తిరిగి ప్రయాణం చేయుమని ఆహ్వనిస్తాడు.

విజయగర్వంతోను, రాజ అహంకారంతోను కార్తవీర్యుడు మహర్షి ఆహ్వానాన్ని హేళనచేస్తూ ఒక పొద కుటీరంలో ఉండే నీ దయనీయ స్థితికి, నా విశాల సేనలకు సమన్వయం ఎలా కుదురుతుంది? అని ప్రశ్నిస్తాడు. మహర్షి ఓ చిరునవ్వు నవ్వి, రాజా! తపస్వి యొక్క సంపద సాక్ష్యాత్తు పరమాత్ముడే. సమస్త ప్రాణులకు తిండి పెట్టగల ఆయనకు నీ సైన్యం ఒక లెక్కా? నీ విశాల సేనతో సమయంకాగానే విందుకు తరలి రమ్మంటాడు.

చూస్తుండగా ఆశ్రమం సమస్త అలంకరణలతోను, పరిచారకులతోను మృష్టాన్న భోజనాలతోను కళకళ లాడసాగింది. ఎన్నడూ రుచిచూడని ఆ స్వాదిష్ట భోజనాలను ఆరగించి కార్తవీర్యునితో సహా ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ శక్తిని కొనియాడసాగేరు. స్వయంగా కార్తవీర్యుడు నమస్కరించి “మహాత్మా! క్షత్రియ శక్తి ఈనాడు బ్రాహ్మణ శక్తి ముందు ఓడిపోయిందని” అంగీకరించి శెలవు తీసుకుంటాడు.

కమలపుష్పం మీద కూర్చుని బ్రహ్మ “సృష్టి ఎలా చేయటమా” అని చింతించసాగేడు. “తపస్సుచేయి” అని ఆకాశవాణి వినిపిస్తుంది. ఆకాశవాణి ఈశ్వరాదేశంగా భావించి ఘౌర తపస్సు చేస్తాడు. తపోశక్తి ద్వారా సృష్టి నిర్మాణానికి కావలసిన శక్తిని సంపాదిస్తాడు. సృష్టికర్త కూడా పురుషార్థం ద్వారానే సృష్టి నిర్మాణానికి కావలసిన శక్తిని పొందినపుడు ఆ నియమం అతని సృష్టిలోని ప్రతిప్రాణికి వర్తిస్తుంది. ప్రగతి శీలురందరకూ ఈనాడు ఈశ్వరవాణి “తపించు” అనే సందేశాన్నే అందిస్తోంది. ఏదైనా పొందాలి అనుకుంటే ఆత్మదేవుని శరణు అనక తప్పదు.

విశ్వామిత్రుడు మహారాజు సేనతో సహా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళటం, కామధేనువు శక్తితో మహర్షి వారిని సత్కరించటం, కామధేనువుని రాజుకోరటం, మహర్షి తిరస్కరించగా బలవంతాన తీసుకుని పోవాలని ప్రయత్నించటం, కామధేనువు లక్షల సైన్యాన్ని ఉద్భవింపచేసి రాజు సైన్యాన్ని ఓడించటం మొదలైన సంఘటనల ద్వారా విశ్వామిత్రుడు బ్రహ్మ తేజం యొక్క శక్తిని ప్రత్యేకంగా చూచి, క్షాత్ర ధర్మాన్ని వదలి బ్రహ్మణత్వాన్ని పొందాలని నిశ్చయించుకొంటాడు.

ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలమ్ బలం అంటూ ఘౌరతపస్సు చేశాడు. అహంకారం మీద విజయం సాధించిన తరువాత తపోబలం ద్వారా ఆర్జించిన సామర్థ్యం అతన్ని బ్రహ్మర్షిని చేస్తుంది. ఈ బ్రహ్మ ఋషే తన యాగాన్ని రాక్షసులు ధ్వంసం చేసినా శపించక రాక్షస సంహార శక్తి లోకమంగళానికే తప్ప మరే ఇతర పనులకు వృధా చేయరని ఈ కథ ఋజువు చేస్తుంది.

జీవితం దైవశక్తి యొక్క సాకార రూపం. జీవితాన్ని ప్రార్థిస్తే ఫలితాలు అక్కడికక్కడే లభిస్తాయి. జీవితం ఈశ్వరుని కానుకకాదు ఈశ్వరుని ప్రతినిధి. జీవన సాధన ద్వారా ఈశ్వరసాధన కూడా జరిగి తీరుతుంది. ఈ సాధనతోనే ఎందరో సాధారణ మానవులు మహామానవులయ్యేరు. అనేక మంది జీవన దేవతలను గుర్తించక గుర్తించినా దురుపయోగం చేసుకుని హేయమైన జీవితాలు గడుపుతూ ఉంటారు.

దేవలోకం ద్వారా పంపబడిన ఒక విజ్ఞప్తి, ఆకాశం, పాతాళం, పృథ్వి ముల్లోకాలలో కలకలం సృష్టించింది. ఏడు రోజులలోగా ఎవ్వరైనా సరే చిత్రగుప్తుని ప్రయోగశాలలో అందవిహీనమైన ఒక వస్తువును ఇచ్చి, దానికి బదులు అందమైన వస్తువును పొందవచ్చునని ఆ విజ్ఞప్తిలో ఉన్నది.

బ్రహ్మ తన యోగదృష్టితో మూడు లోకాలు పరికించి చూశాడు. భూమిమీద ఒక్కవ్యక్తి తప్ప మిగిలిన వారంతా అందమైన వస్తువు కోసం చిత్రగుప్తుని ప్రయోగశాల ముందు బారులు తీరి ఉన్నారు. రాకుండా పృథ్వి మీద ఉండిపోయిన ఆ ఒక్క వ్యక్తి వద్దకు బ్రహ్మ వెళ్లి, వత్సా! మా విజ్ఞప్తి నీవు వినలేదా? లేక అందవిహీనమైన వస్తువు నీకేది దొరకలేదా? ఎందుకని నీవు రాలేదు? అని ప్రశ్నిస్తాడు. అతడు బ్రహ్మకు నమస్కరించి అయ్యా నేను రాకపోవటానికి మీరు అడిగిన రెండు కారణాలు కాదు. ఈ మానవ జీవితం కంటే కోరదగిన అందమైన వస్తువేదీ కనిపించలేదు. మానవ జీవితాన్ని దైవం ఎలాగ ప్రసాదించాడు. అనవసరంగా ఎందుకని రాలేదు అంటూ బదులు పల్కుతాడు.

ప్రహ్లాదునికి నారదుడు “నీ శక్తి దైవశక్తి కంటే భిన్నమైనది కాదు” అని విశ్వాసం కల్గిస్తాడు., “అసుర కులంలో పుట్టినా అసురత్వాన్ని స్వీకరించక దేవత్వాన్ని స్వీకరించు” అని ప్రేరేపిస్తాడు. ఈ పరామర్శ ప్రేరణ పరమాత్మను అసుర సంహారానికి అవతార మూర్తిగా దిగి వచ్చేలా చేశాయి. ప్రహ్లాదుని అసాధారణమైన వానిగా మార్చివేశాయి. ప్రహ్లాదునే కాదు అనేక మందిని ఇటువంటి ప్రేరణ, పరామర్శ మహా మానవులుగా మార్చి వేశాయి.

ఈశ్వారాంశ సంభూతుడు కావటం వల్ల మానవుడు నిశ్చయంగా గొప్పవాడు పరిపూర్ణుడే కానీ తనలోని కషాయ కల్మషాల వల్ల దీనంగా హీనంగా జీవిస్తున్నాడు. మలినమైన భవబంధనాలను ఎవరు ఎంతగా త్రెంచుకోగల్గితే వారికి ఈశ్వర సానిధ్యం అంత సరళంగా లభిస్తుంది. పరమాత్మతో సమానమైన శ్రేయస్సుతో జీవించినా, దీనంగా హీనంగా జీవించినా ఈ రెండింటికి బాధ్యుడు మానవుడే, వేరెవరూ కాదు

The Divine Power Within: Seven Timeless Lessons for Self-Transformation.

Leave a Comment