Inner Strength is the Greatest Wealth.

ఒక రాజు వద్దకు ఒక సేవకుడు వస్తాడు. అతడిని నీపేరేమిటి? అని రాజు ప్రశ్నిస్తాడు. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అంటాడు. ఏమి పని చేస్తావు? తినటానికి ఏమికావాలి? అని ప్రశ్నిస్తాడు రాజు. ఏది పెడితె అది తింటాను. ఏ పని చేయించుకుంటే అది చేస్తాను అంటాడు. రాజు కాస్త చికాగ్గా అయితే ఇంతకీ నీవు కోరేది ఏమిటో చెప్పు అంటాడు. సేవకుడు చేతులు జోడించి రాజా! యజమానికి తనను తాను సమర్పించుకోవటం తప్ప సేవకుడికి కోరికలంటూ ఏమీ ఉండవు అని బదులు పల్కుతాడు.

రాజు కన్నులు ఆనందంతో నీళ్లు నిండుతాయి. సింహాసనం దిగివచ్చి అతన్ని హృదయానికి హత్తుకుంటాడు. నాయనా ఈ రోజు నుండి నీవు నా గురువు. ఇంతవరకూ నేను నా కంటే గొప్పవాడైన పరమాత్మను ఇదికావాలి అదికావాలి అంటూ అడుక్కుంటూ బ్రతికాను. ఈనాడు ఆయన కృపను ఎలా పొందగలనో నీ ద్వారా నేర్చుకున్నాను అంటూ అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ తనవెంట తీసికెళతాడు.

కాలూరామ్ అనే ఆయన పుత్రునికి వ్యవసాయం పని ఒప్పగిస్తాడు. కొంత కాలం తరువాత వ్యవసాయం ఎలా సాగుతోందని, పంట ఎలాపండిందని కుమారుని ప్రశ్నిస్తాడు. కొడుకు ఆనంద పారవశ్యంతో నాన్న! నా శరీరం అనే పంటభూమిలో సత్కర అనే నాగలితో దున్ని ఈశ్వర భజన అనే విత్తనాలు జల్లి సత్సంగమనే ఎరువువేసి సంతోషమనే నీటితో తడుపుతున్నాను. ఎటుచూసినా ఆనందమే పంటగా పండి ఎట్టెదుట సాక్షాత్కరిస్తోంది. అని బదులు పల్కిన కొడుకును చూచి తండ్రి ఆశ్చర్యచకితుడవుతాడు. ఈ వ్యవసాయాన్ని చేపట్టిన బాలకుడు ఎవరోకాదు భక్తనానక్.

ఆత్మ బలాన్ని మించిన సంపద జీవితంలో మరేదీలేదు. ఈ సంపదను జగత్తును మంగళకరం గావించటానికి మహత్తరమైన ఉద్దేశ్యాలతో మహాత్ములు అతి పదిలంగా వినియోగిస్తారు. వ్యర్థంగా విలాసానికి స్వార్థానికి ఎంత మాత్రం ఖర్చు చేయరు.

నరోత్తముడు అనే ఆయన చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పక్షి అతనిమీద రెట్టవేస్తుంది. దాని వంక కోపంగా చూస్తాడు. అది భస్మమైపోతుంది. నరోత్తమునికి తన తపోబలం పట్ల అహంకారం కల్గుతుంది. ఒక రోజు భిక్షాటనకు వెళ్లి ఒక ఇంటిముందు నిలబడి, పతి సేవాపరాయణురాలైన ఆ ఇల్లాలు యొక్క ఆలస్యాన్ని భరించలేక ఆమె వంక కూడా కోపంగా చూస్తాడు. ఆమె నవ్వి “నేను పక్షిని కాదయ్యా భస్మం కావటానికి” అంటూ ఎక్కడో ఎప్పుడో జరిగిన సంఘటన నరోత్తమునికి గుర్తుచేస్తుంది.

తరువాత అతడు ఆ ఇల్లాలికి యోగవిద్య నేర్పిన తులాధరుని కలుస్తాడు. తులాధరుడు నరోత్తముని చూడగానే జరిగిన సంఘటలన్నిటిని గురించి చెప్పి ఆశ్చర్య చకితుణ్ణి చేస్తాడు. చూడకుండా ఎక్కడో జరిగిన సంఘటనలు చెప్పగల ఈ యోగవిద్య రహస్యాలు తెల్సుకోవాలంటే శివారుడు అనే ఛండాలుడి వద్దకు వెళ్లమంటాడు తులాధరుడు. ఛండాలుడు నరోత్తముని సగౌరవంగా ఆతిధ్యమిచ్చి అయ్యా! భూత భవిష్యత్తులు చెప్పగల ఈ యోగ విద్యను మేమంతా ఆత్నశక్తితోనే ఆర్జించుకున్నాము. దీనిని ఎన్నడూ స్వార్థానికి ఉపయోగించుకొని దురుపయోగం చేయలేదు. శ్రమదేవతను ఆరాధిస్తూ జీవయాత్ర సాగిస్తున్నాము. అందుకే ఈ విద్య దినదినాభివృద్ధి చెందుతున్నదని తెలియజేస్తాడు.

Inner Strength is the Greatest Wealth.

Leave a Comment