అంతర్గత శక్తి: అంతర్గత బలం నుండి ఆధ్యాత్మిక జాగృతి వరకు
ఒక దరిద్రుడు అందమైన రాజకుమార్తె పైన మనసుపడి ఆమెను పొందటానికి తన పురుష ప్రయత్నంతో అనంతమైన కృషి చేస్తాడు. లక్ష్యం అసంభవమైనదే అయినా సంకల్పం దృఢమైనది కావటంవల్ల అతడు సాధువుగా మారి ఆమెకై కఠోర తపస్సు చేస్తాడు. ధనవంతులు పేదలు అందరూ అతని తపోశక్తి గురించి విని అతని దర్శనార్థం రాసాగేరు. వారందరినీ చూచేసరికి ఆయన అంతర్నేత్రం తెరచుకొన్నది. ఏ దైవం పట్ల శ్రద్ధతో వీరంతా నా వద్దకు వస్తున్నారో అ దైవాన్ని నేను ఉపేక్షిస్తే నాగతి ఏమవుతుందోనని ఆలోచిస్తాడు. వెంటనే తన సామర్థ్యాన్ని కేవలం ఒక స్త్రీ సౌందర్యాన్ని పొందటం కోసంకాక శాశ్వత సౌదర్య మూర్తి అయిన పరమాత్మను పొందటానికి వినియోగించి, జన్మను చరితార్థం చేసుకొంటాడు.
జీవితం అంటే భయపడి పారిపోయి వచ్చిన నలుగురు ఒక చెట్టు క్రింద కూర్చుని సన్యసించాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. నలుగురు అడవిలో కూర్చుని తపస్సు చేయాలని దైవం ప్రత్యక్షమైనాక ఏమి వరాలు కోరుకోవాలని ఆలోచిస్తారు. తిండి లేకుండా జీవించలేము కాబట్టి తిండికి లోటు లేకుండా చూడమని వరం అడుగుతాను అంటాడు మొదటివాడు. శక్తి లేకుండా ఏమి ఉన్నా నిరర్థకం కాబట్టి శక్తిని ప్రసాదించమంటాను అంటాడు రెండవ వాడు. బుద్దిని ప్రసాదించమని కోరటం అన్ని విధాలా శ్రేయస్కరం అంటాడు మూడవ వ్యక్తి. నాల్గవ వ్యక్తి ఇవన్నీ భౌతికమైనవి; వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం ఆత్మశాంతి; దానినే కోరుకందాం అంటాడు.
ఇవన్నీ విని ఐదవ వాడు మీరంతా మూర్ఖులు ఇవన్నీ కోరటం దేనికి? ఏకంగా స్వర్గాన్నే కోరుకోవచ్చుగా! అక్కడ సర్వం ఉంటాయి అంటాడు. ఇవన్నీ విని వృక్షం బిగ్గరగా నవ్వి సోదరులారా! మీరు ఇవేమీ చేయలేరు. ఎందుకంటే ఈ పనులకు కావల్సిన మనోబలం మీవద్ద ఉంటే జీవితానికి భయపడి ఇలా పారిపోయి రారు. దైవాన్ని పొందాలంటే అసాధారణమైన ఆత్మబలం కావాలి. సాధన చేసి ముందు దానిని పొందండి. తరువాత తపస్సు – వరాలు గురించి ఆలోచించండి అంటుంది. అందరూ సిగ్గుతో తలవంచుకుని నిష్క్రమిస్తారు.
ఆత్మబలం ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోగల పాత్రత కరువైతే మనిషి పొందటానికి బదులు పోగొట్టుకొంటూ బ్రతుకుతాడు. ఒక వడ్రంగి గొడ్డలి నదిలో పడింది. నిశ్చల హృదయంతో, వడ్రంగి తనకు జీవనాధారమైన ఆ గొడ్డలి కావాలని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనకు ప్రసన్నరాలైన గంగామాత వెండి, బంగారు గొడ్డళ్ళు తెచ్చి ఇచ్చినా తనది కాని వస్తువు తీసుకోవటానికి నిరాకరిస్తాడు. మూడవ సారి తెచ్చిన తన గొడ్డలిని మాత్రమే స్వీకరిస్తాడు. అతని పవిత్రతకు నిజాయితీకి గంగ ప్రసన్నురాలై వెండి, బంగారు గొడ్డళ్ళు కూడా పారితోషికంగా ప్రసాదిస్తుంది.
కానీ ఇదంతా చూచి ఇటువంటి అనుగ్రహాన్ని పొందాలని ప్రయత్నించిన ఒక దురాశపరుడి అసత్యానికి గంగామాత ఆగ్రహించి, అఘాతం లాంటి ఈ నీటిలో దిగి నీదినీవు సంపాదించు అని చెప్పి అంతర్థానమౌతుంది. దైవం ఈ విధంగా వ్యక్తి యొక్క అంతరంగాన్ని అనవరతము పరీక్షిస్తూ ఉంటాడు. పాత్రతగల వారికి ప్రసాదిస్తూ తనను కూడా మోసగించాలని చూచేవారి నుండి లాక్కొంటూ ఉంటాడు.
శ్వేత కేతు ప్రశ్నకు సమాధానం ఇస్తూ వ్యావహారిక పక్షం గురించి పిప్పలాద మహర్షి ఇలా అన్నారు. దారిద్ర్యం దైవీప్రకోపం మొదలైన అనేక రూపాలలో దృష్టి గోచరమవుతున్న సూక్ష్మజగత్తులోని విక్షోభం మానవ నిర్మితమే. వ్యక్తి తన ఆలోచనలు ఆచరణలల్లో మార్పు తెచ్చుకోనంత వరకు సమాజాన్ని పరిస్థితులను ఏ విధంగాను మార్చలేడు. భూమిమీద స్వర్గాన్నైనా నరకాన్నైన సరే మనిషి తన ఆలోచనలు – ఆచరణల ప్రతిక్రియల రూపంలోనే దర్శిస్తున్నాడు. ఎట్టెదుట పరిస్థితులు మరింత విషమస్థితికి చేరే అవకాశాలు పొంచి ఉన్నాయని మహర్షి తెలియజేశారు.
ఒక గురువుకు ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇద్దరూ కృషీవలురు, దైవభక్తులు. ఏ కొఱతా లేనివారు. ఐనా ఇద్దరిలో ఒకడు ఎప్పుడూ దుఃఖమయ జీవితాన్ని గడిపేవాడు. కాలక్రమేణా గురువు శిష్యులు కూడా మరణించారు. కానీ స్వర్గంలో మళ్ళీ ముగ్గురూ కలుస్తారు. స్వర్గంలో కూడా పరిస్థితి యథాప్రకారంగానే ఉంది. దుఃఖభాగ్యుడైన శిష్యుడు గురువుని సమీపించి దేవా! ఈశ్వర భక్తి పరాయణులైన వ్యక్తులు స్వర్గంలో తప్పక సుఖాలు పొందుతారని అంటారు కదా; మరి నా పరిస్థితి ఇక్కడా ఇలాగే ఉందేమి? అని ప్రశ్నిస్తాడు. గురువు సానుభూతితో చూస్తూ వత్సా! భగవద్భక్తి స్వర్గాన్ని ప్రసాదిస్తుంది. సుఖ దుఃఖాలని కాదు. సుఖ దుఃఖాలు మనస్సుకు సంబంధించినవే కానీ స్వర్గానికో నరకానికో కాదని బదులు పల్కుతాడు.
