ప్రతాప భానుడనే ఆయన సమస్త శత్రురాజులను ఓడించి వైభవాన్ని సంపదను సంపాదించి ప్రజలకు సమృద్ధిగా పంచిపెట్టి కీర్తివంతుడు కాగలిగాడే కానీ అహంకారాన్ని మాత్రం వదలుకోలేక పోయాడు. ఎంత గొప్ప వాడైనప్పటికీ అహంకారపూరితమైన ఆలోచనలకు వశుడవటం వలన అతడు శత్రురాజుల కపటానికి, బ్రాహ్మణ శాపానికి గురియై మరుజన్మలో రాక్షస యోనియందు రావణుడుగా జన్మిస్తాడు. ఇంచుమించు రాక్షసుల జీవిత చరిత్రలు ఎవరివి చూచినా వారి భ్రష్ట చింతనలు, దుష్టాచరణలే వారికి ఆ స్థితి కల్పించినట్లు చరిత్ర తెలియజేస్తోంది.
నికృష్ట చింతనలతో నిండిన మనస్సు దైవం ఎట్టెదుట సాక్షాత్కరించినా గుర్తించలేదు. దైవం నిశ్చల హృదయంలో మాత్రమే ప్రవేశించాలని ఆతృతపడుతూ ఉంటాడు.
ఒకసారి భార్యభర్తలు బిడ్డనెత్తుకుని బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. పార్వతికి వారిమీద జాలికల్గి నాథా! నీ సృష్టిలోకూడా ఇంతటి అసహాయులు ఉంటే ఎలా? వారి దుఃఖాన్ని నీవు దూరం చేయలేని నాడు నీ బిరుదు దండగ అంటూ నిందించటంతో శివునికి వారిముందు ప్రత్యక్షమవ్వక తప్పలేదు. పరమశివుడు ఆ అసహాయుల్ని మూడు వరాలు కోరుకోమంటాడు. భార్య తనకు 20 సంవత్సరాల వయస్సుతో యవ్వనాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది.
భార్యను నవయవ్వనంలో చూచి భర్త కోపోద్రిక్తుడౌతాడు. శివుడు అతన్ని వారిస్తూ నీవు ఒక వరం కోరుకోమంటాడు. కోపంతో మండిపడుతున్న భర్త భార్యను పందిగా మార్చుమని వరమడుగుతాడు. ఇది చూచి పిల్ల రోదించసాగింది.
ఆమెను వారిస్తూ మూడవ వరం ఉందిగా నీవు కూడా కోరుకోమని ఊరడిస్తాడు. మా అమ్మకు తిరిగి యథాస్థితి కల్పించమని పిల్ల మూడవ వరం కోరుకుంటుంది. ఈసారి కూడా శివుడు తథాస్తు అంటాడు. శివుడు ఉదారంగా వరాలివ్వటం, ఐనా వారు ఉపయోగించుకోలేక ఎలా ఉన్నవారు అలాగే మిగలటం చూచి పార్వతి పరమేశ్వరునికి నమస్కరిస్తూ, నాథా! దైవం ఎట్టెదుటకు వచ్చి వరాలిచ్చినా మలినమైన మనసులే బయట పడతాయనేది ప్రత్యక్షంగా చూశాను నన్ను మన్నించమని అడుగుతుంది.
సుందోపసుందులనే సోదరులు అతి పరాక్రమ వంతులు. వీరికిగల ప్రేమ ఐక్యతల కారణంగానే వారెందరో దేవతలను జయించగలిగారు. కానీ తిలోత్తమ అనే సుందరిపట్ల ఇద్దరి మనస్సుల్లో ఉద్భవించిన కామవాసనల కారణంగా పరస్పరం కలహించి మరణిస్తారు. ఎవ్వరిచేత చంపకుండా వరాన్ని పొందిన వీరు తమలో ఉద్భవించిన మనోవికారం కారణంగానే సునాయాసంగా మరణించారు.
దైవం ప్రకాశపుంజం సూర్యోదయం కాగానే అంధకారం పలాయనం గావించినట్లు ఆత్మశోధన, ఆత్మ నిర్మాణం ద్వారా వ్యక్తిత్వం వికసించగానే సమస్త విపత్తులు, దుఃఖాలు దూరమైపోతాయి. కాంతిరూపుడైన దైవానికి జీవాత్మకు మధ్యనున్న అంధకారం పురుషార్థం ద్వారా దూరం చేసుకోకుండా ఆయన కాంతికిరణం ఒక్కటైనా లభించదు.
ఒక దొంగ రోజూ ఒక మహత్ముని వద్దకు వచ్చి ఈశ్వరుని దర్శించగల ఉపాయం చెప్పమని అడిగేవాడు. సమయం వచ్చినపుడు చెబుతానని చెప్పి పంపిస్తూండేవాడు. ఒక రోజు దొంగ ఒత్తిడి చేయటంతో తనవెంట ఆరు రాళ్ళను నెత్తిన పెట్టుకొని ఎదురుగా ఉన్న పర్వతశిఖరం మీదకు నడచి రమ్మంటాడు. కొంత దూరం నడచి ఇంక నడవలేక దొంగ కూలబడతాడు.
మహత్ముడు ఒక రాయి బరువును తొలగిస్తాడు. ఇలా నడుస్తూ నడుస్తూ దొంగ అలసినప్పుడల్లా ఒకొక్క రాయి చొప్పున తొలగించి సునాయాసంగా శిఖరాన్ని చేరుకొంటారు. గమ్యం చేరిన తర్వాత మహత్ముడు దొంగవంక చూచి నాయనా! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే ఆరు రాళ్ల భారాన్ని తొలగిస్తే గానీ ఈశ్వర దర్శనం లభించదు. ఇప్పుడు నీవు బరువు దించుకన్నట్లే ప్రతి జీవి ఈ ఆరురాళ్ళ భారాన్ని దించుకున్న తక్షణం బ్రహ్మానందాన్ని పొందగలడు అని తెలియజేస్తాడు.
నవ దీక్షుతుడైన శిష్యుడు ఉపాసనలో మనస్సు లగ్నం కావటల్లేదంటూ గురూజీ దగ్గర బాధపడతాడు. గురువు గంభీర దృష్టితో శిష్యుని పరికించి ఇక్కడ నీకు ధ్యానం కుదరదు వేరే చోటికి వెళ్లి సాధన చెయ్యమని ప్రయాణం చేస్తాడు. ఇద్దరూ బయలుదేరి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో దాహం వేసి చేతిసంచి గురువుకి ఇచ్చి పదేపదే వెనుదిరిగి సంచివంక చూస్తూ దాహం తీర్చుకోవటానికి నూతి వద్దకు వెళతాడు. ఇది గమనించిన గురువు చేతి సంచిని అమాంతం నూతిలోకి విసిరి వేస్తాడు.
శిష్యుడు ఆత్రంగా గురుదేవా! సంచిలో బంగారు కాసులున్నాయి. విసిరేశారా? అని గాభరా పడతాడు. గురువు కాసులున్న సంగతి తనకు తెలిసే విసిరానని ఇకపైన ఎక్కడున్నా నీ మనస్సు సాధనలో లగ్నమవుతుందని తెలియచేస్తాడు.
మనసు నుండి కాంక్ష, మమకారం తొలగిస్తేగానీ మనసు ఈశ్వరుని యందు లగ్నం కాదని శిష్యునికి ఆ క్షణంలో అవగతమవుతుంది. వాయస యోనియందు జన్మించి కూడా కాకాభుశుండి అమరుడు కాగలిగాడు. గతచరిత్ర చెప్పుకోవలసింది కాకపోయినా అతని ఆత్మశోధనే ఆ శ్రేయస్సును అహంకరించి తన గురువును అవమానించిన కారణంగా వేయిసార్లు కీటకం, పక్షి యోనుల్లో జన్నించింది.
అంతిమ యోనియందు బ్రాహ్మణుడైన లోమశ మహర్షి ఆశ్రమంలో కుతర్కం, దురగ్రహం ప్రదర్శించిన కారణంగా వాయసంగా జన్మించింది. మహర్షి ఆశీర్వాదం వల్లనే వాయసంగా పుట్టినా దానికి ముక్తి, రామభక్తి లభించాయి. జ్ఞాన వైరాగ్యాలను గూర్చి వాయస యోనియందే బ్రహ్మాండమైన ఉపదేశాలనిచ్చింది.
