ఎవరైతే ఐశ్వర్యాన్ని పొంది అహంకారంతో, బద్దకంతో ఉంటారో అట్టివారు పతనంచెందుతారు.

ఐశ్వర్యం యొక్క రక్షణ కేవలం నిగ్రహాన్ని పాటించటం వల్లనే సాధ్యమౌతుంది. ఎవరైతే ఐశ్వర్యాన్ని పొంది అహంకారంతో, బద్దకంతో ఉంటారో అట్టివారు పతనంచెందుతారు.
సుఖభోగాలకు దాసులైన దేవతలకంటే కూడా అపరిమితమైన ఐశ్వర్యం మానవ దేహంలో ఉన్నది. ఈ సంపదను నియమపాలన ద్వారా సద్వినియోగం చేసుకొన్నట్లయితే పరాభవం అనేది దగ్గరికి రాదు. దేవతలను సయితం పరాజితులను చేసిన అసురులు పశుప్రవృత్తుల రూపంలో మనలో కూడా నిసిస్తూనే ఉన్నారు. వివేకవంతుడు సమర్థుడు అయిన వ్యక్తి ఈ పాశవిక ప్రవృత్తులకు తాను లొంగక వాటినే లొంగదీస్తాడు.
సాధారణ జనులు సర్వం తెలిసి ఉండి, సర్వం తానే చేస్తూ ఉండి కూడా తెలియనట్లు తమ దుఃఖాలకు అవమానాలకు మాత్రం బయట ఎక్కడో కారణాలను వదకుతూ ఉంటారు. వీరు తమలోనే ఉండి తమ ద్వారానే ఏర్పడిన కన్నాలను గుర్తించి పూడ్చివేసి జీవశక్తిని సంరక్షించుకొని ప్రవాహ మార్గాలను ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేసుకొన్నట్లయితే జీవనశక్తి సార్థకమైన జీవన దేవత ప్రసన్నురాలవుతుంది.
జీవన సంపద: (1) ఇంద్రియశక్తి (2) సమయశక్తి (3) ఆలోచనాశక్తి (4) సాధనశక్తి అను నాల్గు విధాలుగా వ్యక్తికి లభిస్తోంది. మొదటి మూడు శక్తులు ఈశ్వరుడు ప్రసాదించినవి. నాల్గవది ఈ రెండింటి యొక్క సమిష్టి ప్రయత్నం వల్ల వ్యక్తి తన పురుషార్థం ద్వారా భౌతిక జగత్తులో ఆర్జించవలసి ఉంది. దైవం ఇంద్రియ, సమయ, వాక్ శక్తుల రూపంలో దైవీ సంపదను నిష్పక్షపాతంగా ప్రసాదిస్తున్నాడు. ఒక వేళ ఏదైనా లోటు ప్రారబ్ధం వల్ల వ్యక్తికి ఏర్పడినప్పటికీ ఆ శక్తి ని కూడా మరోశక్తి రూపంలో రెట్టింపుచేసి ప్రసాదిస్తాడే గానీ దైవం పక్షపాతం చూపే ప్రసక్తిలేదు.
సాధన శక్తి ఒక వేళ లోపించినప్పటికీ దైవదత్తమైన వాక్కు ను సార్థకం చేసుకుంటూ, సమయ సంపదను సదుపయోగం చేసుకుంటూ, ఆలోచనా శక్తిని ప్రక్కదారులు పట్టించకుండా కాపాడుకొన్నప్పుడు కూడా వ్యక్తి సమస్త సాధనాలు సమకూర్చుకుని సమృద్ధితో జీవించగలడు. అంతేగాక ఈ సంపద దైవదత్తమైనదిగా ఎందుకు పేర్కొనటం జరిగిందంటే దైవం వీటిని చాలా ఆలోచించి, సమాజ కళ్యాణానికి ఉపయోగపడే మహత్తరమైన సాధనాలుగా నిర్ణయించి మానవునకు ప్రసాదించటం జరిగింది.
ఒక శిష్యుడు గురువుతో, గురుదేవా! “సమస్త సంపదలు దైవదత్తమైనవి” అని మీరు చెబుతూ ఉంటారు. కానీ వ్యక్తి తన దైనందిన జీవితంలో పూజలు, ఉపాసనలు, ముడుపులు ఇవేమీ చేయకుండానే తన పురుషార్థం ద్వారా హద్దులేని సంపదను ఆర్జించటం మనం కళ్ళార చూస్తున్నాం. నీవు సంపాదించినది, దైవదత్తమైనది అంటే అతడు ఊరుకొంటాడా? అని ప్రశ్నించాడు.
గురువు మందహాసం చేసి, నయనా! పురుషార్థం ద్వారా సంపాదించినది అనుకొంటున్న ఆ సంపదను వ్యక్తి, దైవదత్తమైన సమయం, శ్రమ, శక్తి ఇవేమి ఉపకరించకుండా ఆర్జించగల్గుతున్నాడా? కావాలను కొన్నంత ఆర్జించి తన ఉద్దేశ్యాన్ని పూర్తిగావించు కొన్నానని భావించే వ్యక్తులు కూడా శ్రమించటం పట్ల బద్దకించినా, ఇంద్రియాలలో అస్తవ్యస్తత ఏర్పడినా ఆలిచనలు ప్రక్కదారులు పట్టినా, సమయాన్ని దుర్వినియోగం చేసినా, వీటన్నింటిలో ఏ ఒక్కటి వ్యక్తి లో చోటుచేసుకున్నా లక్షాధికారి భిక్షాధికారిగా మారి అశక్తుడు అభాగ్యుడు కాక తప్పదు అంటూ గురువు శిష్యునకు విషయాన్ని విశదీకరిస్తాడు.
శిష్యుడు గౌతమ బుద్ధునితో “స్వామీ! బౌద్ధ మత ప్రచారానికై విశ్వమంతా పరివ్రాజకులుగా పంపుతున్న దూతల వద్ద ఎలాంటి సాధన సంపత్తి లేదాయె. వారు జీవన యాత్ర ఎలా సాగిస్తారు? ” అని ప్రశ్నించాడు. బుద్ధుడు శిష్యుని వంక వాత్సల్యంతో చూస్తూ ” నాయనా! పరివ్రాజకులు వారి వెంట ఈశ్వరుని ద్వారా ప్రసాదించబడిన ఒక విశిష్ట సంపదను వెంట పెట్టుకొని వెళుతున్నారు. ఇంద్రియశక్తి, సమయం, ఆలోచనలు ఇవి అమూల్యమైన విభూతులు. వీటి ద్వారా ఎక్కడకు వెళ్లినా సహకారం, శ్రద్ధ, గౌరవం, సంపద ఏది కావాలంటే దానిని పొందగలరు. ఆలోచనా క్రాంతి యొక్క అగ్రదూతలుగా వారు సర్వత్రా వ్యాపిస్తారు అని బదులు పల్కుతాడు.
సాధనలు వైభవం దృష్టితో చూస్తే భారతదేశం కంటే ఎంతో ఉచ్చస్థితిలోనున్న విదేశాలలో కూడా బౌద్ధస్తూపాలు అనేకం విస్తరించాయి. గౌతమ బుద్ధుని యొక్క “సాధనా విహీనమైన పరిభ్రమణం” ఏ విధంగా దిగ్ దిగంతాల వరకు వ్యాపించిందో మనం ఈనాడు కన్నులారా చూస్తున్నాం. కుమార జీవుడు, సంఘమిత్ర, మహేంద్రుడు మొదలైనవారి త్యాగం అవిస్మరణీయమైనది.