Life is Like a Kamadhenuvu

“జీవితం” కామధేనువు.

Life is Like a Kamadhenuvu

ఈగలు రెండు రకాలు. ఒక రకం ఈగలు తేనె తప్పించి వేరే ఏమి తినవు. వీటిని తేనె టీగలు అంటారు. రెండవ రకం ఈగలు కూడా తేనెపట్టుని పట్టుకుని ఉంటాయి. కానీ ఎక్కడైనా కుళ్ళిన పదార్థాలు కనిపిస్తే దానిని వదిలి అటు పరుగుపెడతాయి. ఇదేవిధంగా ప్రజల మనస్తత్వాలు కూడా రెండు విధాలు. ఒక రకం వ్యక్తులు సంసార బంధనంతో అనురక్తులై ఉంటారు. వీరిని ఈశ్వర చింతనలోనికి లాక్కొని వచ్చినా, వారు అక్కడ నిలువక విషయాసక్తికరమైన చర్చ వినిపిస్తే చాలు కుతూహలంతో పరుగు పెడుతూ ఉంటారు అంటూ ఈ కథ శ్రీరామకృష్ణ పరమహాంస చెబుతూ ఉండేవారు.

“జీవితం” కామధేనువు. ఈ కామధేనువు యొక్క పాలను బెజ్జం ఉన్న పాత్రలోనికి పితికితే మనం ఎలాగ పొందగల్గుతాం? ఆ పవిత్ర క్షీరం వల్ల కించిత్తు లాభం మనకు దక్కదు.

నిగ్రహలేమి రూపంతో ఏర్పడిన బెజ్జాలను వ్యక్తి పూడ్చగల్గినట్లయితే కామధేనువు యొక్క క్షీరాన్ని పదిలంగా కాపాడి ఉపయోగించుకోగలుగుతాడు.

జీవితం అనేది ఒక యుద్ధభూమి. మానవుడు అనవరతము ప్రతికూల వాతావరణంతోను, చిరసంచిత ప్రవృత్తులతోను, కూడని ఆలోచనలతోను యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఋతువుల పరివర్తన ద్వారా ఏర్పడిన పరిస్థితుల నుంచి వాతావరణంలోని ప్రతికూల పరిస్థితుల వరకు అన్నింటి మధ్య ఊగిసలాడుతూనే ఉంటాడు. దైవం మానవునికి ఎంతటి ప్రతికూల పరిస్థితులలోను కూడా జీవించగల యోగ్యుడుగా జన్మను ప్రసాదించేడు.

జీవన శక్తికి మనోరూపంతో పోరాటం సాగించగల సాహసాన్ని, దానిని రోగగ్రస్థం కాకుండా కాపాడగల సామర్థ్యాన్ని ప్రసాదించేది ఒకే ఒక అనుగ్రహం ద్వారా లభిస్తోంది. ఆ అనుగ్రహాన్నే నియమపాలన అంటారు. దీనిని సక్రమంగా నిర్వర్తించే వారికి శోకం లేదు. దుఃఖం రాదు. జీవిత సంగ్రామంలో ఓటమి అంతకంటే లేదు. అస్తవ్యస్థమైన విచ్చలవిడి ఆలోచనలు నియమ నిగ్రహాలను పాటించే వ్యక్తిని కాస్తకూడా ప్రభావితం చేయజాలవు.

సంయమము సంఘర్షణ ఇవి రెండు ఒకదానికొకటి పర్యాయవాచిక పదాలు. మానవుడు జీవన దేవత యొక్క ఉపాసన ద్వారా తన జీవన రసాలను మురుగు కాల్వలగుండా ప్రవహించనీయక సృజనాత్మకమైన ఆలోచనలు ఆచరణల్లో వినియోగించినట్లయితే జీవన దేవతోపాసన ఫలించితీరుతుంది.

విషయాసక్తులైన మానవుల మనస్సు పేడపురుగు వంటిది. పేడపురుగు పేడ తప్పించి, ఇంక ఎంత గొప్ప పదార్ధం కూడా రుచించదు. బలవంతాన మనం పేడపురుగును పేడ నుండి తొలగించి కమలపుష్పం మీద పెడితే అది భరించలేక విలవిలలాడిపోతుంది. ఇదే విధంగా విషయ వాసనలో అనురక్తులైన వ్యక్తులకు అటువంటి మాటలు, వాతావరణమే తప్పించి పారమార్థికమైన వాతావరణం, విషయాలు రుచించవు. కేవలం ఈ కారణం చేతనే వీరు విద్య, ఆరోగ్యం, గౌరవం, సంపద అన్నింటి దృష్ట్యా కూడా దీనంగా హీనంగానే జీవితాలు సాగిస్తూ ఉంటారు అని శ్రీరామకృష్ణ పరమహంస తెలియజేశారు

పిప్పలాద మహర్షి జీవితాన్ని కామధేనువుతోను, జీవిత రసాన్ని కామధేనువు క్షీరంతోను పోల్చటం జరిగింది.

ఎత్తుమీదికి ఎక్కాలంటే తడబడే పాదాలను ముందు నిలద్రొక్కుకోవాలి అనే సత్యం శాశ్వతమైనది. అపవ్యయాన్ని అరికట్టటం మొదటి అడుగైతే ఆర్జన రెండవ అడుగు. ఒకవైపు అధిక సంపాదనకు అర్రులుచాస్తూ మరొకవైపు దుబారా చేస్తూ ఉంటే ఆర్జించిన ప్రయోజనం ఏముంటుంది? అపవ్యయాన్ని అరికట్టి ఆర్జించినదాన్ని సద్వినియోగం చేయటం జీవన దేవతోపాసకుల కర్తవ్యాలలో ముఖ్యమైనదిగా పేర్కొనబడింది.

ఇద్దరు మహాత్ములు తీర్థయాత్రకు బయలుదేరి వెళుతూ ఒక విశాలమైన వృక్షం క్రింద కొంత సేపు విశ్రమించి ముందుకు సాగిపోయారు. తిరిగి సంవత్సరం తరువాత ఆ విశ్రమించిన చెట్టు గల ప్రాంతానికి వచ్చి చూడగా ఆ మహావృక్షం నేలకు ఒరిగిపోయి ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో చెట్టు నేలకు ఎలా ఒరిగిందని ఒక మహాత్ముడు రెండవ మహాత్ముని ప్రశ్నించాడు. చెట్టు మొదట్లో చెదపట్టి కన్నాలు పడటం వల్ల చెట్టు నేలకొరిగిన సంగతి మహాత్ముడు తెలియజేస్తాడు.

మానవుడు నిరంతరం ప్రవహించే జీవన రసాన్ని సహజ ప్రవాహ దిశగా ప్రవహించనీయక స్వార్థలాభాలకోసం ప్రవాహానికి అడ్డువేసి, తనకు కావల్సిన విధంగా దానిని ఉపయోగించంకోవటానికి కావలసిన దగ్గర గట్టుని కొట్టి కన్నాలు ఏర్పరుస్తూ ఉంటాడు. ఆ విధంగా జీవన ప్రవాహ సహజ మానవుని స్వార్థానికి గురియై వ్యర్థంగా ఇంకిపోతున్నాయి.

Leave a Comment