చెయ్యాలనే ఇష్టం ఉంటే ఎవరు వద్దన్నా చేస్తాము.

ఆర్యసమాజంలో ప్రసిద్ధ నాయకుడైన స్వామి శ్రద్ధానంద యువకుడుగా ఉన్నప్పుడు ఒకనాడు జూదంలో డబ్బులన్నీ కోల్పోయి, ఆ రోజు మాంస భక్షణకు వీలులేక, మద్యపానం మత్తులో పడుతూ లేస్తూ ఒక వేశ్య ఇంటికి వెళ్లి రాత్రంతా గడిపి ఆకలితో ఇల్లు చేరుకుంటాడు.
అతని రాకకై ఎదురుచూస్తూ అతని ఇల్లాలు రాత్రంతా నిద్రపోక, భర్త ఇల్లు చేరగానే దుర్వాసనతో కూడిన దుస్తులు మార్చి, పాలు వేడిచేసి త్రాగించి ప్రేమతో పాదాలు ఒత్తుతూ నిద్రపుచ్చింది. కొంత తెలివిలోకి వచ్చిన తరువాత భార్య సేవలు, ఆమె పరిస్థితి గమనించి, ఇలా కూర్చునే ఉన్నావు! రాత్రి భోజనం చేశావా! అని అడుగుతాడు భర్త. మీరు తినకుండా నేనెలా తింటానని ఇల్లాలు వినయంగా బదులు పల్కుతుంది.
ఆ స్థితిలో కూడా తనని అసహ్యించుకోకుండా, అంతటి భక్తిశ్రద్ధలు చూపగల భార్యను చూసేసరికి అతని హృదయం చలించింది. తన నీచకృత్యాలను క్షమించమంటూ ఆమెను అర్థస్తాడు. ఆమె వారిస్తూ, స్వామి! నీవు నా ఆరాధ్య దైవానివి. నన్ను క్షమించమని అడగటం ద్వారా నాకు పాపాన్ని అంటకట్టవద్దు. నా పరమేశ్వరుడినైన నీకు సేవలు చేయటం నా కర్తవ్యం అంటూ అతడికి నమస్కరిస్తుంది. ఆరోజు పూర్తిగా అతని జీవితాన్ని మార్చివేసింది. ప్రతి వ్యసనపరుల జీవితంలోను ఇటువంటి ఒకరోజు తప్పక ఉండి తీరుతుంది.
కోతి సహజంగా చంచలమైనది. చంచలమైన ఈ జంతువు ద్వారా అతి ప్రధానమైన సృష్టి కార్యక్రమాలు నిర్వహించ బడతాయని ఎవ్వరూ ఊహించటం గానీ ఆశించటం గానీ చేయరు. ఉత్కృష్టమైన పనులకు మూర్ఖవానరాన్ని ఎవరు ఎంచుకొంటారు? కానీ ఇదే కోతి రామకార్యంలో నిమగ్నమైనపుడు రాముడు ఈ కోతిపై అపారమైన అనుగ్రహాన్ని వర్షింపచేశాడు. దానితో సహజంగా చంచల స్వభావురాలైన కోతి అద్భుతమైన క్రమశిక్షణతో సేవకుడిగా మారి, సేతుబంధనంలో, అసుర సంహారంలో ఒకటేమిటి, మహత్ కార్యాలన్నింటిలోను భాగస్వామ్యం వహించి ధన్యురాలైంది.
భక్తి కి ప్రమాణం ఎవరు ఏఏ సిద్ధులు పొందేరని కాదు. సాధకునికి ఈశ్వరుని పట్ల నిజమైన భక్తి ఉంటే విశ్వంలోని ప్రతీ ప్రాణి యొక్క బాధ తన బాధేనని గుర్తించగల స్థితికి చేరుకొంటాడు. నిజమైన భక్తి వ్యక్తిని సద్గుణాల రాశిగా సాధరణ పౌరుడిగా జీవింపచేస్తుంది. సృష్టిలోని సాధనసంపత్తులన్నింటిని ప్రతి ప్రాణి అవసరానికి సమానంగా ఉపయోగించుకోగల స్థితిని సమాజానికి కల్పింస్తుంది. ఇటువంటి భక్తజనులే భూమిమీద దేవతలు. వీరికి భగవంతుని అపారమైన అనుగ్రహం కోరకుండానే లభిస్తుంది.
చక్రవర్తి అయిన హర్షవర్ధనుడు సర్వమేధ యజ్ఞం చేసి తన సమస్త సంపదను పరమార్థానికి వినియోగించి, కేవలం జీవిత నిర్వహణకు తప్పనిసరి అయిన సాధనాలతోనే కాలం గడుపుతాడు.
జనకుడు మహారాజు అయి ఉండి ఋషి జీవితాన్ని గడుపుతాడు. విదేహుడు అనే నామంతో జీవన్ముక్తుడిగా జీవితాన్ని చరితార్థం చేసుకొంటాడు.
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ తన సంపాదనలో వీలైంత తక్కువ సొమ్ముతో జీవితాన్ని గడిపి, మిగిలినదంతా సమాజ కల్యాణానికి ఖర్చు చేసేవాడు. భక్తి అంటే ఇటువంటి ఔదార్యం మాత్రమే.