ప్రకృతి మనకందించిన జ్ఞానాన్ని, ప్రపంచానికి అందించలేకపోతే ప్రకృతి ఆ జ్ఞానాన్ని వెన్నకి తీసుకుంటుంది.

స్వామి రామతీర్థుడు ప్రసిద్ధి చెందిన భారతీయ విద్వాంసుడు. అధ్యయనం పట్ల వీరికి గల ఆసక్తి, సున్నిశితమైన బుద్ది చూచి లాహోర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావితుడై రామతీర్థుని సివిల్ సర్వీస్ పరీక్షకు పంపాలని నిర్ణయిస్తాడు. రామతీర్థునికి ఈ విషయం తెలియగానే ఆయన ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి నమస్కరించి, అయ్యా! నేను నా పంటతో లాభాలు గడించాలని దానిని అమ్మలేదు. నేను పండించిన పంట పదిమందితో కలసి పంచుకొని తినటానికి పండించాను కాబట్టి పెద్ద ఆఫీసర్ని కావాలనే కోర్కెనాకులేదు. నేను సేవకుడిని. సేవ చేయటానికి పుట్టిన వాడిని కాబట్టి సేవచేస్తాను. దీనికి ఆఫీసరు పదవి అవసరం లేదు. అధ్యాపక వృత్తి సరిపోతుంది అని తెలియజేస్తాడు. ప్రిన్సిపాల్ ఎంత చెప్పిన వినక తన నిర్ణయం పట్ల ధృఢంగా నిలబడతాడు.
తనకున్న జ్ఞానాన్ని కర్మ మార్గంతో జోడించగల ప్రతివ్యక్తి స్వామి రామతీర్థునిలా నాటిన విత్తనాలకి అనేక రెట్లు ఫలితాన్ని పొందగల్గుతాడు. ఈ విధమైన ఆత్మబోధ ఎవరికి ఎప్పుడు కల్గినా వారు మహానుభావులుగా కీర్తించబడతారు.
ఈ ఆత్మప్రేరణ, ఆత్మబోధ గురు కృపవలన లభిస్తాయి. దీనిని జీవిత క్షేత్రంలోని ప్రథమ ఫలంగా చెప్పవచ్చు. ఈ కృపను పొందిన వ్యక్తి అభ్యుదయ ద్వారాలను సునాయాసంగా తెరచి పరమలక్ష్యదిశగా తన పయనాన్ని అవలీలగా సాగించగల్గుతాడు. ఆధ్యాత్మ క్షేత్రంలో మార్గదర్శకుని పాత్ర అత్యంత మహత్వపూర్ణమైనది. పురుషార్థం తన పని తాను నిర్వర్తించినప్పటికీ, నలుదిక్కులా వ్యాపించిన భ్రమల సాలిగూటి నుండి బయట పడవేసి లక్ష్యం వైపు వేలు పట్టుకొని నడిపించగలవాడు గురువు మాత్రమే.
జీవితం ఎందుకు లభించింది? జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి? అనేవి తెలియజెప్ప గలవాడు కూడా గురువు ఒక్కడే. ఆత్మ ప్రగతికి ద్వారాలు ఒక్కసారి తెఱుచుకోబడితే చాలు మార్గంలో ఏ అవరోధం లేకుండా పయనం సునాయాసంగా సాగిపోతుంది.
భక్తకబీరు “భగవంతునీతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచగలవాడు గురువే కాబట్టి గురువుని ఎంతగా కీర్తించినా ఇంకా అది తక్కువనే చెప్పాలి అంటాడు.
పరమహంస, చాణక్య, సమర్థ గురు రామదాసు, బుద్దుడు, ప్రాణనాథ మహాప్రభువు, గాంధీ వీరికి లభించిన శిష్యులకు ఆత్మబోధ కల్గించటం వల్లనే వివేకానందుడు, చంద్రగుప్తుడు, శివాజి, ఆనంద్, అశోకుడు, ఛత్రసాల్, నెహ్రు, పటేల్ వంటి మహానుభావులు ఆవిర్భవించేరు. గురువు అనేవాడు అలభ్యమైన పారసమణి వంటివాడు. గురువు తన స్పర్శ మాత్రం చేత లోహపు ముక్కలను కూడా బంగారంగా మార్చివేయగలడు.