From Attachment to True Love – A Path of Service, Compassion and Dharma.

అంతరంగంలో మోహం అనేది చుట్టుముట్టియున్న ఒకే ఒక స్థానం ఖాళీ అయినప్పుడు మాత్రమే ఆత్మీయత అనేది అంతరంగంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. కేవలం ఒకే ఒక మోహం నుండి ముక్తి లభిస్తే చాలు, అన్ని దిక్కులు ‘తనవే’గాను; ‘సర్వమానవులు తనవారుగాను’ అనిపించటం మొదలవుతుంది.

శ్రావస్తీనగర నివాసి మాతా విశాఖ, తథాగతుని ఒకసారి తన ఆతిథ్యం స్వీకరించుమని ఆహ్వానించింది. బుద్ధుడు వెళ్ళగా, ఆమె మనమడు మరణించటం వలన దుఃఖిస్తూ నా మనుమని తిరిగి పునర్జీవితుని చేయుమని ప్రార్థిస్తుంది. బుద్ధుడు ఆమెను ఓదారుస్తూ, అమ్మా! ఈ నగరంలో ప్రతినిత్యం ఎందరో మరణిస్తూనే ఉన్నారు. వారందరూ నీ మనుమలు, పుత్రులుకారా? కాబట్టి ఏదో ఒకనాడు వియోగంతో దుఃఖాన్ని ప్రసాదించే వ్యక్తులు, వస్తువుల వలన లభించే సుఖాన్ని పొందాలని ఆశించకు.

కేవలం సేవ ద్వారా లభించే సుఖం మాత్రమే శాశ్వతమైనది. దానిని పొందటానికి అనంతమైన ప్రపంచం నీముందు ఉన్నది. కాబట్టి నీకు చేతనైనంత సేవచేసి శాశ్వతమైన సుఖాన్ని పొందటానికి ప్రయత్నించు. ఈనాడు నీ మనుమని నేను జీవింపచేసినప్పటికీ అతను ఏదో ఒకనాడు నీకు దూరమై దుఃఖాన్ని కల్పించక మానడు. కాబట్టి శాశ్వత ఆనందమార్గాన్ని చూపిస్తాను రమ్మని వెంట తీసుకొని వెళ్తాడు.

ఒక మందిరంలో పూజారి విధి విధానాలతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దేవికి అర్చనలు చేసేవాడు. ఆ సమయం మినహా మిగిలిన సమయమంతా స్వార్థంతోను, అహంకారంతోను మిగిలిన దైవ సృష్టికంతకూ దుఃఖాన్ని కల్గించి చెడువాక్కులు, చెడు ఆలోచనలు, చెడు కర్మలు అవలంబించేవాడు.

చూసి చూసి దైవం ఇది భరించలేక పూజారిని పిలిచి, మూర్ఖుడా! నాకు ఎన్ని పూజలు చేసినా పూజానంతరం నా ప్రతిరూపమైన సమాజానికి సేవచేయని పక్షంలో ఈ పూజలు శుద్ధదండుగ. నీకు నేను రాయిలోనే తప్ప జీవించే ప్రాణులలో కనిపించటం లేదా? అని కోపంతో దండిస్తుంది. పూజారి తన అజ్ఞానాన్ని మన్నించుమని దేవి పాదాలను గట్టిగా పట్టుకొంటాడు.

పూజయొక్క పరిణామం “సేవగా” మారాలి. పూజలు, ఉపాసనలు ఆచరించిన తర్వాత వ్యక్తిలో లోకసేవ చేయాలనే తపన జాగృతం కావటంలేదు. అంటే, ఆ పూజలు ఫలించటంలేదని, వ్యర్థమౌతున్నాయని, మీ ఉపాసనలలో ఎక్కడో ఏదో లోటు, పొరపాటు జరుగుతోందని గుర్తించండి.

మహాభారతంలోని యుధిష్టిరుని చరిత్రలో వసుధైవ కుటుంబక భావనలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అజ్ఞాతవాస కాలంలో యమధర్మరాజు అతడిని అనేకసార్లు పరీక్షిస్తాడు. కోనేరులో నీరు త్రాగే పాండవ సోదరులు నలుగురిని చంపి కేవలం యుధిష్టిరుని ద్వారా తన ప్రశ్నలకు లభించిన జవాబులకు తృప్తిచెంది యక్షుడు వరాన్ని కోరుకోమని ధర్మరాజుని అడిగినపుడు, తన రాజ్యాన్ని గాని, వైభవాన్ని గాని కోరుకోక అతడు తన లోభ, మోహ, క్రోధాలను జయించి తపోదాన సత్యవ్రతుడై జీవించాలని, తనలో ఎన్నడూ ఎవరిపట్ల దుర్భావనలు ప్రవేశించక అందరిపట్ల ప్రేమభావన కలిగి జీవించాలనే వరాన్ని కోరుకొంటాడు.

అలాగే అంతిమ సమయంలో కూడా యుధిష్టిరుడు హిమాలయాలగుండా పయనించేటపుడు ఒక్కొక్కరుగా సోదరులు, కుంతి, ద్రౌపది అందరూ మరణించిన తర్వాత దారిలో తోడుగా లభించిన ఒక కుక్కను వెంట పెట్టుకొని ముందుకు పయనిస్తూ ఉంటాడు. ఈలోగా ఇంద్రుడు విమానం తెచ్చి, నియమానుసారం కుక్కకు స్వర్గంలో ప్రవేశం లేదని, నీవు మాత్రం విమానాన్ని వచ్చి అధిష్ఠించుమని ఆహ్వానిస్తాడు. ఇంతవరకు తనకు తోడుగా వచ్చిన కుక్కను ఒంటరిగా వదలి రాజ్యాన్ని ధర్మరాజు ఇంద్రుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. కుక్కరూపంలోనున్న యమధర్మరాజు ప్రసన్నుడై నిజరూపంలో దర్శనమిచ్చి యుధిష్ఠిరునికి గల జీవప్రేమపట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కున చేర్చుకొంటాడు.

ఆపదలోనున్న ఇతరులకు ఏదైనా ఇవ్వగలిగినవాడు, ఆకలితోనున్న ఇతరులకు ప్రేమగా తినిపించి, వారి ఆకలి తీర్చేవాడు, తన చేతికందివచ్చిన పుత్రుడని భగవంతుడు భావిస్తాడు. ఇటువంటి ఉదారులు, త్యాగశీలురు, పరిపక్వత చెందిన వ్యక్తులను భోగపరులు, సంపన్నులు దీనులుగా, హీనులుగా భావించినప్పటికీ, దైవానుగ్రహం, కీర్తి, ఆత్మ సంతోషం అనబడు ఉత్కృష్టమైన మూడు సంపదలు దైవం తన పుత్రులుగా భావించిన వారికి మాత్రమే లభిస్తాయి. విశ్వంలోనున్న మిగిలిన సమస్త సంపదలు ఈ మూడు సంపదల ముందు తృణప్రాయమైనవి.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

Leave a Comment