పకీరువలె అర్థనగ్నంగా తిరిగిన గాంధీ పాదాలచెంత నెహ్రూ, చిత్తరంజన్‌దాస్, జమన్‌లాల్ బజాజ్ వంటి సంపన్నుల సమస్త సంపద, వైభవం వచ్చి వర్షించిన సంగతి సర్వ విదితమే. కానీ ఆ త్యాగమూర్తి ఆ సంపదను మాతృభూమి స్వాతంత్ర్యం కోసం వెచ్చించాడు.
బుద్ధుడు రాజ సింహాసనాన్ని త్యజించి, భిక్షాపాత్ర చేతపట్టి, తిరిగినప్పటికీ ఆయన పాదాల ముందు అనేకమంది రాజులు, చక్రవర్తులు తమను తాము సమర్పించుకొన్నారు. ఇటువంటి మహా మానవుల పట్ల జనులకుగల భక్తి శ్రద్ధలు వర్ణించనలవిగానివి.
ఒక అచంచలమైన, అపూర్వమైన సత్యం ఏమిటంటే తమ సర్వస్వం పరమార్థానికై వినియోగించిన వారికి, కలిగినదాన్ని కలసి పంచుకొని తినగల వారికి, అపరిగ్రహ వ్రతాన్ని అచంచల నిష్ఠతో పాటించగల వారికి ఈశ్వరానుగ్రహం వెన్నంటి ఉండి సదా వారిపై వర్షిస్తుంది.
సంత్ రామదాస్ ధర్మ ప్రచారార్థం శిష్య సమేతంగా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో అడవిలో భోజన సమస్య ఎదురైంది. నీవద్ద ఏముంటే దానినే కలిసి పంచుకొని తినుమని రామదాసు ఆదేశిస్తాడు. గురువాదేశానుసారం శిష్యులు తమ వద్దనున్న ఐదు రొట్టెలను అందరూ కడుపునిండా భుజించి, ఎక్కువైన మిగిలిన రొట్టెలను అటుగా వెళుతున్న బాటసారులకు కూడా పంచి ఇస్తారు. కేవలం ఐదు రొట్టెలతో ఇంతమంది తృప్తి చెందటమేగాక, బాటసారుల ఆకలిని కూడా తీర్చగల రహస్యమేమిటని ఒక శిష్యుడు కుతూహలంగా ప్రశ్నిస్తాడు. “పంచుకొని తినటంలో గల చమత్కారమే”నని రామదాసు బదులు పలుకుతాడు.
తన గురించి కాక, మిగతా వారిని గురించి ఆలోచించటమనేది ఉత్కృష్టమైన భావన. కొందరు వ్యక్తులే ఆదాచేసినవి అందరకూ ఉపయోగపడాలి అని మీరు భావించటం వలన మీలో కొందరి వద్ద ఐదు రొట్టెలు అక్షయ అన్నపూర్ణగా వృద్ధి చెందాయి. కూడగట్టాలని, దాచాలని భావించేవారు ఆకలితో దహించబడుతూ ఉంటారు. ఒకరికివ్వాలని, పంచుకొని తినాలనే ఆరాటపడే వారికి ఎంత తిన్నా ఆకలి తీరి, అనంతమైన తృప్తి కలుగుతుందనే సత్యాన్ని రామదాసు శిష్యులకు అక్కడ ఆ విధంగా అనుభవానికి తీసికొని వస్తాడు.
నిద్రలేమి వలన బాధపడుతూ అనేక చికిత్సలు చేయించుకొని ఫలితం లేక బాధ చెందుతున్న ఒక చక్రవర్తికి జ్యోతిష్కుడు అత్యంత ప్రసన్నుడూ సుఖ జీవియైన వ్యక్తి యొక్క ఉత్తరీయాన్ని తెచ్చి ధరింపచేస్తే, ఆరోగ్యం బాగుపడుతుందని సలహా ఇస్తాడు. చక్రవర్తికి తమ వస్త్రం ఉపయోగపడితే మంచి బహుమతి లభిస్తుందనే ఆశతో అనేక మంది ఉత్తరీయాన్ని ఇవ్వటానికి ముందుకు వస్తారు. లాభం లేకపోవటంతో రాజభటులు గాలిస్తూ ఉండగా ఒకరోజు రోడ్డు మీద ఒక వ్యక్తి రామనామం చేస్తూ అత్యంత ఆనందంతో తనను తాను మరచి ఉండటం భటులు చూస్తారు.
ఎంత రానన్నా వినకుండా అతనిని రాజభటులు రాజమందిరంలో ప్రవేశపెడతారు. తనకంటె ప్రసన్నుడైన ఆ వ్యక్తికి చక్రవర్తి నమస్కరించి, “అయ్యా! నీ ఉత్తరీయాన్ని ప్రసాదించి నాకు రోగ విముక్తిని కల్గించు”మని ప్రార్థిస్తాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో, “మహారాజా! నావద్ద కట్టుకోవటానికి, కప్పుకోవటానికి ఒకే ధోవతితప్ప ఉత్తరీయం లేదు. ప్రవహించే నీరు లాంటిది నా జీవితం” అని తెలియచేసి కానుకలకు, అభినందనలకు ఎదురు చూడకుండా నామ జపంతో తన్మయుడై అక్కడ నుంచి నిష్క్రమిస్తాడు. సుఖం అనేది వస్తువులలోను, సంపదలోను, సౌకర్యాలలోను లేదని, ఆనందం అనేది ఆత్మకే పరిమితమైనదని ఆ మహనీయుని పాద స్పర్శతో రాజమందిరంలోని ప్రతి ప్రాణికీ తెలిసింది.
