The Preservation of Wealth is Possible only through the Practice of Temperance.

ఎవరైతే ఐశ్వర్యాన్ని పొంది అహంకారంతో, బద్దకంతో ఉంటారో అట్టివారు పతనంచెందుతారు.

The Preservation of Wealth is Possible only through the Practice of Temperance.

అనేకమైన శారీరక బాధలతో సతమతమవుతూ, రోగనివారణకు చాలా ధనాన్ని ఖర్చుచేసి ఫలితం లేక ఒక రోగి రాజవైద్యుడైన సారంగధరుని వద్దకు వస్తాడు. సారంగధరుడు ఆ రోగికి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ, నియమపాలన ద్వారా కాలానుగుణంగా జీవించమని సలహా ఇస్తాడు. రోగి సలహాని ఉపేక్షిస్తూ ఇవన్నీ ఆచరించేవే గానీ బలానికి, రోగ నివారణకు ఏమైనా ఔషధాన్ని ఇవ్వమని అడుగుతాడు.

వైద్యుడు చిరునవ్వు నవ్వి నాయనా నేను చెప్పిన సలహా నీవు పాటించి ఉన్నట్లైతే నీకు నా వద్దకు రావలసిన అవసరం ఏర్పడేదికాదు. నీవు జీవిత రసాన్నేకాక జీవిత సామర్థ్యాన్ని, సంపదను కూడా నిగ్రహ నియమాలను ఉల్లంఘించటం వల్లనే నష్టపోయావు. బాహ్యోపచారాలు, బలవర్థక ఔషధాలు మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేసే పక్షంలో ఇంతమంది సిరిసంపదలు కల వ్యక్తులు మధుమేహం, అజీర్ణ రోగం మొదలైన అనేక రోగాలతో ఎందుకు బాధపడుతున్నట్లు? రోగానికి మూలకారణం అంతర్గతమైనదేగాని బయట కారణాలు కావు అని వైద్యుడు చెప్పిన మాటలు రోగి జీవితాన్ని మార్చివేశాయి.

అంతరంగ బహిరంగాలలో జరిగే అపవ్యయాన్ని అరికట్టి తద్వారా స్వల్ప వ్యవధిలోనే పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు కాగలిగాడు.

శృంగి మహర్షికి నమస్కరించి, మహాత్మా! నియమోల్లంఘన, నిగ్రహలేమి పేర్లతో ఏర్పడుతున్న గంట్లు ఏరీతిలో ఉంటాయి? జీవితరసాన్ని వ్యర్థంగా మట్టిలో ఇంకిపోవటానికి తోడ్పడుతున్నవి ఏవి? వీటి దుష్పరిణామాన్ని వ్యక్తులు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఈ రహస్యాన్ని, నివారణోపాయాలను తెలియజేస్తే ఇది భూతల స్వర్గంగా మారిపోతుంది. శాశ్వత దుఃఖ దారిద్ర్య నివారణ అయిన నివారణోపాయాలను తెలియజేయమని ప్రార్థిస్తాడు.

ఇంద్రుడు అసురుల చేతులలో అనేకసార్లు ఓడిపోయి దైవం యొక్క విశేష సహకారంతో అతికష్టం మీద తిరిగి తన సింహాసనాన్ని అధిరోహించేవాడు. ఇలా పదేపదే పరాజయాన్ని పొందటానికి కారణం ఏమిటని ఇంద్రుడు బ్రహ్మని ప్రశ్నిస్తాడు.

ఇదే ప్రశ్న అసురుల చేతుల్లో పదే పదే పరాజితులైన దేవతలు ప్రజాపతిని కూడా అడగటం జరిగింది.

ఐశ్వర్యం యొక్క రక్షణ కేవలం నిగ్రహాన్ని పాటించటం వల్లనే సాధ్యమౌతుంది. ఎవరైతే ఐశ్వర్యాన్ని పొంది అహంకారంతో, బద్దకంతో ఉంటారో అట్టివారు పతనంచెందుతారు.

సుఖభోగాలకు దాసులైన దేవతలకంటే కూడా అపరిమితమైన ఐశ్వర్యం మానవ దేహంలో ఉన్నది. ఈ సంపదను నియమపాలన ద్వారా సద్వినియోగం చేసుకొన్నట్లయితే పరాభవం అనేది దగ్గరికి రాదు. దేవతలను సయితం పరాజితులను చేసిన అసురులు పశుప్రవృత్తుల రూపంలో మనలో కూడా నిసిస్తూనే ఉన్నారు. వివేకవంతుడు సమర్థుడు అయిన వ్యక్తి ఈ పాశవిక ప్రవృత్తులకు తాను లొంగక వాటినే లొంగదీస్తాడు.

సాధారణ జనులు సర్వం తెలిసి ఉండి, సర్వం తానే చేస్తూ ఉండి కూడా తెలియనట్లు తమ దుఃఖాలకు అవమానాలకు మాత్రం బయట ఎక్కడో కారణాలను వదకుతూ ఉంటారు. వీరు తమలోనే ఉండి తమ ద్వారానే ఏర్పడిన కన్నాలను గుర్తించి పూడ్చివేసి జీవశక్తిని సంరక్షించుకొని ప్రవాహ మార్గాలను ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేసుకొన్నట్లయితే జీవనశక్తి సార్థకమైన జీవన దేవత ప్రసన్నురాలవుతుంది.

జీవన సంపద: (1) ఇంద్రియశక్తి (2) సమయశక్తి (3) ఆలోచనాశక్తి (4) సాధనశక్తి అను నాల్గు విధాలుగా వ్యక్తికి లభిస్తోంది. మొదటి మూడు శక్తులు ఈశ్వరుడు ప్రసాదించినవి. నాల్గవది ఈ రెండింటి యొక్క సమిష్టి ప్రయత్నం వల్ల వ్యక్తి తన పురుషార్థం ద్వారా భౌతిక జగత్తులో ఆర్జించవలసి ఉంది. దైవం ఇంద్రియ, సమయ, వాక్ శక్తుల రూపంలో దైవీ సంపదను నిష్పక్షపాతంగా ప్రసాదిస్తున్నాడు. ఒక వేళ ఏదైనా లోటు ప్రారబ్ధం వల్ల వ్యక్తికి ఏర్పడినప్పటికీ ఆ శక్తి ని కూడా మరోశక్తి రూపంలో రెట్టింపుచేసి ప్రసాదిస్తాడే గానీ దైవం పక్షపాతం చూపే ప్రసక్తిలేదు.

సాధన శక్తి ఒక వేళ లోపించినప్పటికీ దైవదత్తమైన వాక్కు ను సార్థకం చేసుకుంటూ, సమయ సంపదను సదుపయోగం చేసుకుంటూ, ఆలోచనా శక్తిని ప్రక్కదారులు పట్టించకుండా కాపాడుకొన్నప్పుడు కూడా వ్యక్తి సమస్త సాధనాలు సమకూర్చుకుని సమృద్ధితో జీవించగలడు. అంతేగాక ఈ సంపద దైవదత్తమైనదిగా ఎందుకు పేర్కొనటం జరిగిందంటే దైవం వీటిని చాలా ఆలోచించి, సమాజ కళ్యాణానికి ఉపయోగపడే మహత్తరమైన సాధనాలుగా నిర్ణయించి మానవునకు ప్రసాదించటం జరిగింది.

ఒక శిష్యుడు గురువుతో, గురుదేవా! “సమస్త సంపదలు దైవదత్తమైనవి” అని మీరు చెబుతూ ఉంటారు. కానీ వ్యక్తి తన దైనందిన జీవితంలో పూజలు, ఉపాసనలు, ముడుపులు ఇవేమీ చేయకుండానే తన పురుషార్థం ద్వారా హద్దులేని సంపదను ఆర్జించటం మనం కళ్ళార చూస్తున్నాం. నీవు సంపాదించినది, దైవదత్తమైనది అంటే అతడు ఊరుకొంటాడా? అని ప్రశ్నించాడు.

గురువు మందహాసం చేసి, నయనా! పురుషార్థం ద్వారా సంపాదించినది అనుకొంటున్న ఆ సంపదను వ్యక్తి, దైవదత్తమైన సమయం, శ్రమ, శక్తి ఇవేమి ఉపకరించకుండా ఆర్జించగల్గుతున్నాడా? కావాలను కొన్నంత ఆర్జించి తన ఉద్దేశ్యాన్ని పూర్తిగావించు కొన్నానని భావించే వ్యక్తులు కూడా శ్రమించటం పట్ల బద్దకించినా, ఇంద్రియాలలో అస్తవ్యస్తత ఏర్పడినా ఆలిచనలు ప్రక్కదారులు పట్టినా, సమయాన్ని దుర్వినియోగం చేసినా, వీటన్నింటిలో ఏ ఒక్కటి వ్యక్తి లో చోటుచేసుకున్నా లక్షాధికారి భిక్షాధికారిగా మారి అశక్తుడు అభాగ్యుడు కాక తప్పదు అంటూ గురువు శిష్యునకు విషయాన్ని విశదీకరిస్తాడు.

శిష్యుడు గౌతమ బుద్ధునితో “స్వామీ! బౌద్ధ మత ప్రచారానికై విశ్వమంతా పరివ్రాజకులుగా పంపుతున్న దూతల వద్ద ఎలాంటి సాధన సంపత్తి లేదాయె. వారు జీవన యాత్ర ఎలా సాగిస్తారు? ” అని ప్రశ్నించాడు. బుద్ధుడు శిష్యుని వంక వాత్సల్యంతో చూస్తూ ” నాయనా! పరివ్రాజకులు వారి వెంట ఈశ్వరుని ద్వారా ప్రసాదించబడిన ఒక విశిష్ట సంపదను వెంట పెట్టుకొని వెళుతున్నారు. ఇంద్రియశక్తి, సమయం, ఆలోచనలు ఇవి అమూల్యమైన విభూతులు. వీటి ద్వారా ఎక్కడకు వెళ్లినా సహకారం, శ్రద్ధ, గౌరవం, సంపద ఏది కావాలంటే దానిని పొందగలరు. ఆలోచనా క్రాంతి యొక్క అగ్రదూతలుగా వారు సర్వత్రా వ్యాపిస్తారు అని బదులు పల్కుతాడు.

సాధనలు వైభవం దృష్టితో చూస్తే భారతదేశం కంటే ఎంతో ఉచ్చస్థితిలోనున్న విదేశాలలో కూడా బౌద్ధస్తూపాలు అనేకం విస్తరించాయి. గౌతమ బుద్ధుని యొక్క “సాధనా విహీనమైన పరిభ్రమణం” ఏ విధంగా దిగ్ దిగంతాల వరకు వ్యాపించిందో మనం ఈనాడు కన్నులారా చూస్తున్నాం. కుమార జీవుడు, సంఘమిత్ర, మహేంద్రుడు మొదలైనవారి త్యాగం అవిస్మరణీయమైనది.

The Preservation of Wealth is Possible only through the Practice of Temperance.

Leave a Comment