TRUE SPIRITUALITY – THE PATH OF SELFLESS SERVICE.

బాగాదాద్ చక్రవర్తి ప్రజలపై అనేక అక్రమాలు, అత్యాచారాలు జరిపి దుఃఖపెట్టి అమితమైన ధనాన్ని ప్రోగుచేస్తాడు. ఆ రాజ్యంలో వ్యాపించిన స్వార్థం కూడగట్టే ప్రవృత్తి మహాత్ముడైన గురునానక్ కి తెలుస్తుంది. వాటి నివారణార్థం ఆయన బాగాదాద్ పట్టణంలో ప్రవేశించి సరిగ్గా రాజభవనానికి ఎదురుగా
ప్రక్కనే రాళ్ళను గుట్టగా ప్రోగుచేసి పెట్టుకుని కూర్చుంటాడు. భక్తనానక్ రాజ్యంలో ప్రవేశించిన వార్తవిని బాగ్దాద్ చక్రవర్తి ఆయన దర్శనార్థం వస్తాడు. రాళ్ళ గుట్టను చూచి ఆశ్చర్యంతో ఎందుకని ప్రశ్నిస్తాడు.

దైవానికి కానుకగా ఇవ్వటానికి మరణానంతరం వీటిని నా వెంట తీసుకెళ్తానని నానక్ బదులు పల్కుతాడు. చక్రవర్తి పకపకా నవ్వుతూ, “నీవేదో మహాత్ముడివి అనుకున్నాను కానీ మూర్ఖుడిలా ఉన్నావే. మరణానంతరం ప్రతి జీవి తన వెంట పాపపుణ్యాలను తప్ప చిన్న సూదిని కూడా వెంట తీసికెళ్ళలేడనే సత్యం నీకు తెలీదా? అని అడుగుతాడు. నానక్ ఆ మాటలకు ఏమాత్రం స్పందించకుండా చక్రవర్తి వంక సూటిగా చూస్తూ, రాజా! నీవు చెప్పిన సత్యం నాకు తెలియదయ్యా! ప్రజలను పీడించి, నీవు ఆర్జించే ఈ ధనం అంతా నీ వెంట తీసుకెళ్లటానికే అయివుంటుందని భావించి, నీ వెంట వచ్చి నాకున్నది నేను దైవానికి సమర్పించాలనే కోరికతో రాళ్ళు ఏరుకొన్నానని బదులు పల్కుతాడు.

ఆ మాటలు చక్రవర్తికి మూలుకుల్లా గ్రుచ్చుకున్నాయి. వాస్తవం ఏమిటో అర్థమైంది. ప్రజలను పీడించడం మాని, ప్రజాసేవకుని తన సర్వస్వం ఖర్చుచేయ నారంభించాడు.

ఒక వృద్ధురాలికి సంతానం లేదు. తనకున్న సంపదను ధార్మిక కార్యాలకై వినియోగిస్తూ జీవితం గడుపసాగింది. దైవం ప్రసన్నుడై ఆమె అంత్యకాలంలో దూతలను పంపి స్వర్గానికి రమ్మని కబురు పంపుతాడు.

కాని ఆమె దైవం పంపిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, ఇంకా అన్నీ చక్కబెట్టుకోలేదు. కాస్త వ్యవధి ఇవ్వమంటుంది. దూతలు సరేనని 2 సంవత్సరాల వ్యవధి ఇస్తారు. వృద్ధురాలు తనకున్న ఇల్లు సంపద ఈ 2 సంవత్సరాల కాలంలో సద్వినియోగం చేయడానికి బదులు కూడగట్టిన ధనాన్ని వడ్డీలకు అప్పుతెచ్చి అబద్ధాలతో దొంగలెక్కలు కట్టి ఎక్కువ ఆర్జించ నారంభించింది.

ఈ విధంగా ఇచ్చిన గడువు పూర్తి అయింది. కానీ ఈసారి దేవదూతలకు బదులు యమదూతలు వచ్చి వృద్ధురాల్ని యమలోకానికి లాక్కెళ్తారు. జీవితకాలం అంతా చేసిన పుణ్యఫలం 2 సంవత్సరాలు చేసిన పాపఫలంతో నశించి పోయినందుకు వృద్ధురాలు నెత్తి నోరు మొత్తుకొంటూ నరకానికి పోయింది.

స్వామి రామతీర్థుడు “నేను ఏంతో చేశాను. కానీ ప్రతిఫలంగా లభించిన దేమిటి?” అని ఎన్నడూ ఆలోచించకండి. విశ్వమంతా వ్యాపించి పెద్ద పెద్ద భూఖండాలను తడిపి, సస్యశ్యామలం గావించి మానవులకు అన్నరాశులను లభింప చేయుటానికి నిరంతరం శ్రమించే మేఘాలు, నదులు – ఇవి మననుండి ఏమి ఆశిస్తున్నాయి? వాటి శ్రమకు మనం ఏమి విలువ కట్టగలం? అలాగే పృథ్వీమాత గుండెలో గునపాలు గ్రుచ్చి, మలమూత్రాలతో ఆమెను మలినంచేస్తూ, ఆమె పై జీవితమంతా గడుపుకుంటున్న మనం, ఆమె బుణాన్ని ఏ విధంగా తీర్చుకొంటున్నాము? నీడ, ఫలాలు, కట్టెలు, సమస్త సదుపాయాలు, వృక్షాల ద్వారా అనుభవిస్తూ వాటికి మనం కట్టే విలువ ఏమున్నది? కాబట్టే, పరోపకారం అనేది ఎవరికి వారు తీర్చుకొంటున్న ఋణం మాత్రమే.

త్యాగం గురించి తెలియని వారికి అది అప్పుగా అనిపించవచ్చు. కానీ విలువ తెలిసిన వారికి ఈశ్వరానుగ్రహం వల్లనే పరోపకారం అనే దివ్య గుణం అత్యంత శాంతిప్రదమైనది, ఉత్కృష్టమైనది అని అనుభవమవుతుంది. పరోపకార పరాయణులైన వ్యక్తులు తాము ఇతరులకు చేసిన ఉపకారాల ద్వారా ఇతరులు పొందిన లాభానికి అనేక రెట్లు స్వయంగా తాము పొందుతున్నట్లు స్పష్టంగా తెలుపుతూ ఉంటారు” అని ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవారు.

ఈశ్వరుడు నిరాకారుడు. ఈశ్వరావతరణ మానవుని అంతఃకరణం నుండే జరుగుతుంది. మానవుల ద్వారా భక్తిరూపంలో తెలుసుకోబడిన ఉన్నతస్థాయికి చెందిన ప్రేమతోనే ఈశ్వరానుభూతి కలుగుతుంది. భక్తి అంటే ఉన్నత ఆదర్శాలతో మేళవింపబడిన ఆత్మీయతయే. భక్తియొక్క ఏకాంతసాధన ఈశ్వరునికి అత్మ సమర్పణ గావించుకోవటానికి ఉన్నతమయ్యే శ్రద్ధ రూపంతో సాధ్యమవుతుంది.

ఈ శ్రద్ధ క్రమంగా పరిపక్వత చెంది ఉదార ఆత్మీయతాభావనగా ప్రకటీకృతమై సర్వ వ్యాపకత్వం చెందుతుంది. ఆహం అనేది త్యజించటానికి చేసే పురుషార్థం, శ్రద్ధగా చెప్పబడుతుంది. ఈ శ్రద్ధ వృద్ధి చెందటానికి భక్తితో చేసే ఏకాంత సాధన ప్రాధమిక స్థితి. ఇది క్రమంగా వికసించి ఈ సాధన కేవలం తనకే పరిమితం కాక దశదిశలా విస్తరించినపుడు అన్నీ అందరూ, తనవారుగానే దృష్టి గోచర మవ్వటం జరుగుతుంది. భారతదేశంలోని సాధువులు, సన్యాసులు తమకుగానీ , దేశానికిగానీ మేలు జరగని అకర్మణ్యజీవనం గడుపుతున్నారని గుర్తించిన వివేకానందుడు రామకృష్ణ మఠాలను నిర్మించటం ప్రారంభించాడు.

కేవలం సేవకే అంకితమైన ఈ మఠాలలో మన పూజలు, ఆత్మ కళ్యాణ సాధనలు లక్ష్యం నెరవేరదని, సేవ అనేది లోక సేవకుల పని అని సాధువులు వివేకానందుని ప్రశ్నించినప్పుడు, వివేకానందుడు నమ్ర స్వరంతో, “సోదరులారా! విశ్వకళ్యాణంలోనే ఆత్మకళ్యాణం ఉన్నది. అసలైన పూజ అంటే సేవే. అజ్ఞానాంధకారాన్ని నివారించటం, దరిద్ర జనులను ఆనంద పెట్టటం, రోగులకు సేవచేయటం, ఈ మూడు పనులు మనం ఆచరించినప్పుడే, హిమాలయ ఉన్నత శిఖరాలపై సంవత్సరాల తరబడి కఠోర తపస్సు ఆచరిస్తున్న తపోసంపన్నుల కంటే కూడా ముందుగా మనకు దైవం ప్రసన్నుడవుతాడు” అని తెలియచేశాడు.

TRUE SPIRITUALITY – THE PATH OF SELFLESS SERVICE.

Leave a Comment