కృష్ణపరమాత్మ ఒకనాడు కర్ణుని ఔదార్యం గురించి కీర్తిస్తూ ఉంటాడు. అర్జునుడు ఆ మాటను అంగీకరించక, ధర్మరాజు కంటే కర్ణుడు ఉదారుడు ఎంతమాత్రం కాదని వాదిస్తాడు. కృష్ణుడు అర్జునుని ముందు కర్ణుని ఔదార్యాన్ని ఋజువు పరచాలని నిర్ణయించి, ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి ముందుగా ధర్మరాజు వద్దకు వస్తాడు. యజ్ఞ కర్మ నిమిత్తం బాగా ఎండిన కట్టెలు కావాలని అడుగుతాడు.
ముమ్మరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎంతగా ప్రయత్నించినా ధర్మరాజు ఎండు కట్టెలు సంపాదించలేకపోతాడు. తన అసమర్థతను తెలియజేస్తాడు. తరువాత కృష్ణుడు కర్ణుని వద్దకు వెళ్లి యజ్ఞకర్మకు ఎండు కట్టెలు ప్రసాదించమంటాడు. వర్షాల కారణంగా ఎండుకట్టెలు బయట లభించటం దుర్లభం అని గ్రహించిన కర్ణుడు వెంటనే తన ఇంటికి ఉన్న కిటికీలు, ద్వారబంధాలు కూలగొట్టి బ్రాహ్మణునికి ఎండు కట్టెలు సమర్పిస్తాడు. చరిత్రలో కర్ణుని ఔదార్యం చిరస్థాయిగా నిలవడానికి ఇది ఒక చిన్న సంఘటన మాత్రమేనని శ్రీకృష్ణుడు అర్జునునికి ఎరుకపరుస్తాడు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన తన కంటూ ఏదీ దాచుకునేవాడు కాదు. ఆర్జించిన మొత్తం పేదలకు, అవసరంలో ఉన్నవారికి పూర్తిగా పంచి ఇచ్చేవాడు. ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞతలు చెప్పటం, ప్రశంసించటం వంటి శ్రమ కూడా వారికి కల్గకుండా ఉండటానికి తనకేదో దాతృత్వాన్ని వారు ఆపాదించకుండా ఉండటానికి గుప్తదానం చాలా సహాయపడుతుంది అని వారు భావించేవారు.
లక్షాధికారులు, కోటీశ్వరులుగా గొప్పగా కనిపించే ఎందరో లోలోపల భావ దారిద్రయం తో మ్రగ్గుతూ ఉంటారు. సంపన్నులుగా లోకంలో పొగడబడే ఇలాంటి అనేక మంది అంతరంగంలోని లేమి, సంకుచితత్వం కారణంగా ఏ మాత్రం సుఖసంతోషాలను పొందలేక అశాంతితో బ్రతుకుతూ ఉంటారు. అసలైన దరిద్రులు వీరే.
ఒక మహానీయుడు పర్యటన చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక రూపాయి లభించింది. ఆసక్తి లేనివాడు, అత్యంత ఆనంద స్వరూపుడు అయిన ఆ మహానీయుడు ఆ రూపాయి తనకు అనవసరమని భావించి ఎవరైనా పేదవాడు కనిపిస్తే ఇవ్వాలని నిశ్చయించుకొంటాడు. కానీ ఎంత వెదికినా పేదవాడు ఆయనకు లభించలేదు. రూపాయి ఏమిచేయాలోనని ఆలోచిస్తూ ఉండగా చివరకు ఒక రాజు కనిపిస్తాడు. వెంటనే మహాత్ముడు ఆ రూపాయి రాజు చేతిలో పెట్టి భారాన్ని వదిలించుకుంటాడు. కానీ పేదవాడికి ఇవ్వవలసిన రూపాయి తన చేతిలో పెట్టడంతో మహాత్ముని ఉద్దేశ్యం ఏమిటో తెల్సుకోదలచి రాజు ఆగ్రహంతో మహాత్ముని కారణం అడుగుతాడు.
మహాత్ముడు శాంత గంభీర స్వరంతో రాజా! సమస్త సంపదలు కల్గిఉండి వాటిని సద్వినియోగం చేయక పరాయి సంపదకోసం సైన్యంతో దండెత్తి వెళుతున్న నీకంటే ఎక్కువ దరిద్రుడు ఇంక ఎవరూ ఉండరనిపించింది. అందుకే రూపాయి నీకు ఇవ్వవలసిన వచ్చిందని అని తెలియజేస్తాడు. ఆ మాటలు రాజు హృదయానికి గ్రుచ్చుకున్నాయి. అతనిలో పరివర్తన కలిగింది. “సైన్యాన్ని వెనక్కి మళ్లిస్తాడు.
అనందించగల వారికి తమవద్దనున్న దైవదత్తమన సాధనాలు పుష్కలంగా సరిపోతాయి. ఆశరూపంలో అవసరాల ఆకలికి వీరు బలికారు.
