మానవ జీవితం కంటే గొప్ప దేవతగానీ మానవ జీవితోపాసనను మించిన ఉపాసన గానీ మరేదిలేదు.

వ్యాస పీఠం మీద ఆశీనుడై జ్ఞానకాంతులు వెదజల్లుతూన్న మహర్షి కి శృంగి పాదనమస్కారం చేసి, మహాత్మా! “మానవుడు సుఖ సమృద్ధులతో కీర్తివంతుడై అడుగడుగునా ప్రత్యక్ష ఫలితాలను పొందుతూ జీవించాలంటే ఏ దేవత ఉపాసన శ్రేష్ఠమైనదో కూడా తెలియజేయాలని కోరిన మీదట శృంగిని మహర్షి ఆశీర్వాదిస్తూ ఏమన్నారంటే
“మానవ జీవితం” కంటే గొప్ప దేవత గానీ మానవ జీవితోపాసనను మించిన ఉపాసన గానీ మరేదిలేదు. జీవితం సాక్షాత్తు ప్రత్యక్షదైవం. మిగిలిన దేవీదేవతల కృప పరలోకం నుండి వారు కరుణిస్తేనే లభిస్తుంది. కానీ జీవనదేవత ఇక్కడికిక్కడే తన అనుగ్రహాన్ని అడుగడుగునా మనపై కురిపిస్తుంది. నిరాకారుడైన ఈశ్వరుడు జీవధారలకు ప్రేరణ మాత్రమే ఇస్తాడు. దైవీ శక్తి శరీరధారుల సాధనవల్ల జీవిని దేవతగా సాక్షాత్కరించి, సముచిత పరిణామాలను పొంది ఇహపరాలను తరింపజేస్తోంది.
జీవితంలో ఎదురయ్యే పరిణామాలను వ్యక్తి తన చర్మ చక్షువుల ద్వారా దర్శిస్తూనే ఉన్నాడు. వేదాంతం సర్వస్వం “అయమాత్మాబ్రహ్మ” అంటూ ఈ జీవన దేవతనే ఉపాసిస్తుంది. ప్రత్యేక్ష పరోక్ష ఫలితాలను నిష్పక్షపాతంగా ప్రసాదించే జీవబ్రహ్మ సాధన సర్వశ్రేష్ఠమైనది అని తెలియచేస్తూ మహర్షి ఒక కధ వినిపంచసాగేరు.
దేవతలకు ఒకసారి భూమిపై పరిభ్రమించాలని కోరిక కల్గంది. అంతేకాదు స్వర్గవాసులైన తమకు భూమిపైనున్న మానవులు ఘనంగా స్వాగతం చెప్పి సత్కరిస్తారని కూడా వారు ఆశపడ్డారు. తీరా చూస్తే వారనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. పంటచేలను, ఫలాలను చూసుకొని పరవశిస్తున్న ప్రజలు దేవతలను కన్నెత్తి చూడలేదు. దేవతలు ఆశ్చర్యంతో భూమాత వద్దకు వెళ్లి, అమ్మా! నీ బిడ్డలు మావంక కన్నెత్తి చూడలేదు. ఎట్టెదుట తిరిగినా నోరువిప్పి ఒక్క వరాన్ని కోరలేదు. వారి ఉపేక్షకు కారణం చప్పమని అడుగుతారు.
భూదేవి దేవతల బాధను అర్ధం చేసుకుని వారిని ఆదరిస్తూ, అమ్మలారా! నా బిడ్డలు వారివారి జీవితాలనే దేవతలుగా భావించి ఉపాసిస్తున్న ధన్యజీవులు. వారికి మీతో పనేముంటుంది? అనవసరంగా వారి విలువైన కాలాన్ని మీ ఉపాసనలతో వ్యర్థం చేసుకోవటం దేనికని భావించి మీ వంక చూచి ఉండరు. అంతేగానీ నా బిడ్డ లకు మీ పట్ల ఉపేక్ష, కోపం ఏమీలేదు అంటూ ఒక ప్రదేశానికి వారిని తీసికెళ్లింది. పొలంలో శ్రమించి పనిచేసుకొంటున్న తన బిడ్డల్ని చూపించింది. చూడండమ్మా! శ్రమించే ఆ చేతులు వారికి అన్నం పెట్టగలవు. వారి హృదయాలలో అనవరతమూ సంతృప్తి ఆనందం కెరటాలుగా ఉప్పొంగుతున్నది. మీరు మాత్రం ఇంత కంటే ఎక్కువ ఏమిఇవ్వగలరు? అని భూమాత ప్రశ్నించగానే దేవతలు తలవంచుకున్నారు. అప్పటి నుండి వారు పృథ్వి సామ్రాజ్యన్ని పూర్తిగా మానవులకే ఒప్పగించేశారు. కానీ మళ్ళీ మనం ఈనాడు మనకున్న సామ్రాజ్యాన్ని గుర్తించలేక వాళ్ళముందే చేయిజాచి అడుక్కొంటున్నాం. అంటూ మహర్షి కథ పూర్తి చేశారు. శృంగి మరలా ఇలా ప్రశించేరు.
జీవనదేవత యొక్క ఉపాసనా మహత్యాన్ని మహర్షి వాక్కు ద్వారా విన్న శృంగికి రెట్టింపు ఉత్సాహం కల్గింది. ఆనంద పారవశ్యంతో మహర్షీ! ఈ జీవన దేవతను ప్రసన్నురాలిని చేసుకోవాలంటే, ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులం కావాలంటే ఏ విధి విధానాలను అవలంబించాలి? ప్రసన్నరాలైన ఆమె ఏ ఏ రూపాలలో మనముందు సాక్షాత్కరిస్తుంది? అలాగే ఈమెను ఉపేక్షిస్తే ఎదుర్కోవలసిన దుష్పలితాలు ఎలా ఉంటాయి? దయతో కాస్త ఈ విషయాలను కూడా వివరించమని ప్రార్థిస్తాడు శృంగి.
అనేక మంది ఇతర దేవీదేవతల సామర్ధ్యం అనుగ్రహం అసాధారణమైనవనీ, అలాగే దైవీ ప్రకోపాలవల్ల ఎదొర్కోవలసిన భీకర పరిస్థితులను కూడా అనేకమంది మర్మజ్ఞులు తెలియజేస్తూనే ఉంటారు. అలాగే వారి అనుగ్రహానికై ఆచరించబడే విధి విధానాలు పూజలు ఉపాసనలు అనేకం మనం చూస్తూ ఉన్నవే. కానీ గ్రహించవలసిన సత్యం ఏమంటే : పూవులు గంధాలు అక్షతలు ధూపదీపాలతో పూజలు చేసినంత మాత్రాన దేవతలు ప్రసన్నమవటం గానీ అప్రసన్న మవటం గానీ ఏమీ జరగదు.
చదువుల తల్లి సరస్వతి వ్యక్తి తన జ్ఞానాన్ని సద్వినియోగం చేసినపుడు మాత్రమే అతని అణువణువునా నివసించి అతడిని ధన్యుణ్ణి చేస్తుంది. ప్రభువు పట్ల తమను తాము సమర్పణ కావించుకొన్న వారిపట్ల మాత్రమే హనుమంతుడు ప్రసన్నుడౌతాడు. దుర్గ శౌర్యం పరాక్రమం సమైక్యత ఉన్న వ్యక్తుల వద్దకు పరుగుపరుగున వెళ్లి వారిని వెన్నంటి ఉంటుంది. శివుడు మంగళకరమైన కార్యాలు చేసే వ్యక్తులపట్ల ప్రసన్నుడవుతాడు. ఈ సత్యాన్ని గుర్తించిన వ్యక్తులే ఆ దేవతల ద్వారా లాభాలను పొందగల్గుతాడు. అలాగే జీవన దేవతయొక్క ప్రసన్నత అప్రసన్నత ఏ ఆధారాల ద్వారా ప్రకటిత మవుతుందో ముందు తెల్సుకొంటే, తరువాత లాభాలు వాటంతట అవే వస్తాయి. అంటూ మహర్షి ఒక కథ వినిపిస్తారు.