Perform your Duty According to the Rules.

నియమానుసారం నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.

ఒక మహాత్ముని త్యాగజీవనం పట్ల ప్రభావితుడై ఒక రాజు ఆయన వద్ద గురుదీక్ష తీసుకొంటాడు. అంతక్రితమే దీక్ష తీసుకున్న అనేకమంది వ్యక్తులు దీక్ష తీసుకోగానే రాజుని కలిసి, సోదరా! ఇక మీదట నీవు మావద్ద పన్నులు వసూలు చేయటానికి వీల్లేదు మేము నీ సోదరలంకదా, అని కోరగానే రాజు అందరి వద్ద పన్నులు వసూలు చేయటం మానివేశాడు.

ఈ విధంగా రాజ్యవ్యవస్థ ధనాభావం వల్ల కుంటుపడింది. అందరూ కష్టించటం మానివేసి ఆర్జించిన దానితో కడుపు నింపుకోసాగేరు. ఈ పరిస్థితికి వ్యాకులత చెందిన రాజు గురువు వద్దకు వెళ్లి విషయాన్ని విన్నవిస్తాడు. గురువు విషయాన్ని విని, రాజా! దీక్షను ఆచరణలో పెట్టినపుడు ఆ దీక్ష ఫలించదు. నీవు గురుసోదరులు అని ఎవరినైతే భావిస్తున్నావో వారంత సోమరులు.

మానసిక జడత్వానికి లొంగి నీవు రాజ్యవ్యవస్థను అస్తవ్యస్తం చేయక ఇప్పటికైనా నియమానుసారం నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పి పంపిస్తాడు. నియమోల్లంఘన పాపమని గుర్తించిన రాజు యథాప్రకారం పన్నులు వసూలు చేస్తాడు.

ప్రణాలికా బద్ధంగా కార్యక్రమాలను నిర్థారణ గావించి, వాటిని తత్పరతతో నిర్వహించటం వల్లనే విజ్ఞులు అనేక సత్ఫలితాలను పొందగలిగేరు. “కాలం” ఈశ్వరుని ద్వారా లభించిన సంపద. దానిని ప్రణాళికా బద్ధంగా వినియోగించలేని వ్యక్తులు ఆయుష్షు ఎంత ఉన్నప్పటికీ వారిని అల్పజీవులుగానే భావించ వచ్చు.

సమయ సంపదను మనోయోగ పూర్వకంగా వినియోగించి వివిధ సిద్ధులు, సంపదలు పొందవచ్చు. అలాకాక సమయాన్ని జారవిడచుకొంటే జీవితాన్ని కూడా జారవిడచుకొన్నట్లే.

ఎవరు ఎంతకాలం జీవించేరు అనేది జన్మదినం నుండి మరణించిన రోజు వరకు లెక్క కట్టి చెప్పటంకాక వారు వారి కాలాన్ని ఎంత వరకు మహత్ కార్యాలకు వినియోగించారో చూచి ఆ కాలాన్ని వారి జీవితకాలంగా పేర్కొనవలసి ఉన్నది.

వివేకానందుడు 36 సంవత్సరాలు మాత్రమే జీవించారు. రామతీర్థుడు 33 సంవత్సరాలు జీవించారు. ఇటువంటి అనేకమంది వ్యక్తులకు జీవించే కాలవ్యవధి తక్కువే అయినా వారు వారి కాలాన్ని ఉత్కృష్ట ప్రయోజనాలకు తత్పరతతో వినియోగించారు. అందువల్లనే వారు నూరు, నూట యాభై సంవత్సరాలు జీవించినా లభించని ఆత్మ తృప్తిని, ఆనందాన్ని, కీర్తిని పొంది ధన్యులయ్యేరు.

దీర్ఘకాలం జీవించినా ఎందరో కాలాన్ని తినటానికి, కనటానికి పరిమితం చేసి వ్యసనాలకు బానిసలై చిక్కుల్లో పడి ఏడుస్తూ కన్నుమూసేరు. జీవితం అంతా స్వార్థం, సోమరితనానికి బానిసలై గడిపితే జీవితానికి వీడ్కోలు చెప్పే సమయానికి కన్నువిప్పినా ఎట్టెదుట మిగిలేది గాడాంధకారమే. కాలదేవత యొక్క పూజారి కాలదేవతను విధోవిధానాలతో అర్చిస్తాడు. క్షణకాలం కూడా వృధా చేయడు.

రావణుడు కాలాన్ని పెట్టెలో బంధించి అసాధారణమైన వైభవాన్ని ప్రసాదించమంటూ ఆమెను వివశురాలిని చేస్తాడు. పురాణగాథలో ఉన్న ఈ విషయం ముమ్మాటికీ నిజమే. వాస్తవాలను సాధరణ జనులు గుర్తించలేరు గానీ మహామానువులంతా కాలం విలువను గుర్తించి క్రమబద్ధమైన దినచర్యతో అసాధారణ మైన లాభాలను పొందేరు. కాలంలోని ప్రతి క్షణాన్ని వజ్రవైఢూర్యాల కంటే ఎక్కువ విలువనిచ్చి సద్వినియోగ పరచేరు.

అధ్యక్షత వహించవలసిన నాయకుడు ఆలస్యంగా రావటం వల్ల ఒకసారి గాంధీ ఒక పరిషత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి 45 నిమిషాలు నిరీక్షించవలసి వచ్చింది. ఆనాటి సభలో గాంధీజీ సమయపాలనా కర్తవ్యనిష్ఠా గురించి అందరికి అర్ధం అయ్యేలా తెలియచేసారు.

ఒకసారి ఒక ధనవంతుడు శంకరాచార్యకి నమస్కరించి, ప్రభూ! శ్రేష్ఠమైన పనులకు కాలాన్ని వినియోగించమని మీరు ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉంటారు. అలాగ చేయగల్గితే మంచిదే కానీ కొందరు సమయం చాలక ప్రత్యేకంగా సత్కర్మాచరణకి సమయాన్ని కేటాయించలేక పోతూ ఉంటారు. వారికి మీరిచ్చే సందేశం ఏమిటి? అని ప్రశ్నిస్తాడు.

ఆచార్యుడు గంభీరంగా నవ్వుతూ, శ్రేష్టీ! విధాతరోజుకి 24 గంటల కంటే తక్కువ కాలాన్ని ఇచ్చి పుట్టించిన వ్యక్తి నాకింతవరకూ ఒక్కడైనా కనబడలేదయ్యా! మరి కాలం సరిపోవడం లేదు అనటంలో నీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నిస్తాడు. శ్రేష్ఠి మౌనంగా ఉండిపోతాడు.

ఆచార్యుడు శ్రేష్ఠితో మరలా ఏమన్నాడంటే వత్సా! నీవు చెప్పే సమయాభావం అంటే కాలం చాలక పోవటం కాదు. కాలం యొక్క అస్తవ్యస్తత. వ్యర్థకార్య కలాపాలతో కాలాన్ని వృధా చేయటం వల్ల సత్కర్మలకు కాలం మిగలటం లేదు. జీవి యొక్క జీవితకాలం కాలం యొక్క సదుపయోగం మీదనే ఆధారపడి ఉంటుందని ఆది శంకరాచార్య శ్రేష్ఠికి తెలియజేస్తాడు.

Leave a Comment