కర్మ ని వినాశనం రూపంలో కాక నిర్మాణ కార్యక్రమంగా చేపట్టాలి.
బుద్ధ భగవానుడు అరణ్యమార్గం గుండా వెళుతూ ఉండగా అంగుళిమాల ఎదురవుతాడు. ప్రతినిత్యం అనేకమంది నిర్దోషుల వ్రేళ్ళను ఖండించి మాలగా కట్టి మెడలో ధరించి ఆనందించే అతడికి ఆరోజు మొదటగా బుద్ధుడు కనిపించగానే ఆనందంగా అతడి మీదికి ఉరుకుతాడు.
ప్రసన్న వదనంతో బుద్ధ భగవానుడు అంగుళిమాల వంకచూచి, వత్సా! విను, నీ మనోరథం తీర్చకుండా ఎక్కడాకీ పారిపోను. కానీ ఒక్క క్షణం ఓపికపట్టి, “నా చిన్న కోరిక తీర్చు” అంటూ ఎదురుగా ఉన్న చెట్టు ఆకులను నాలుగు త్రుంచి తెమ్మనీ, తెచ్చిన తరువాత తిరిగి వాటిని తీసుకెళ్లి ఆ చెట్టుకే అతికించి రమ్మని ఆదేశిస్తాడు. సులువుగా ఆకులను త్రుంచి తెచ్చిన అంగుళిమాల, వాటిని తిరిగి అతికించటం అర్థం కాక తికమకపడతాడు.
బుద్ధుడు వాత్సల్యంతో చూస్తూ నాయనా! ఈ లోకంలో విథ్వంసక చర్యలు ప్రతి తుచ్ఛుడు చాలా సులువుగా చేయగలడు. కానీ వీటిలో గొప్పతనం ఏమీలేదు. సృజనాత్మకమైన కార్యకలాపాలు గొప్పవాళ్ళు, మహాత్ములు మాత్రమే చేయగలరు. నీవు నీ కర్మను వినాశనం రూపంలో కాక నిర్మాణ కార్యక్రమంగా ఎందుకు చేపట్టకూడదు? అపుడు నీకు ఇంతకంటే అనేక రెట్లు ఆనందం తృప్తి లభించటమేగాక కీర్తి గౌరవం కూడా దక్కతాయి అని తెలియజేస్తాడు.
బుద్ధదేవుని బోధనా వాక్యాలు బండబారిన అంగుళిమాల హృదయన్ని కదిలించివేశాయి. బుద్ధుని కరుణ, ఆయన సత్పరామర్శ అంగుళిమాల జీవితాన్నే మార్చివేశాయి. కుకర్మను వదిలి అతడు బుద్ధుని పాదాలపై తనను తాను సమర్పణ గావించుకొంటాడు.
గడ్డిమేటి లో చిన్న రవ్వ వేస్తే చాలు అదంతా దగ్దమైపోతుంది. చిన్న విషబిందువు శరీరంలో ప్రవేశిస్తే జీవితమే సర్వనాశనమవుతుంది. ఈనాడు తయారు చేయబడిన అణుబాంబులు అస్త్రశస్త్రాలు క్షణంలో విశ్వాన్ని సర్వనాశనం చేయగలవు. కానీ మానవుడు గమనించవలసినది, గుర్తుచేసుకోవలసినది ఏమంటే ఇవి ఏవీ కూడా మానవునికి ఒప్పగించబడిన బాధ్యతలు – కర్తవ్యాలం కావు. వ్యక్తి తన స్థాయికి తగినట్లుగా తన సామర్థ్యాన్ని సృజనాత్మక కార్యక్రమాలలో లగ్నం చేయాలి.
ఎవరెంతగా శ్రమించారు? అనేది కాదు ప్రశ్న బరువు మోసి బ్రతికే కూలివాడు కూడా చమట బిందువులను ప్రవహింప చేయగలడు. కానీ లోకమంగళకరమైన ప్రయోజనాలలో చెమటోడ్చిన వ్యక్తుల జీవితాలు మాత్రమే ధన్యం.
బాబారాఘవదాస్ స్వతంత్ర సంగ్రామ సమయంలో అసలైన తపస్వి పాత్రను పోషించారు. మనుష్యులలో ఉన్న నిరక్షరాస్యతను తొలగించటానికి కృషిచేశాడు. హరిజనులు, అంటరాని వారుగా భావించే వ్యక్తుల మధ్యకు వెళ్లి వారితో కలిసి పనిచేసాడు. కుష్ఠురోగులకోసం వైద్యాలయాలు కట్టించేడు. ఆత్మ కళ్యాణం కంటే లోకమంగళమే శ్రేష్ఠమైనదని నిరూపించేడు.
హీరాలాల్ శాస్త్రి జయపూర్ రాజ్య ముఖ్యమంత్రి పదవిని వీరు త్యజించి, ఒక చిన్న వెనుకబడిన గ్రామాన్ని తన కర్మ క్షేత్రంగా భావించి ఆ గ్రామోద్ధరణతో కార్యక్రమాన్ని ప్రారంభించేరు. అనేక మంది కార్యకర్తలను అక్కడినుండి తయారుచేసి వారు తరువాత అగ్రదూతలుగా జయపూర్ రాజ్య కార్యభారాన్నే భుజస్కంధాలపై మోయటం జరిగింది.
ఇదే వనస్థలి గ్రామంలో ఈనాడు విశ్వవిద్యాలయం స్థాయికి చెందిన విద్యాపీఠం నెలకొల్పబడింది. ఈ విద్యాపీఠం ఉన్న ఆశ్రమ ప్రాంగణంలోని ఆకు ఆకులోను “శాస్త్రీజీ” సమర్పణ దృష్టి గోచరమవుతూ ఉంటుంది.
హరిబాబా వీరు ప్రతి ఏటా వరదరూపంలో ప్రకృతి ప్రకోపానికి గురియైన ప్రాంతాలను ప్రజల సహకారంతో నివారించాలేగానీ, ప్రభుత్వ సహకారాన్ని ఆశించటం వృధా అని భావించి ఆధునిక భగీరథుని వలె నదుల ప్రవాహ దిశకు పంటపొలాలకు మళ్ళించి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి అవసరమైన చోట్ల గట్లుకట్టి చూస్తుండగానే వరదలకు గురిఅవుతున్న ప్రాంతాలకు రక్షణ కల్పించారు.
ఇటువంటి అసంభవాన్ని సంభవంగా మార్చినది ‘బాబాజీ’ ఏకాగ్రత, శ్రద్ధ, లోక కళ్యాణం పట్ల వారికి గల సమర్పణ అని అంగీకరించక తప్పదు.