From Selfishness to Selflessness: The Path to Freedom.

కొన్ని పక్షులు ఒకనాడు వేటగాని వలలో చిక్కుకొని ప్రాణరక్షణ కోసం ఒకేసారి వలనెత్తుకొని ఎగిరి పోవటానికి ప్రయత్నించాయి. అది చూచి బోయవాడు వలవెంబడి పరుగెట్టి పరుగెట్టి అలిసిపోగా ఒక మహాత్ముడు అతడిని ఆపి, “నాయనా! కలసి ఎగురుతున్నంత వరకు వీటి వెనుక నీవు ఎంతగా పరుగెత్తినా లాభం లేదు” అని తెలియజేసి ముందుకు సాగిపోతాడు.

కొన ఆశతో వల వెంట పరుగెత్తే బోయవాడు కొంతదూరం వెళ్ళిన తర్వాత వల క్రింద పడటం చూస్తాడు. ఎక్కడ దిగాలి అనే విషయంలో పక్షుల మధ్య వివాదం చెలరేగి కొన్ని ఎగరడం మానివేయడంతో వలతో సహా పక్షులన్నీ క్రిందపడి బోయవాని చేతికి చిక్కి మరణించాయి.

భవబంధనానికి హేతువు సంకుచిత స్వార్థపరత్వం. ఈ స్వార్థ పాశంలో చిక్కుకొని మానవుడు భక్తియొక్క ఉన్నతస్థాయికి చెందిన ఆనంద ప్రాప్తినుండి దివ్యానుభూతి నుండి వంచించబడుతూ ఉన్నాడు. ఒకే ఒక అలంబనమైన భక్తి ఆధారంతోనే ఆత్మ కల్యాణం, విశ్వ కల్యాణం, భగవత్ సాన్నిధ్యం — ఈ మూడు పరమ లక్ష్యాలు ఒకే సారిగా వ్యక్తికి ప్రాప్తించగలవు.

పట్టుపురుగు తన నోటి నుండి స్రవించే ద్రవంతోనే గూడు కట్టుకొని దానిలో బందీయై తన మరణానికి తానే కారణమవుతుంది. వివేకం గల పురుగు తాను కట్టుకున్న గూడు బ్రద్దలు చేసుకొని బంధ విముక్తురాలై గగనంలోకి ఎగురుతుంది. మానవుడు కూడా అజ్ఞానం వలన ఈ విధంగానే స్వార్థంతో తన చుట్టూ గూడు కట్టుకొని దాని మధ్యనే మగ్గి మరణిస్తున్నాడు. కాస్త వివేకాన్ని ఆశ్రయించగలిగితే తెలివైన పట్టుపురుగులాగనే బంధనాలను ఛేదించుకొని, పైకి ఎగిరి గగనంలో విహరించగలడు.

మానవునికి ఈశ్వరుని ద్వారా కోరకుండానే ప్రసాదించబడిన అమూల్యమైన వరమే ఈశ్వరభక్తి. ఈ భక్తి ఆశ్రయంగా తీసుకొని హృదయంలోని ఆత్మీయతను వెదజల్లగల వ్యక్తులు తమను తాము ఉద్ధరించుకోగలటమే గాక, లోకాన్ని కూడా ఉద్ధరించగలుగుతున్నారు. ఈ విధంగా వీరు పొందుతున్న అనుభూతి ఈశ్వర సాక్షాత్కారంతో సరితూగగల మహోన్నతమైనది. చివరకు ఈ భక్తి భావనే ముక్తికి, మోక్షానికి కూడా కారణమవుతుంది.

అర్జునునికి, శ్రీకృష్ణునికి మధ్య బాంధవ్యం ఉన్నప్పటికీ కూడా ఆ బాంధవ్యం స్థిరపడినది అర్జునుడు తనలోని స్వార్థపరత్వాన్ని వదలుకున్నప్పుడు మాత్రమే. అంతరంగం దీనంగా, హీనంగా పిరికితనంతో ఉండి గాండీవాన్ని ధరించి రథాన్ని అధిరోహించి ఏమి చేయాలో కూడా ఆలోచించలేని పరిస్థితి అర్జునునిది.

మహాభారత యుద్ధం యొక్క ఉద్దేశ్యం కేవలం సోదరుల మధ్య పోట్లాటను అంతం చేయటం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న సామంతవాదం కారణంగా భారత భవిష్యత్తు నిరంతరం చింతా జనకంగా తయారవుతూ ఉన్న పరిస్థితులలో రాబోయే జటిల సమస్యలను దూరం చేయటమే ముఖ్య ఉద్దేశ్యంగా యుద్ధం నిర్వహించవలసి ఉన్నది. కాబట్టి కృష్ణుని బోధ ఈ నిమిత్తంగా చేయబడినదే.

వ్యామోహం అనేదాన్ని ఒకసారి జయిస్తే అది అవినీతిమీద విజయంగా పరిణతి చెందుతుంది. కృష్ణుని ఉపదేశం వలన అర్జునుడు విశ్వమానవ శ్రేయస్సుకై పాటుపడడంలో సాఫల్యాన్ని సాధించడమేగాక, ఆయన ముక్తి మార్గాన్ని కూడా సుగమం చేసుకోగలిగాడు.

From Selfishness to Selflessness: The Path to Freedom.

Leave a Comment