ఆదర్శమైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి లోభం, మోహం అనే భవబంధనాలు సంకెళ్లవంటివి. సంగ్రహం, విలాసం, ఆశ — వీటిలో చిక్కుకున్న వ్యక్తులను లోభ లిప్స వశపరచుకొని, పరమార్థ రసాన్ని ఆస్వాదించనీయదు. స్వార్థపరులు, పరమార్థాన్ని, స్వార్థాన్ని త్రాసులోని రెండు సిబ్బెలలోను పెట్టి స్వార్థం వైపు ఏదో ఒకరాయి, రప్ప చేరుస్తూ బరువుని పెంచి, పరమార్థం వైపు సిబ్బె తేలిక అయ్యేలా నేర్పుగా తూకం వేస్తూ ఉంటారు.
ఉత్కృష్ట మార్గంలో ప్రవేశించాలనుకునే వారందరికీ విత్తేషణ, పుత్రేషణ, అహం – ఈ మూడింటినీ త్యజించిన తరువాతనే ఆ శ్రేయోమార్గంలో కాలు మోపండని మహాత్ములు సలహానిస్తారు. ఈ విధమైన మనోనైర్మల్యం ప్రాప్తించకుండా భక్తి అనేది వ్యక్తిలో ప్రవేశించదు. ఈ స్థితికి చేరని వ్యక్తుల ద్వారా ప్రదర్శింపబడే భక్తి కేవలం ప్రదర్శనగాను, ఆడంబరంగానూ పేర్కొనబడింది. అంతరంగం స్వచ్ఛంగా మారిన మరుక్షణం ఆ వ్యక్తికి దైవం దూరంగా నిలువలేక తనంత తానే ఆ వ్యక్తిలో స్థిరనివాసాన్ని యేర్పాటు చేసుకుంటాడు.
ఈ సత్యాన్ని భక్త కబీరు ఎలా తెలిపారంటే : “ప్రేమ మార్గం చాలా ఇరుకైనది. ఆ మార్గంలో ఇద్దరు ఇమడలేరు. ప్రేమతో కూడిన ఆ భక్తి మార్గంలో ‘నేను’ ఉన్నంతకాలం ‘హరి రాలేడు’ ఈనాడు ఆ మార్గంలో హరి అడుగిడటం వలన, అక్కడ ‘నేను’ తప్పుకోక తప్పింది గాదు.”
ప్రేమ భావనతో పూర్తిగా నిండియున్న అంతఃకరణం ప్రత్యక్షంగా స్వర్గమే. పాత్ర నిండిన తర్వాత ప్రక్కలకు తొలకకమానదు. అలాగే పూలలోని సుగంధం వాయువుని సుగంధ భరితం చేయకుండాను, తుమ్మెదలను, తేనెటీగలను తమలోని మకరందాన్ని స్వీకరించమంటూ పుష్పాలు ఆహ్వానించకుండాను ఉండలేవు. సరిగ్గా ఇదే స్థితి సదా ఆనందానుభూతికి లోనైన వ్యక్తులది కూడా. వీరు తమ అంతరంగంలోని ఆనందాన్ని పంచుతూ ఉండాలని సదాకోరుతా ఉంటారు. ఇటువంటి అంతరంగాలనే దైవం తన మందిరాలుగా భావించి, అక్కడ నివసిస్తూ నిత్యపూజలు అందుకొంటూ ఉంటాడు.
అనంతశయన తీర్థంలోని కృష్ణ విగ్రహానికి చోళనరేంద్రుడు విలువైన ఆభూషణాలను ధరింపజేస్తాడు. అలాగే ఒక పేద బ్రాహ్మణుడు కూడా వచ్చి, తన వద్దనున్న తులసి దళాలను, కృష్ణునకు సమర్పించి జలంతో అభిషేకిస్తాడు. ఇది రాజుకు నచ్చలేదు. వివాదం చెలరేగింది. చోళరాజు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకోవటానికి కోట్ల ధనాన్ని ఖర్చుచేసి విరాట్ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఇద్దరిలో ఎవరు గొప్ప భక్తుడో తేల్చమంటూ ప్రముఖ పూజారులను ఆజ్ఞాపిస్తాడు.
యజ్ఞయాగాలు నిర్వహించలేని పేద బ్రాహ్మణుడు విరాట్ యజ్ఞం జరుగుతున్నంత కాలం కేవలం విష్ణు పూజలోనే గడిపివేస్తాడు. నెలలు గడిచాయి, ఇలా ఉండగా బ్రాహ్మణుడు పూజానంతరం పెట్టే నైవేద్యం వారం రోజులుగా ఎవరో అపహరించసాగారు. దొంగ ఎవరో తేల్చాలని తొమ్మిదవరోజు బ్రాహ్మణుడు సావధానంగా ఉంటాడు. మామూలు సమయానికి దైన్య స్థితిలో నున్న ఒక చంఢాలుడు వచ్చి, రొట్టెలు అపహరిస్తూ బ్రాహ్మణుని కంటపడతాడు. బ్రాహ్మణుని హృదయం ద్రవించింది.
ఇంత దీనంగా బలహీనంగా ఉన్న వ్యక్తి కేవలం ఎండు రొట్టెలు ఎలా తినగలడని తలంచి దీపంకోసం తెచ్చిన నెయ్యిని కూడా రొట్టెల్లో నంచుకుని తినమంటూ, గిన్నె పట్టుకుని చంఢాలుని వెంట పరుగు పెట్టాడు. చండాలుడు తన నిజ స్వరూపంతో విష్ణుమూర్తి రూపంలో దర్శనమిచ్చి బ్రాహ్మణుని తన విమానంలో కూర్చుండబెట్టుకొని వైకుంఠానికి తీసుకుపోతాడు. విరాట్ యజ్ఞాన్ని నిర్వహించే రాజు ఇదంతా చూసి నిశ్చేష్టుడవుతాడు.
భక్తుడు నావ నడిపే నిషాదుడే కావచ్చు, ముసలిదైన శబరి కావచ్చు. వనాలలో గెంతులు వేసే వానరులైనా సరే భగవంతుడు అనుగ్రహించడానికి వెనుకాడడు. దుర్యోధనుని భోజనం కంటె విదురుని భోజనం శ్రేష్ఠమైనదిగా భావించినవాడు పరమాత్ముడు. కాబట్టి నిర్మలమైన అంతఃకరణ ఎక్కడ ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు.
