By fulfilling one’s duty, one will attain the highest honors.

తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా అత్యున్నత గౌరవాలను పొందుతారు.

ఒక వ్యక్తి యుక్త వయస్సులోనే సన్యసించి దైవచింతనలో జీవితం గడిపి మరణిస్తాడు. మరణానంతరం చిత్రగుప్తుడు అతని పరమార్థాన్ని లెక్కలు కట్టి కుటుంబం కోసం అతడు ఆచరించిన బాధ్యతాయుతమైన కర్మలను పరమార్థంగాను, సన్యసించి ఇతరుల పోషణతో జీవిస్తూ వ్యక్తిగత వికాసానికి, మోక్షానికి దైవస్మరణ చేస్తూ గడిపిన కాలాన్ని స్వార్థం క్రింద జమకట్టి పంపిస్తాడు. వ్యర్థ సన్యాసం ఎందుకు స్వీకరించానా? అని వ్యక్తి నెత్తి నోరు మొత్తుకొంటాడు. కర్తవ్యం పట్ల విముఖుడైన వ్యక్తి పలాయన వాదిగా పేర్కొనబడతాడు.

మహిధరుడు ఆత్మజ్ఞానాన్ని ఆశించి ఇల్లు వదలి వెళ్లిపోతాడు. చాలా కాలం తపోధ్యానాలతో గడిపినా అతను ఏ మాత్రం తృప్తి పొందలేదు. ఇంటికి తిరిగివస్తాడు. తిరిగి వచ్చిన పుత్రుని చూచి తల్లి బాధతో, “కుమారా! వచ్చావా! మా దుఃఖాన్ని గుర్తించి వచ్చావు. తప్పక నీకు పూర్ణత్వం లభిస్తుంది ” అని ఆశీర్వదిస్తుంది. ఆమె ఆశీర్వాదం ఫలించి ఆయన వేద జ్ఞానంలో పరిపూర్ణుడై, నాల్గు వేదాలకు భాష్యం చెప్తాడు.

కార్వేమహర్షి నారీ ఉద్ధరణకు సంకల్పం తీసుకుని ఒక బాల వితంతువును వివాహమాడి జీవితం అంతా ప్రతికూల పరిస్థితుల మధ్య గడిపినా బాధ్యతను మాత్రం తు. చ. తప్పక నిర్వర్తిస్తాడు. అయిన కృషి వల్లనే ఈనాడు మహారాష్ట్ర నారీ ప్రగతిలో ప్రథమస్థానం వహించింది.

జమన్ లాల్ బజాజ్ ఐశ్వర్యానికి కాక రాష్ట్ర గౌరవానికి, సమాజ శ్రేయస్సుకి ప్రాధాన్యత నిచ్చి సమస్త సంపదను గాంధీజీకి సమర్పించి, జీవితం అంతా సమాజరుణం తీర్చటానికి ధారపోస్తాడు. అందుకే గాంధీజీ అతడిని తన ఐదవ పుత్రుడుగా భావించేవాడు.

గోపాలకృష్ణ గోఖలే నిర్థనుడుగా పెరిగి పెద్దవాడై కాలేజీ చదువుకు వచ్చేసరికి అన్న వదిన అతనికి ఆర్థికంగా సహాయంచేయ సంకల్పిస్తారు. ‘అన్న’ ఆయన నెల జీతం రూ. 15 లలో 8 రూపాయలతో కుటుంబాన్ని పోషించి 7 రూపాయలు తమ్ముని చదువుకు పంపించేవాడు. చదువు పూర్తి అయి, గోఖలేకి ఉద్యోగం లభించింది. 35 రూపాయల వేతనం లభించేది. రోమరోమంలోను కృతజ్ఞత నింపుకున్న గోఖలే ఆయన జీవితం అంతా అన్న, వదినకు తన జీతాన్ని పంపుతూ తన ఖర్చు కి 10 రూపాయలు మాత్రం ఉంచుకునేవాడు.

ఇది అప్పు తీర్చడం కాదని కర్తవ్యపాలనకు మమతకు శ్రథాంజలి రూపంలో అందచేసే కానుక అనేవారు.

దశరధ, మాయాసురుల మధ్య ఘౌర యుద్ధం జరుగుతోంది. మాయావి అయిన మాయాసురుని చేతిలో ఎందరో రాజులు పరాజయం పొందారు. దశరథునికి కూడా తన విజయం పట్ల ఆశ సన్నగిల్లింది. సరిగ్గా అదే సమయంలో రథసారధ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటా కైకేయి యుద్ధ భూమిలోనికి ఉరికింది. ఆమె సారధ్యంలో దశరథుడు రాక్షస సేనను చెల్లాచెదురుచేసి పడవేశాడు. ఇంతలో ఒక రథచక్రం యొక్క సీల జారి పడిపోయింది. యుద్ధం సమాప్తం అయ్యే వరకు కైక తన చిటికెన వేలు రథ చక్రంలో పెట్టి రథం పడిపోకుండా కాపాడింది.

పైకి చెప్పడమైతే ఆ విజయం దశరథుడిది అంటారేగాని వాస్తవానికి ఆ విజయం అతని భార్య యొక్క “కర్తవ్య పరాయణత” ది మాత్రమే.

సులోచన జీవితం అంతా పాతివ్రత్యధర్మాన్ని పాటిస్తూ కఠోర సాధన చేసింది. ఆమె సాధన ఫలితంగానే మేఘనాథుని ముందు దేవతలు కూడా నిలబడి పోరాడలేనంత శక్తి అతనికి లభించింది. ఇంతటి వీరుణ్ణి లక్ష్మణుడు చంపగలిగాడంటే ఆ శక్తి అతనికి ఊర్మిళ పాతివ్రత్యం ద్వారా లభించింది. భర్త దూరంగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో ఆమె పురుషుని కన్నెత్తి దర్శించలేదు.

భర్త వనవాసంలో ఉన్న కారణంగా ఆమె కూడా రుచికరమైన భోజనాన్ని, ఆభూషణాలను, సౌకర్యాలను త్యజించి వేసింది. ఇటువంటి నిష్ఠ అంతరిక్షంలోని సూర్యునిలా విశ్వచరిత్రలో ఈనాటికి వెలుగులు వెదజల్లుతూ యశోగాథల ద్వారా భారతీయ సమాజానికి అపారమైన శక్తిని ప్రసాదిస్తోంది.

భీముడు, హనుమంతుడు తమ సంరక్షణ పట్ల సావధానులై ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించేరు. దీని వలన వారికి అనేక అవకాశాలు, శ్రేయస్సు, పుణ్యం కూడా లభించాయి.

విభీషణుడు, భరతుడు విపరీత పరిస్థితులలో కూడా మానసిక సంతులనాన్ని నిలుపుకోవటం వల్ల వారికి అపరిమితమైన శ్రేయస్సు దక్కింది.

మదాలస, కుంతి మొదలైన తల్లులకు తమ కుటుంబాలను ఉన్నత సంస్కారాలతో తీర్చిదిద్దటం వల్లనే ఎంతో పుణ్యఫలం దక్కింది.

సమాజ ఋణం తీర్చటమే జీవన ధ్యేయంగా ఎంచిన శంకరాచార్య, మండనమిశ్రులను విశ్వమంతా వందనీయులుగా కొలిచారు.

ధర్మం, సంస్కృతి వీటిని రక్షించటం, తమ కర్తవ్యాన్ని పాలించటం వీటి కారణంగానే జటాయువు వంటి పక్షులు సయితం శ్రేష్ఠమైన సన్మానాలను దైవం ద్వారా పొందగలిగారు.

Leave a Comment