As long as Individuals Practice Sense Restraint, they will have Perfect Powers.

వ్యక్తులు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినంత కాలం, వారికి పరిపూర్ణ శక్తులు ఉంటాయి.

శక్తి భండారమంతా నియత్రణాపరుల సొత్తు. దయానంద మహర్షి కి బీరేనేర్ మహారాజుకి మధ్య గాఢమైన మైత్రి ఉండేది. మహారాజు తరచుగా తన బ్రహ్మచర్యం యొక్క శక్తిని ప్రదర్శిస్తూ బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని స్వామీజీకి చెపుతూ ఉండేవాడు. కానీ స్వామిజీ నవ్వి ఆ మాటలు పట్టించుకొనేవాడుగాదు. ఒక రోజు ఉదయాన్నే రాజు నాలుగు గుఱ్ఱాల బండిని ఎక్కి ప్రాతఃకాల భ్రమణానికి బయలుదేరాడు.

నాలుగు గుఱ్ఱాల కళ్లాలు లాఘవంగా చేతితో పట్టుకొని తన నైపుణ్యాన్నంతను చూపెడుతూ బండిని నడపటానికి రాజు విశ్వప్రయత్నం చేశాడు. కానీ గుఱ్ఱాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. రాజు ఆశ్చర్యంతో దిక్కుతోచక వెనుతిరిగి చూసేసరికి స్వామీజీ ఒక వేలుతో పట్టుకొని బండిని ఆపుచేశాడు. ఆ వేలు తీయగానే బండి కదిలింది. రాజు అసలైన నియంత్రణ, బ్రహ్మచర్య యొక్క ప్రభావానికి చకితుడై దయానందునికి నమస్కరిస్తాడు.

శత్రుపక్షానికి చెందిన ఒక అందమైన అమ్మాయిని శివాజీ సైనికులు పట్టితెచ్చి శివాజీ ఎదుట నిలబెడతాడు. ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి శత్రువులు పాటించే పద్ధతులనే పాటించాలని వారు ఆవిధంగా చేస్తారు. కానీ శివాజీ ఆమెకు నమస్కరిస్తూ, అమ్మా! నా తల్లి కూడ నీ అంత అందాలరాశి అయిఉంటే నేను కూడా నీ అంత సౌందర్యంతో జన్మించి ఉండేవాడిని కదా అంటూ ఆమె సౌందర్యాన్ని ప్రశంసించి సగౌరవంగా ఆమెను ఆమె ఇంట దించిరమ్మని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. శివాజీ పాటించే నియమ నియంత్రణలే అతడిని ఛత్రపతి శివాజీని చేసి అతని కీర్తి ఆచంద్రార్కం వెలుగొందేలా చేశాయి.

దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహకరించటానికి అర్జునుడు స్వర్గానికి ఆహ్వనించబడతాడు. దేవతలకు విజయాన్ని లభింపచేస్తాడు. అర్జునుని పరాక్రమానికి ముగ్దురాలై దేవలోకంలోని సర్వశ్రేష్ఠమైన సౌందర్యరాశి నాటకం ఆడి “దీనురాలిని నాకు కూడా సహాయం చేయుమని” అర్జునుని అర్దిస్తుంది.

నీ అపద ఏమిటని అర్జునుడు ప్రశ్నించగా, నాకు నీవంటి పుత్రుని ప్రసాదించమని కోరుతుంది. అర్జనుడు ఆమె మాటలోని మర్మాన్ని గుర్తించి, పుత్రుని కోసం నవమాసాలు నిరీక్షణ ఎందుకు? ఈరోజు నుండి నీకు నేను పుత్రుడినే అంటూ చేతులు జోడించి నమస్కరిస్తాడు. అర్జునునిలోని నియంత్రణ, ఇంద్రియ నిగ్రహం ఊర్వసిని ఆశ్చర్య చకితురాలిని చేయటమేగాక అతడిని అజేయుణ్ణి చేశాయి.

అనేక సిద్ధులు నియంత్రణ యొక్క చమత్కారాలే. నియంత్రణ లేనివారు ఏ సిద్ధులనూ పొందలేరు. సాధరణ జీవితాలను కూడా ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తులు దీనంగా హీనంగా గడుపుతూ ఉంటారు.

యయాతి నిగ్రహం కల్పోయి తన కొడుకు యొక్క యవ్వనాన్ని కూడా స్వీకరించి జీవించవలసి వస్తుంది. కీచకుడు నియమోల్లంఘన వల్లనే ఘౌరంగా నాశనమవుతాడు. శూర్ణణక నిగ్రహం తప్పి ప్రవర్తించటం వల్లనే తాను పతనమై రాక్షస వంశాన్ని నాశనానికి కారకురాలైంది. సుందోపసుందలు నియమాలను ఉల్లఘించి నశించేరు. పాండురాజు మరణం ఇంద్రియ నిగ్రహంలేని కామం వల్లనే సంభవించింది.

దేవతలు అసురుల మధ్య ఘౌరయుద్ధం జరుగుతోంది. రాక్షసుల శస్త్రబలం, యుద్ధకౌశలం ముందు దేవతలు నిలవలేక ప్రాణభీతితో పారిపోయి మహర్షి దత్తాత్రేయునికి వారి విపత్తును విన్నవించుకొంటారు. మహర్షి వారికి ధైర్యాన్ని కల్గించి తిరిగి పోరాడండని పంపిస్తాడు. కానీ ఈసారి కూడా ఓడిపోయి ప్రాణభీతితో పారిపోయి వస్తారు. రాక్షసులు కూడా వారిని వెంబడిస్తారు.

రాక్షసులు ఆశ్రమంలో ప్రవేశించి, మహర్షి వద్ద కూర్చొని ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూచి మోహంతో, ఆమె శ్రీమహాలక్ష్మి అని గుర్తింపజాలక కామాంధులై ప్రవర్తిస్తారు. వాళ్ళ మనస్సు చెదిరి నిగ్రహాన్ని కోల్పోయిన రాక్షసులతో దేవతలు యుద్ధం చేసి వారిని ఓడించివేస్తారు. ఆ విధంగా అసురులు నాశనమవుతారు.

వ్యక్తులు సదాచారులై ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినంతవరకు వారిలో పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చెడు మార్గంలో పాదం మోపిన నాటినుండి శక్తి క్షీణించటం ఆరంభమవుతుంది.

As long as Individuals Practice Sense Restraint, they will have Perfect Powers.

Leave a Comment