Forgiveness • Simplicity • Selflessness • Freedom from Greed
ఏదో ఒకనాడు తుకారామ్ ను నీచుడుగా నిరూపించాలని భావించి ఒక వ్యక్తి ప్రతి రోజు తుకారం ఇంటికి కీర్తనలు వినాలనే వంకతో వస్తుండేవాడు. కొంతకాలానికి అలాంటి ఒకరోజు రానే వచ్చింది. తుకారాం గేదె అతని చేలో మొక్కలు పాడుచేసిందని ఇంటి మీదకు వచ్చి తిట్టసాగేడు. తుకారాం చలించక, నిశ్చలంగా దైవ ప్రార్థన చేసుకోవటం చూసి మరింత కోపించి ఒక ముళ్ళ కర్ర తెచ్చి రక్తం కారేల కొట్టసాగేడు.
అయినా కూడా ప్రతిఘటించక, తుకారాం నిశ్చలంగా ఉండిపోయాడు. అంతేగాక ఆ సాయంత్రం ఆ వ్యక్తి ప్రతిరోజులా విష్ణు భజనలు వినడానికి రాకపోయేసరికి చింతిస్తూ, అతని ఇంటికి వెళ్లి తన గేదె ద్వారా జరిగిన తప్పును మన్నించమని కోరి విష్ణు భజనలు వినడానికి రమ్మంటూ వెంటే పెట్టుకొని వస్తాడు. ఈ సంఘటన ఆ వ్యక్తి జీవితాన్నే మార్చివేసింది. తరువాత అతడు తుకారాం ప్రియ శిష్యుడయ్యాడు. తన పట్ల ఎంతో క్రూరంగా వ్యవహరించే వ్యక్తుల పట్ల కూడా అపరిమితమైన వాత్సల్యాన్ని, స్నేహాన్ని కురిపించగల్గటం మహాత్ముడి మొదటి లక్షణం.
సమర్థగురు రామదాసు రెండు మూడిండ్లలో భిక్షాటన చేసి లభించిన దానితో వంట చేసుకునేవాడు. యధాప్రకారం ఒకనాడు ఒక ఇంటిముందు భిక్షాటనకి నిలిచి పిలువగా, ఆ ఇల్లాలు కోపంతో ఇల్లులకుతున్న గుడ్డను ఈయన ముఖం మీద విసిరికొట్టింది. ఆయన చిరునవ్వుతో తిరిగివెళ్లి నదిలో స్నానంచేసి ఆ గుడ్డను శుభ్రంగా ఉతికి, ఎండవేసి ఆ గుడ్డతో దీపపు వత్తులు తయారుచేసి సాయంత్రం పూజా సమయంలో దేవుని ముందు దీపాలు వెలిగించి, “ఓ ప్రభూ! ఈ వత్తులు ఏవిధంగా ప్రకాశిస్తున్నాయో అదే విధంగా ఆ ఇల్లాలు హృదయాన్ని కూడా ప్రకాశవంతం చేయుమని” నిండు హృదయంతో ప్రార్థన చేస్తాడు.
ప్రతి వ్యక్తి హృదయంలోనూ కూడా ఇంతటి ఉదాత్తమైన భక్తిభావనలే నిండి ఉంటాయి. కానీ వ్యక్తి స్వార్థం, ఏకాకితనం, వీటికి బానిస అవగానే క్రమంగా ఈ ఉదార భక్తి భావనలు నశించ నారంభిస్తాయి. ఇటువంటి వ్యక్తులయొక్క మహాత్మ్యకాంక్ష వీరిని క్షణకాలం శాంతిగా జీవింపనీయక బ్రతికి ఉండగానే నరకాన్ని అనుభవింపజేస్తుంది.
మహారాజైన సంజయునికి సంతానం లేదు. సంతానం కోసం అతను బ్రాహ్మణులను భక్తితో సేవించేవాడు. బ్రాహ్మణులు రాజుకి సంతానాన్ని ప్రసాదించమని నారదుని కోరగా, నారదుడు నీకు ఏటువంటి పుత్రుడు కావాలని రాజుని ప్రశ్నిస్తాడు. లోభం వలన రాజు తన పుత్రుని మలమూత్రాలు కూడా స్వర్ణమయం కావాలని కోరుకున్నాడు. నారదుడు ‘తథాస్తు’ అన్నాడు. రాజ్యం అంతటా ఈ వార్త వ్యాపించింది.
కొందరు చోరులు ఈ కబురు తెలుసుకొని బాలుని అపహరించుకు పోతారు. ఈ బాలుని ముందుగా ఎవరి వద్ద ఉంచుకోవాలనే విషయంలో చోరులమధ్య పోట్లాట వచ్చింది. వారు బాలుని చంపి బంగారాన్ని సమంగా పంచుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా బాలుడు మరణిస్తాడు. బాలుని మరణవార్త విని రాజు, దొంగలను కూడా పట్టి వధిస్తాడు. లోభమే సర్వపాపాలకు, దుఃఖాలకు మూలమని రాజుకి చివరకు అర్ధమవుతుంది.
హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల అంతిమ స్థితి కూడా ఇదే. వీరు సృష్టిలోనున్న వైభవానికంతకూ ఆధిపత్యం వహించాలని ఆశించి రాక్షసత్వంతో విజృంభించి చివరకు నశిస్తారు. కౌరవుల దురాశకూడా చివరకు వారినే కబళించి వేసింది.
సాదాజీవనం మహాత్ముల మరియొక లక్షణం: నిరాడంబరంగా జీవించలేని వారికి సంగ్రహించాలనే కోరిక ప్రబలమై అంతరంగంలోకి ప్రవేశించే ఉన్నతమైన ఆలోచనలకు అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి భక్తులు సాదాజీవనం, ఉన్నతమైన ఆలోచనలు – ఈ రెండింటికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరు తక్కువ తింటూ ఎక్కువ తినిపించడం, తక్కువ పొందడం ఎక్కువ ఇవ్వటం కోసం తపన చెందుతూ ఉంటారు. మానవమాత్రులపట్ల గల కర్తవ్య పథంలో నిలబడాలని కోరే వ్యక్తికి మహాత్వకాంక్షలనేవి ఉండనే ఉండవు.
