The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

పరమహంస తల్లి అవసానకాలంలో కొడుకు వద్ద ఉండాలని వచ్చింది. మధురానాథ్ గురువైన పరమహంసకు, ఆయన తల్లికి శ్రద్ధగా సేవ చేసాడు. అమ్మా! నీకేం కావలన్నా నాకు చెప్పు. క్షణంలో తెచ్చి నీ ముందుంచుతాను అని పదే పదే చెబుతూ ఉండేవాడు. ఆమె చిరునవ్వు నవ్వి నాకు అన్నీ ఉన్నాయి నాయనా, నీకు నా ఆశీస్సులు. నీవు ప్రశాంతంగా ఉండమని చెప్పేది. కానీ మధురానాథ్ తృప్తి చెందక పదే పదే ఏమి కావాలని అడగటం వలన, నాకు నశ్యం తెచ్చి పెట్టుమని అడుగుతుంది. మధురాబాబు కన్నుల నీళ్ళునిండాయి ఇటువంటి నిర్మోహంకల తల్లికి రామకృష్ణుని వంటి పుత్రుడు కల్గటంలో ఆశ్చర్యం యేమున్నదని అనుకుని ఆమె పాదాలకు నమస్కరించి ఆనాటి నుండి విసిగించటం మానివేశాడు.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కిశోరావస్థలోనున్నప్పుడు ఒకనాడు ఒక స్నేహితుని వెంట పెట్టుకుని వచ్చి తల్లికి పరిచయం చేస్తూ, ఇతడు ‘ఫీజు’ కట్టడానికి ధనంలేక పరీక్ష రాయలేకపోతున్న నా స్నేహితుడు. నివేమైనా సహాయం చేయగలవేమోని నీ వద్దకు తీసుకొని వచ్చాను అని చెబుతాడు. తల్లి వెంటనే మెడలోనున్న ఒకగానొక్క మంగళసూత్రాన్ని తీసి అమ్మివైచి ఆ బాలుని ‘ఫీజుకి’ యేర్పాట్లు గావిస్తుంది. ఆ బాలుడు పరీక్షలో ఉత్తీర్ణుడై ఆమె పాదాలకు నమస్కరిస్తూ మంగళసూత్రాన్ని తీసుకున్నందుకు ఎంతగానో దుఃఖిస్తాడు. ఆమె ఆ బాలుని అక్కున చేర్చుకుంటూ, నాయనా! దాని పేరే మంగళసూత్రం. కాబట్టి మంగళకరమైన ఒక పనికి ఉపయోగపడింది. దీనిలో దుఃఖించవలసినదిగాని, విచారించవలసినది గానీ యేమీ లేదని ఓదారుస్తుంది.

ఇటువంటి మహోన్నతురాలైన తల్లి ఒడిలో పాఠాలు నేర్చుకున్న భాగ్యశాలి గనుకనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ హృదయంలో బాల్యం నుండి కూడా కలిగినదాన్ని పంచుకొని తినాలని, ఆత్మీయతతో కలిసి జీవించాలనేటువంటి ఉత్కృష్ట భావనలు ఉద్భవించాయి.

ప్రఖ్యాతిచెందిన ఒక మహాత్ముడు, ఊరి చివర కుటీరంలో నివసిస్తూ విరామ సమయంలో ఏక్తార్ వాయిద్యాన్ని వాయిస్తూ ఉండేవాడు. ఈయన ఖ్యాతిని గూర్చి విని ఒక ధనికుడు దర్శనానాకై వస్తాడు. వస్త్రాలు శిధిలమై ఉన్నా, ముఖం దివ్య తేజస్సుతో వెలుగుతూ తనకు స్వాగతం చెప్పటానికి కుటీరం ముందు నిలబడిన ఆ మహాత్ముని జూచి ధనికుడు సానుభూతితో, మహాత్ములు ఇంత దరిద్రంతో దుర్భరంగా కష్టాల ననుభవిస్తూ ఇంత దైన్యంగా ఉంటారా? అని ప్రశ్నిస్తాడు.

మహాత్ముడు అందుకు మందహాసంతో, ఓ సంపన్నుడా! దరిద్రులైన మహాత్ముల వద్ద ఇవ్వటానికి అపారమైన అనేక సౌపదలు ఉండటం వల్లనే నీవంటి సంపన్నులందరూ యాచించటానికి వస్తూ ఉంటారు. మావంటి దరిద్రులు తమ వద్దనున్న సంపదలను పాత్రత గలవారు ఎవరు లభిస్తారా, ఎంత ఎక్కువ పంచుదామా అని ఎదురుచూస్తూ ఉంటాము. మేము ఎంత పేదరికంతో, ఎంత దైన్యంగా ఉన్నప్పటికీ నీవంటి సంపన్నులను యేమీ యాచింపజాలము. ఒకవేళ యాచించవలసి వచ్చినప్పటికీ ఏకాఎకీ ఈశ్వరుని మానవమాత్రులందరి కోసం యాచిస్తామే తప్ప మాకిది కావాలంటూ మీవంటి సంపన్నుల ముందు చేయిచాచే ప్రసక్తే లేదని తెలియ చేస్తాడు. ఏదో అడుక్కోవాలని వచ్చిన ధనవంతుడు సిగ్గుతో తల వంచుకుని అచ్చట నుండి నిష్క్రమిస్తాడు.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

Leave a Comment