True Devotion: Selfless Service, Sacrifice And Welfare of All.

అసలైన స్వర్గాధికారం గల వ్యక్తిని ఎవరినైనా వెదికి తీసుకొని రమ్మని విధాత జయవిజయులను భూలోకానికి పంపిస్తాడు. ధార్మిక కార్యక్రమాలలో లగ్నమైయున్న అనేక మందిని జయ విజయలు భూమిపై దర్ళించి.

“ఇవన్నీ మీరెందుకు ఆచరిస్తున్నారని ప్రశ్నిస్తారు. “ఈ ప్రపంచం మాయ, దీనినుండి ముక్తి లభించాలి. అలాగే మాకు పాపవిమోచనం జరగాలి. అందుకే ఆచరిస్తున్నామని” వారు బదులు పలికారు. జయవిజయులు ముందుకు సాగుతుండగా రాత్రి కావటాన ఒక అంధుడు ఒక దీపాన్ని వెలిగించి బాటసారులకు వెలుగు చూపటంకోసం అరుగుపై పెట్టి, దారి తెలియని క్రొత్తవారికి దారి గురించి చెబుతూ, అవనరంలో ఉన్న వారికి రాత్రి తన అరుగుపై ఆశ్రయమిచ్చి, వీలైనంత వరకు వారి ఆకలి దప్పులు తీర్చుతూ మర్నాడు వేకువ ఝామున జీవనోపాధికోసం తోటపని చేసుకోటానికి బయలుదేరుతూ జయవిజయులను ఆకర్షిస్తాడు.

వీరు అంధుని సమీపించి, “అయ్యా! రాత్రి నుండి నిన్ను గమనిస్తున్నాము. బొత్తిగా ఈశ్వరారాధన అనేది నీ దినచర్యలో ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా ప్రాతఃకాల సమయం ఈశ్వరారాధనకు మంచిది కదా? ఈ సంగతి నీకు తెలియదా?” అని ప్రశ్నిస్తారు. అంధుడు వినయంతో, “అయ్యా! ఈశ్వరారాధనయొక్క అసలైన స్వరూపం రాత్రి బాటసారులకు వెలుగు చూపటం, పగలు పరిశ్రమ చేయటం అని మాత్రమే నాకు తెలుసు. ఇంతకుమించి విధి విధానాలు ఏమి తెలియని వాడిని” అని బదులు పలుకుతాడు.

తరువాత, భూలోకాన్ని వదలి వెళ్ళిపోయిన జయవిజయులను చూసి వారి ద్వారా విషయాలు విన్న విధాత అత్యంత ప్రసన్నుడై “ఉపాసన” అంటే కేవలం జప, తప, ధ్యానాలు కావని, ఆదర్శంతో నిండిన అంతఃకరణంలోనే ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడని బుజువు చేసిన అంధుడే ధార్మిక కర్మకాండల నాచరిస్తున్న వ్యక్తుల కంటె కూడా స్వర్గాధికారానికి అర్హుడని నిర్ధారించి, అంధుణ్ణి సగౌరవంగా స్వర్గానికి తోడ్కొని రమ్మని జయవిజయులను భూలోకానికి పంపిస్తాడు.

శక్తివంతుడైన వృత్రాసురుడు యేవిధంగానూ మరణించక దేవతలు భీతి చెందినపుడు, ఎవరైనా తపోసంపన్నుని వెన్నెముకతో ఆయుధ నిర్మాణం జరిగితే కేవలం దానితో మాత్రమే వృత్రాసురుడు
మరణిస్తాడని బ్రహ్మ తెలియజేస్తాడు.

ఇంద్రునితో సహా సమస్త దేవతలు దధీచి వద్దకు వెళ్ళి విషయాన్ని విన్నవిస్తారు. ఒకనాడు ఇంద్రుడు దధీచి మహర్షి తపోశక్తికి భయపడి, అనేక విధాలుగా ఆయనను బాధించాడు. అయినప్పటికీ మహర్షి ఇంద్రుని ద్వేషించక అతని కోరికను మన్నించి పరమార్ధ ప్రయోజనానికి దేవతల రక్షణకు ఈ నశ్వర దేహం ఉపయోగపడుతుందీ అంటే నాకు అంతకంటే ఆనందమేమున్నదని చెప్పి యోగబలంతో దేహత్యాగం చేస్తాడు. ఆ విధంగా దేవతలు వజ్రాయుధ నిర్మాణం చేసి వృత్రాసురుని వధిస్తారు. త్యాగం వలన లభించే ఆనందం స్వర్గాన్ని మించినది.

త్యాగమూర్తులు దైవం యేమైనా వరాలిస్తానని ముందుకు వచ్చినా విశ్వామానవ కళ్యాణం కోసమే కోరికలు కోరుకొంటారేగానీ, తభకంటూ యేదీకోరరు.

మహారాజైన రంతిదేవుని ప్రచండమైన తపోశక్తికి ఇంద్రాసనం ఊగిపోయింది. ఇంద్రుడు పరుగెత్తి వచ్చి, ప్రత్యక్షమై ఏమి కావాలన్నా అడుగు నీ కోరికలను తీరుస్తానని ప్రసన్నుడై తాడు. కానీ రంతిదేవుడు వినమ్రుడై, “దేవరాజా! నాకేమీ వద్దు. కానీ నా రాజ్యంలోనేకాక సమస్త భూమండలంలోనూ ఎవ్వరూ పీడింపబడకుండానూ, ఆకలితోను, దరిద్రంతోను బాధపడకుండ అన్న సంపదతో, ఆనందంగా జీవించాలి.

జనుల హృదయాలలో వైరం, ఈర్ష్య, ద్వేషం, కలహాలవంటి దుర్భావనలు మచ్చుకైనా కానరాకుండా పరస్పరం స్నేహ సహాకారాలతో జీవించాలి. రోగాలు, విపత్తులు, దుఃఖాలు ప్రజలను పీడింపరాదు. నా భూమిని హిరణ్యగర్భగా మార్చాలి. ఇది నా కర్తవ్యం అని నీవు గుర్తించి ఈ కర్తవ్య పాలనను పరిపూర్ణ నిష్ఠతో పాటించగల్గే శక్తి సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు, చాలు అని వేదనతో వేడుకొంటాడు.

True Devotion: Selfless Service, Sacrifice And Welfare of All.

Leave a Comment