రవీంద్రనాథ్ ఠాగూరు ఒక వైపు జమీందారీ బాధ్యతలు, మరొకవైపు విశ్వమానవత్వం యొక్క బాధ్యత ఎదుట నిలబడి ఉండగా, విశ్వమానవత్వ బాధ్యతనే భుజస్కంధాల పైన వేసుకుంటాడు. పరాధీనమైయున్న సమాజాన్ని తన భావపూరిత రచనల ద్వారా ఉత్తేజ పరచి, కర్తవ్య పథంలోకి లాక్కొనివచ్చి నిలబెడతాడు.
బంకించంద్ర ద్వారా ప్రజలకు అందించబడిన ఆనందమఠం, వందేమాతరం రవీంద్రుని ద్వారా జరిగిన ఏర్పాట్లే. ఆనాడు ప్లేగు వ్యాధి వ్యాపించినా, భయంకర పరిస్థితులలో సహచరుల సమేతంగా సమాజాన్ని సేవించిన సేవామూర్తి. ఏదో చిన్న కళాక్షేత్రంగా ప్రారంభమైన శాంతినికేతనం చివరకు విశ్వవిద్యాలయ స్వరూపాన్ని ధరించి తన నామాన్ని సార్థకం చేసుకోవటానికి నూటికి నూరుపాళ్ళు కారణభూతుడు – రవీంద్రనాథ్ ఠాగూరు.
దీనబంధు ఎండ్రూజ్ సి. ఎఫ్. ఆండ్రూస్ మొదట్లో ఆంగ్లేయుడు. గాంధీతో కలసినపుడు అంతరంగంలోకి ఆత్మీయత విశ్వమానవ గాంధీతో కలిసి సమైక్యమొందింది. ఆ తరువాత ఈయన భారత స్వాతంత్రయం కోసం భారతీయుల కంటే కూడా ఎక్కువ వ్యాకులత చెందేవారు. దీనబంధు అనే పేరు కూడా ఆయనకు బాపూ పెట్టినదే. ఈ విశ్వమంతా నాకుటుంబమే అయినపుడు నేను ఇంగ్లీషువాడినైనంత మాత్రాన దేశం, జాతి, రాష్ట్రం అంటూ సంకుచితమైన బంధనాలలో ఎందుకు ఇరుక్కోవాలని తనవారి ఎదుట నిలబడి ప్రశ్నించాడు.
ఇతరులకు పంచటానికి, ఇవ్వటానికి ప్రతి వ్యక్తి వద్ద సమయం, శ్రమ, ఆలోచన, కౌశలం, ప్రతిభ, పరామర్శ మొ॥ అనేక దైవదత్తమైన శక్తులున్నాయి. ఇవికాక సంపద, ఆర్జన, విద్య మొ॥ అనేక సంపదలు తప్పకుండా ఎంతోకొంత ప్రతి వ్యక్తివద్ద ఉంటాయి. సదాశయం అనేది ఉండాలేగానీ ఇవ్వటానికి కేవలం ధన సంపదే ఉండాలి అని అనుకోనవసరం లేదు.
తరిగిపోని విభూతులతో నిండిన అక్షయ బండారం ప్రతి వ్యక్తి అంతరంగంలోనూ ఉండనే ఉన్నది. పరమార్థ ప్రయోజనంకోసం ఎవరైనా తమ శ్రమను దానం చెయ్యాలనుకుంటే సమిష్టి శ్రమవల్ల అశుభ్రతను నిర్మూలించవచ్చు. అశక్తులకు, అసమర్థులకు వ్యక్తిగత సహాయాన్ని అందించవచ్చు. వనతికోసం భవనాలు నిర్మించవచ్చు.
అలాగే సమయ సంపదను ఉపయోగించి సత్యవృత్తుల ప్రచారం, నిరక్షరాస్యతా నిర్మూలన వంటి పుణ్యకర్మలు ఆచరించవచ్చు. ఇంక ఆలోచనలతో అత్యంత ప్రధానమైన సేవ, సాహిత్య సేవ చేయటం అత్యంత పారమార్థికమైనది. ఆలోచనా క్రాంతి ద్వారా వ్యక్తుల జీవితాలను విశిష్ట మార్గాల వైపు దారి మళ్ళించవచ్చు. అలాగే శ్రవణ కుమారునివలె సత్సాహిత్య రూపమైన ఆధ్యాత్మ మాతా పితరులను భుజస్కంధాలపై మోస్తూ వ్యక్తి వ్యక్తి వద్దకూ చేర్చి ఆ సాహిత్యం ద్వారా సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకొనిరావచ్చు.
కౌశలం అనేది శిల్పివద్ద, చిత్రకారుని వద్ద, వైద్యుని వద్ద చాలామంది దగ్గర ఉంటుంది. కానీ కౌశలం, జ్ఞానం తనకు ఈశ్వరుడిచ్చిన కానుకగా భావించి దానిని పంచటం ప్రారంభించిననాడే వ్యక్తి సృజనాత్మక గతి విధుల రూపంలో పారమార్థిక కార్యక్రమాలను అవలీలగా ఆచరించగలడు. బొత్తిగా ఇవ్వటానికి నావద్ద ఏమీలేవు అని అనిపించే వారివద్ద కూడా తప్పని సరిగా ఏదో ఒకటి ఉండి తీరుతుంది.
ఉదాహరణకు సత్పరామర్శనే తీసుకోండి. దానిలో అత్యంత అద్భుతమైన శక్తి దాగియున్నది. దారిమరచిన, దారి మళ్ళిన వ్యక్తికి తన అనుభవంతో సరియైన మార్గదర్శనాన్ని చేసి సన్మార్గం వెంట నడవడానికి ప్రేరణనివ్వటం అనేది ఒక జీవితాన్ని దానం చేసినంత పుణ్యప్రదమైనది. ఇంతకు మించిన విశిష్టమైన దానం మరి ఒకటిలేదు.
గాంధీజీ వ్యక్తిత్వ ప్రభావంతో ఆ వృక్షచ్ఛాయలోనే చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ, జమన్ లాల్, బజాజ్, విధాన్ చంద్రరాయ్, సుభాష్ చంద్రబోస్, వల్లభాయి పటేల్, మౌలానా ఆజాద్ వంటి వ్యక్తులు ప్రభవించారు. వీరిలో అందరూ ఆర్థిక సంపన్నులుగారు. కానీ వీరి బుద్ధి కుశలత, ఆలోచనాసామర్థ్యం, విశిష్ట వ్యక్తిత్వం వీరిద్వారా అనంతమైన రాష్ట్రసేవను చేయించాయి.
బంకించంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం ద్వారాను, రాజర్షి రండన్ తన ప్రతిభాకౌశలం ద్వారానూ, వినోభాభావే శ్రమను జాగృతం చేసే ప్రవృత్తి ద్వారానూ, కేశవదాస్ సత్ పరామర్శ ద్వారానూ, స్వామి శ్రద్ధానంద్ సంస్కృతి ఉద్ధరణకు సమయాన్ని, ఆలోచనను వెచ్చించుట ద్వారానూ ఈ విధంగా వీరు చేసిన సమాజ సేవను జాతి ఎన్నటికీ మరువలేనిది. ఈ సందర్భంగా ఎక్కడా ‘ధనం’ అనే పదం ఉపయోగించబడలేదు.
ఇటువంటి విశిష్టయోగ్యతలు కల వ్యక్తులు ఈనాడుకూడా సమాజంలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. కానీ వీరు తమ యోగ్యతలను కేవలం వ్యక్తిగత లాభం, కుటుంబ లాభం కొరకే వినియోగిస్తూ సేకరణకు, ఆర్జనకే పరిమితం చేయడంవల్ల సమాజంలో విపత్కర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
వైద్యుడు తన విద్యను కేవలం డబ్బుకోసమే ఉపయోగిస్తూ, దైవం ద్వారా లభించిన ‘కాలం’లో కొంత భాగాన్నైనా నిస్వార్థ సేవకోసం వెచ్చించని పక్షంలో వారి సామర్థ్యం దురుపయోగం చేసినట్లే అవుతోంది. ఇదేవిధంగా కళలు, సాహిత్యం, విజ్ఞానం, రాజనీతి ఒకటేమిటి అన్ని రంగాలలోను దురుపయోగమే విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. “విశిష్టశక్తుల సదుపయోగం” అనబడే ప్రకాశం బొత్తిగా కరువైతే అంధకారమే దశదిశలా వ్యాపించక తప్పదు. కాబట్టి “యోగ్యతల సదుపయోగం”తో ప్రకాశవంతమైన భావాలు మేల్కొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనినే “ఉదార భక్తి భావన” అంటారు. ఈ భావనే వ్యక్తిని విరాట్ స్వరూపమైన సమాజంతో ముడివేసి సమాజ బుణం తీర్చుకోవటానికి అవకాశాన్ని ప్రసాదిస్తోంది.
భక్తి” అనేది అంతరంగంలోనే పరిమితమై దాగి ఉండేది కాదు. సత్కర్మ రూపంలో బయటకు పొంగి ప్రవహించి సర్వత్రా వ్యాపించి సార్థకమవని నాడు వ్యక్తి యొక్క భక్తికి అర్థ-పరమార్థం లేదు. ఔదార్యం కల హృదయం ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరమార్థం కోసం వ్యాకులత చెందుతూ ఆత్రత పడుతుంది. వ్యక్తి తనలోని స్వార్థభావనను అంకుశంతో సంహరించలేక ఔదార్యం కరువైననాడు, పరమార్థ ప్రరాయణత్వం లోపించినవాడు “కుబేరుని ఖజానా” ఉన్నప్పటికీ వ్యర్థమే. “దారిద్రయం ” అనేది ఔదార్యం లేనప్పుడు అనుభవించేదిగానీ సంపద ధనం లేనంత మాత్రాన అనుభవించాల్సినది కాదు. కానీ సమాజం కేవలం డబ్బులేని వారిని మాత్రమే దరిద్రులనీ, పేదవారనీ అంటుంది. ఔదార్యం, పరమార్థ పరాయణత్వం అనేవి మనిషిలో ఉండాలేగాని తనవద్ద ఏది ఉంటే దానినే సమాజ కళ్యాణానికి ఖర్చు చేయవచ్చు.
