“విశ్వమానవత గొంతెత్తి పిలిచేటప్పుడు మహాపురుషులు, జీవాత్మలను సంసార పరమైన కోర్కెలు, వ్యామోహాలలో బంధించే మాయనుండి రక్షించడానికి దిగి వస్తూఉంటారు. వీరు తమ ప్రగతి పథాన్ని తమకు తామే నిర్మించుకుంటూ ఉంటారు”.
ఆదిశంకరాచార్యకు బాల్యంనుండి ధర్మానికి సంస్కృతికి సేవచేయాలనే కోరిక ఉండేది కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి తల్లి అంగీకరించలేదు. ఉన్నత లక్ష్యాలను నెరవేర్చాలంటే మమకారాలను విడనాడక తప్పదని భావించిన బాలశంకరుడు ఒకనాడు నదిలో స్నానం చేస్తూ “ఆపదలో ఉన్నాను రక్షించుమని” కేకలు వేస్తాడు. కలత చెందుతున్న తల్లితో, అమ్మా! నన్ను రక్షించాలనుకుంటే శంకరునికి ఒప్పగించు.
ఆయనను మించిన రక్షకుడు ఎవ్వరూలేరు అని తెలియజేస్తాడు. కుమారుని మరణం కంటే సన్యాసం మేలని భావించిన తల్లి శంకరునికి సమర్పిస్తుంది. అలాగే శంకరుడు కూడా తల్లి ప్రేమ కంటే లోకకల్యాణం మహత్తరమైనది అని గుర్తించటం వలన దేశంలో నలుమూలలా సద్ జ్ఞానజ్యోతుల్ని వెలిగించాడు.
తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఆశ్రమ నియమాలను అధిగమించి స్వయంగా ఆమె దహన సంస్కారాలను కూడా ఆచరిస్తాడు.
విశ్వ ఉద్యానవనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనిపించే ఔదార్యం హృదయంలో ఉత్పన్నమైతే భక్తి భావనలు అంతరంగంలో ఉందయించినట్లు గుర్తించాలి. ఇటువంటి భక్తజనులు ఇతరులను ప్రసన్నంగాను, సంస్కార వంతులుగాను దర్శించాలని నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు
ఫ్రాన్సిస్ అనే సన్యాసి ఒక కుష్ఠురోగి చికిత్సకు ధనాన్నిచ్చి అనేక విధాలుగా సేవచేస్తాడు. ఈ విధమైన ప్రవర్తనలు తండ్రికి నచ్చక కుమారుని దండించి తన సంపదకు ఉత్తరాధికారం నుండి బహిష్కరిస్తానని హెచ్చరిస్తాడు. తండ్రి బెదిరింపులకు ఏమాత్రం చెలించక ఒక భారమైన బంధనం నుండి విముక్తి ప్రసాదించిన తండ్రికి ధన్యవాదాలు తెలియచేస్తూ తండ్రి ద్వారా ఇంతవరకు లభించిన వస్త్రాలను, ఇతర సౌకర్యాలను కూడా వదిలివేసి ఇల్లువదలి వెళ్ళిపోతాడు. కాలాంతరంలో క్రీస్తు ధర్మాన్ని ప్రచారం చేయటంలో ఆయన చేసిన కృషి, త్యాగం ఎంతటివో అందరకూ తెలిసినదే.
ఒక సాధువు శిష్యసమేతంగా పర్యటిస్తూ ఉండగా ఒక ఊరిలో ఒక బాబా ధ్యానముద్రలో కూర్చొని జపమాల త్రిప్పుతూ అడుగడుగునా కన్నులు విప్పి అటునిటు చూస్తూ తనముందు ఎంత ధనం ప్రోగయ్యిందా, చుట్టూ ఎంతమంది జనం ప్రోగయ్యారా అని కుతూహలంగా పరిశీలిస్తూ ఉంటాడు. ఇది చూసి సాధువు చిరునవ్వు నవ్వుకొని మరికొంత దూరం పోయేసరికి ఒక పండితుడు భాగవత పారాయణం చేస్తూ ప్రజలముందు కూర్చొని ఉంటాడు. ఆయన ముఖంలోనే హావ భావాలు యాంత్రికంగా మారుతున్నాయేగాని భావన, అనుభూతి ఏమాత్రం లేవు.
సాధువు బాధగా నవ్వుకొని మరికాస్త ముందుకు పోయేసరికి ఒక వ్యక్తి ఒక రోగి గాయాలను కడిగి శుభ్రం చేస్తూ కట్టుకట్టి ప్రేమనిండిన స్వరంతో ఆ రోగికి ధైర్య వచనాలు చెప్తున్నాడు. సాధువు కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. ఆశ్రమానికి తిరిగిరాగానే శిష్యులు సాధువుకు నమస్కరించి, స్వామీ! మొదటి రెండు ప్రదేశాలలోనూ నవ్వటానికి, మూడవ ప్రదేశంలో కన్నీళ్ళు నింపటానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తారు.
నాయనలారా! మొదటి రెండు ప్రదేశాలలో దైవం పేరు చెప్పి ఆడంబరం మాత్రమే ఆచరించబడుతోంది. దైవం కోసం నిజంగా వ్యాకులత చెందుతున్నవాడు మూడవ వ్యక్తిమాత్రమే. అతని సేవాభావాన్ని చూసేనరికి నా హృదయం ద్రవించింది. ధర్మం యొక్క నిజమైన స్వరూపాన్ని ప్రజల హృదయాలు ఎప్పటికి అవగతం చేసుకోగలుగుతాయో గదా” అంటూ సాధువు గాఢ నిట్టూర్పు విడుస్తాడు
గోముఖం నుండి ప్రవహించిన నారంభించినపుడు గంగ సంకీర్ణమైన ధారగానే ఉంది. తరువాత నెమ్మదిగా మంచీ చెడులును కలుపుకుంటూ భూమియొక్క సంపదను అభిశించనం కావించాలని, ఆరాటంతో నిరంతరం ముందుకి ప్రవహించటం వల్ల సంకీర్ణమైన ఆధార హిమవత్ పర్వత శృంఖలాల బంధనాన్ని సహితం త్రుంచుకొని విశాలమైన మైదానంలోకి ఉరకగల్లింది. ఆ వ్యాపకతత్వం వల్లనే సమస్త మాలిన్యాలను కడిగివేయగల సామర్థ్యాన్ని సంపాదించి సాగరంలో కలిసిపోగలిగింది.
ఇవ్వటమేగాని, పొందటం, సంగ్రహించటం తెలియని గంగ తన పారమార్థిక తత్వం వల్లనే అనంతమైన కీర్తిని, జనాదరణను పొందగల్లింది. ఈ నిశ్చలతత్వం, ఈ నిర్మలత్వం, ఈ పారమార్థిక తత్వం కలిగియున్న గంగవంటి వ్యక్తులలో మురుగు కాలవ వంటి వ్యక్తులు కూడా గంగలాగానే రూపాంతరం చెందుతారు.
