The mind should be cleansed by removing the impurities that have settled on it on a daily basis.

మనసుపై పడిన మాలిన్యాన్ని ప్రతి నిత్యం తొలగిస్తూ శుభ్రం చేయాలి.

ఒక ధనవంతుడు ప్రతిరోజు శ్రేష్ఠమైన అవు నేతితో దీపం వెలిగించి దేవాలయంలో ఉండేవాడు. ఒక పేదవాడు ఆవనూనెతో చిన్న దీపాన్ని వెలిగించి, చీకటిగా ఉన్న తన వీధి చివరలో పెడుతూ ఉండేవాడు. ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి. ఇద్దరు దైవం దర్బారులో నిలబడ్డారు. నిర్ధనుడికి ఉన్నత స్థాయికి చెందిన సౌకర్యారతో కూడిన జీవితాన్ని, ధనవంతునికి నిన్ను స్థాయికి చెందిన సౌకర్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించి దైవం వారిని తిరిగి భూలోకానికి వెళ్ళమన్నాడు.

దైవ మందిరంలో ఆవునేతి దీపాలు వెలిగంచిన నాపట్ల ఈ విధంగా అధర్మం పక్షపాతం చుపటం భావ్యం కాదని ధనవంతుడు దైవాన్ని ప్రశ్నించాడు.

పుణ్యఫలం పని యొక్క వెలనిబట్టి కాక పనియొక్క ఉపయోగాన్ని బట్టి ఉంటుంది. స్వయం ప్రకాశం కల్గిన దేవాలయములో వెలిగించిన దీపం కంటే చీకటి సందులో ప్రజల సౌకర్యార్థం వెలిగించిన దీపం ఎక్కువ ఉపయోగపడింది. మీరు ఆచరించే పనుల ఉపయోగాన్ని బట్టి మీకు పుణ్యఫలాన్ని ప్రసాదించటం జరిగింది. అని దైవం ధనవంతునికి తెలియబరుస్తాడు.

ప్రాతఃకాలపు మలయ పవనం వీచి గులాబీని తాకి వెళ్లిపోయింది. గాలిలో ఆనందంగా ఊగుతున్న గులాబీని చూచి ఆకులు పరిహాసం చేస్తూ, గులాబీ! నీది ఒక జీవితమేనా? తోటమాలి వచ్చి నిన్ను ఏ క్షణంలోనైనా త్రుంచివేస్తాడు. ఎందుకీ ఆనందం? అని ప్రశ్నిస్తాయి.

గులాబీ శాంత స్వరంతో సోదరులారా! జీవితానికి అసలైన అర్థం సౌరభాన్ని వెదజల్లటం. నాపై వీచే మలయ పవనం ద్వారా నా సౌరభాన్ని నలు దిక్కులా వెదజల్లుతూ మృత్యువు చేతులలో వాలటం కంటే అదృష్టం ఏముంది? అని బదులు పల్కుతుంది.

ఎవరి నుండీ ఏదీ ఆశించక అనవరతమూ అందరకూ సౌరభాన్ని పంచగల పుష్పం జాతికి చెందిన జీవితాన్ని మానవుడు జీవించాలి.

“వినాశనానికి కారణమైన ప్రతిభ కంటె ఎవరికీ ఏ హాని కల్గించని మందబుద్ధి మేలు” అనేది విజ్ఞులు తెలిపిన సత్యం. మందబుద్ధి కలవారిని ఏదో విధంగా సన్మార్గంలో పెట్టి వీరి ద్వారా కొంత మేలు కల్గించవచ్చునేమో గానీ వినాశకరమైన బుద్ధికల ప్రతిభావుతులు మాత్రం అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు.

అనాదిగా కుసంస్కారాలతో మనకున్న అనుబంధం వల్ల అవి మనకు ప్రియమైనవిగా అనిపించటం సహజం. పశుప్రవృత్తులు పదేపదే మేల్కొని మనలను వశం చేసుకోవాలని ప్రయత్నించినా వీటిపట్ల మనం అప్రమత్తంగా ఉంటూ క్షణక్షణం వీటిని గురిస్తూ, సమూలంగా నాశనం చేయాలి. అంతర జగత్తులో జరిగే మహాభారత సంగ్రామంలో ప్రతి ఒక్కడూ అర్జునుని వంటి పాత్రధారులుగా మారాలి.

ఒక జాలరి ఒకరోజు పూవులు అమ్ముకొనే ఆయన ఇంట్లో ఆశ్రయం కోరతాడు. ఆయన జాలరిని యధోచితంగా సత్కరించి భోజనం పెట్టి పూవుల గదిలో పడక ఏర్పాటు చేస్తాడు. కానీ జాలరికి చేపల మధ్య నిద్రించటం అలవాటు కావటం వల్ల పూవుల మధ్య ఎంతకీ నిద్రపట్టదు. రకరకాల పూవుల సుగంధాన్ని అతడు భరించలేక తనవద్ద నున్న చేపల బుట్ట మూత తీసి నీళ్లు జల్లి ముక్కు దగ్గర పెట్టుకుంటాడు. వెంటనే సుఖ నిద్రలోకి జారుకొంటాడు.

మానవులకు కూడా జన్మజన్మల సంచిత కుసంస్కారాల కారణంగా భౌతిక సుఖాలు విషయ వాసనల సౌరభమే తప్ప దైవచింతనలు ఆత్మ విద్యల సౌరభం రుచించదు. కాబట్టి ఇంటినీ ఒంటినీ ప్రతి నిత్యం శుభ్రం చేసినట్లే వాతావరణ ప్రభావం వల్ల మనసుపై పడిన మాలిన్యాన్ని ప్రతి నిత్యం తొలగిస్తూ శుభ్రం చేయాలి.

ఒక వ్యక్తి మహాత్ముని వద్దకు వచ్చి, స్వామీ! నా నాలుక భగవంతుని నామాన్ని జపించినా మనసు మాత్రం భగవంతుని యందు లగ్నం కావటంలేదు. అంటూ మొరపెట్టుకుంటాడు.

మహాత్ముడు ఆదరంగా, నాయనా! దైవదత్తమైన సంపదలలో ఒకటి అయిన నామస్మరణ ఒక్కటే నీ వశంలో ఉన్నా చాలు. క్రమంగా నీవు అన్ని దైవీ సంపదలకు అధిపతివి కాగలవు. నిశ్చింతగా ఉండు. నీ వశంలో ఉన్న నామస్మరణతోనే ముందుకు పయనించు అని తెలియజేస్తాడు.

ఒకే ప్రయత్నంతో మనోమాలిన్యాన్ని తొలగించుకోలేము. కాబట్టి చిన్న చిన్న సంకల్పాలను తీసుకుని వాటిపైన స్థిరంగా ఉండాలి.

శుభారంభం ఎక్కడో అక్కడ మొదలయితే మనస్సు సన్మార్గంలో పయనించటానికి రాజీ పడుతుంది. ఒక చిలుకచేత రామనామం పలికించినంత మాత్రాన ఒక వేశ్య జీవితమే మారిపోయిన సంఘటనలు అనేకం మనకు తెలుసు. కేవలం “నారాయణ” అనే పదాన్ని పలికిన్నంత మాత్రాన శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణ లభించి తరించాడు అజామీళుడు. కాబట్టి మానవులకు తమ దుష్ప్రవృత్తులను అదుపు చేసుకోవటం అసాధ్యం ఎంత మాత్రం కాదు.

Leave a Comment