
మన చుట్టూ వాతావరణం ఎంత చిందరవందరగా ఉన్నప్పటికీ మన ఆలోచనలు వక్రంగా లేని పక్షంలో బాహ్యజగత్తు అంతా పవిత్రంగానే ఉంటుంది.
ఆలోచనల పట్ల నియంత్రణలేని వ్యక్తికి ధనం, వైభవం శక్తి, సంపద సమస్తం ఉంటే ఉండవచ్చు. వాటిని అపవ్యయం చేయక పోవచ్చు. అయినా ఎప్పుడూ ఏదో పొగొట్టుకొన్న వానిలా దుఃఖిస్తూనే ఉంటాడుగానీ ప్రత్యేకంగా ఏమీ పొందలేడు.
ఒక గ్రామీణురాలు సంత జ్ఞానేశ్వర్ ని స్వామి! నియమ పాలన ద్వారా జీవితాన్ని గడుపుతున్నా ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటాను. కారణం ఏమిటని ప్రశ్నించింది. జ్ఞానేశ్వర్ దూర దృష్టితో ఆలోచన చేసి గ్రామీణురాలితో, అమ్మా! నీవు బాహ్య జీవితాన్ని సమయనిష్ఠలతో గడిపినా, అంతరంగంలో ఎల్లప్పుడూ నికృష్టమైన ఆలోచనలే ఉండటం వల్ల రోగాలకు గురి అవుతున్నావని తెలియజేస్తాడు.
ఆలోచనలన ఊర కుక్కలవలె కూడని విధంగా తిరుగాడ నీయకండి. వాటిని అనుక్షణం ఉత్కృష్ట దిశగానే పయనించనీయండి. సద్విచార సేనను అన్నివేళలా సిద్ధంగా ఉంచుకొని అనైతికమైన ఆలోచనలతో పోరాటం సాగించండి. నికృష్ట చింతనలు, ఉత్కృష్ట చింతనలు మధ్య జరిగే అంతరంగ పోరాటమే అసలైన దేవాసుర సంగ్రామం.
జంతు ప్రదర్శనశాలల్లో, జంతువులు స్వేచ్ఛగా తిరగటానికి పెద్ద స్థలాన్నే కేటాయిస్తారు. కానీ బయటకు మాత్రం రానీయరు. అలాగే ఆలోచనలను కూడా అభీష్ట ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా పరిభ్రమించనీయాలి కానీ మర్యాదతో కూడిన హద్దులను ఉల్లంఘించి బయటకు పోనియరాదు.
ఒక వ్యక్తి ఒక గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో బడలికవల్ల ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. చెట్టునీడలో చాలా ప్రశాంతతను పొందుతూ త్రాగటానికి దగ్గరలో చల్లని నీరు కూడా లభిస్తే బాగుండును అనుకొంటాడు. తక్షణం ఎదురుగా ఒక కోనేరు కనిపిస్తుంది. నీటిని త్రాగి దాహం తీర్చుకుంటూ, కాస్త తిండి కూడా లభిస్తే ఎంతో బాగుండును అనుకొంటాడు.
అనుకోగానే రుచికరమైన భోజన పదార్థాలతో నిండిన పళ్లెం సాక్షాత్కరించి హాయిగా భోజనం చేస్తాడు. ఈ సంఘటనలన్నీ చూచి ” ఇక్కడ ఎవరో రాక్షసుడు ఉండి ఉంటాడు” అనుకొంటాడు. అలా అనుకోగానే రాక్షసుడు ప్రత్యక్షమై అతన్ని భక్షించి వేస్తాడు. అతను విశ్రమించిన వృక్షంలాగే మానవుల ఆలోచనలు కూడా కల్పవృక్షం వంటివే. వీటిని సదుపయోగం చేసుకొంటె అభీష్టసిద్ధి, లక్ష్య ప్రాప్తి కల్గుతాయి.
మన చుట్టూ వాతావరణం ఎంత చిందరవందరగా ఉన్నప్పటికీ మన ఆలోచనలు వక్రంగా లేని పక్షంలో బాహ్యజగత్తు అంతా పవిత్రంగానే ఉంటుంది. సామ్రాట్ పుష్యమిత్రుడు అశ్వమేధయాగం చేస్తాడు. యాగం పూర్తి అయిన రెండవరోజు అతిథుల వీడ్కోలు సందర్బంగా నృత్యం ఏర్పాటు చేయబడింది. యజ్ఞబ్రహ్మ పతంజలి కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. శిష్యుడైన చైత్రునికి గురువు ఆ విధమైన కార్యక్రమాలలో పాల్గొనటం ఇష్టంలేదు.
కానీ ఆ రోజుకి మౌనం వహిస్తాడు. మరొకరోజున మహర్షి యోగ వేదాంతం చెబుతూ ఉండగా చైత్రుడు, గురుదేవా! నృత్య గీతాల రసరంగం చిత్తవృత్తి నిరోధానికి సహాయ పడుతుందా? ” అని ప్రశ్నించేడు. మహర్షి శిష్యుని అంతరంగంలోని బాధను గుర్తిస్తాడు. “వత్సా! ఆత్మ యొక్క స్వరూపం రసమయమే. ఆనందం వికృతంగా మారకుండా తన శుద్ధ స్వరూపంలో ఉండాలి. ఈ సావధాన స్థితినే “నియంత్రణ ” అంటారు. ఆనందానికి, మనోవికారానికి ఒకే పరిభాష చెప్పటం ఉచితం కాదు.
ఏ వ్యవసాయదారుడు కూడా పశువులు తిని పాడుచేస్తాయని వ్యవసాయం చేయటఝ మానడు. ఒకవేళ అలా చేస్తే ఎవరూ ఆ పనిని మెచ్చరు పలాయనవాదంగా గుర్తిస్తారు. ఆనంద విహీనమైన జీవితాన్ని జీవిస్తూ పాటించే నియమాలు నిగ్రహాలు నీటిని స్వఛత నుండి, అగ్నిని తేజస్సు నుండీ వంచించటం వంటివి.
త్యజించవలసినది ఆనందాన్ని కాదు. ఆనందం యొక్క వికృతరూపాన్ని అంటూ పతంజలి శిష్యుని మనోమాలిన్యాన్ని కడిగివేస్తాడు. శ్రమ, సమయం, మనోయోగం ఈ మూడు దైవదత్తమైన సంపదలు. ఈ సంపదల స్థూలరూపమే ధనం. కాలదేళత శ్రమ దేవతల సమ్మిళిత రూపమైన ధనాన్ని ఏమాత్రం అపవ్యయం కాకుండా కాపాడుతూ ఉండాలి. ఆదా చేసిన ధనాన్ని పరమార్థ ప్రయోజనాలకు వినియోగించాలి.
“సంపద” నీది నాది అని కేటాయించటం కాక నీతితో ఆర్జించినదా కాదా? అని ప్రశ్నించుకోవాలి. సగటు దేశవాసుల స్థాయికి తగినట్లు జీవిస్తూ ఆదాచేసిన ధనాన్ని సదుపయోగం చేస్తున్నానా? లేదా? అని ఎవరికి వారు నిజాయితీగా ఆలోచించుకోవాలి. అన్ని పరిస్థితులలోను సంపాదించిన ధనాన్ని జీవితానికి సమాజానికి ఉపయోగపడేలా చూసుకోవాలి.
మధుర సమీపంలో ఒక బాలవితంతువు రోజంతా కష్టపడి తిరుగలితో పిండి విసరి రెండు అణాలు సంపాదించేది. దానినుండి ప్రతిరోజు రెండు పైసలు ఆదాచేసి పలమార్థ ప్రయోజనానికి దాచి పెట్టేది. ఆ దాచి పెట్టిన పైసలు వెయ్యి రూపాయలు కాగానే ఒక ముఖ్యమైన ప్రదేశంలో పెద్ద నుయ్యి త్రవ్వించింది. ఆ మార్గంగా వెళుతూ అనేక మంది ఆ చల్లని నీటిని త్రాగి ఆ స్త్రీమూర్తి ఔదార్యాన్ని కొనియాడుతూ శ్రద్ధాంజలి సమర్పిస్తూ ఉంటారు. సద్భావాలు కల్గి, అంతరంగంలో ఉదారత అనేది ఉప్పొంగాలే గానీ పలమార్థ పరాయణులుగా జీవించటానికి అవకాశం లేని వ్యక్తి అంటూ భూమిమీద ఎవ్వరూ ఉండరు.