Good deeds earned with a true conscience and practiced through those means will yield a hundredfold better results.

సత్యమైన అంతరంగంతో ఆర్జించి, ఆర్జించిన ఆ సాధనాల ద్వారా ఆచరించిన సత్కర్మ నూటికి నూరుపాళ్ళు సత్ఫలితాలను ఇస్తుంది.

స్మార్తదేశంలో నిరంతరం కడుపునిండా భోజనం లభించే ప్రదేశం ఒకటి ఉండేది. ఈ భోజనాలయాన్ని ఒక భిక్షుకుడు నిర్వహించేవాడు.

గతంలో ఒకనాడు ఈ భిక్షుకుడు భిక్షాటనకు వెళ్లినప్పుడు ఒక స్త్రీ చాలా హీనంగా మాట్లాడి అవమానిస్తుంది. వెంటనే అతడు భిక్షకవృత్తిని వదిలేసి శ్రమచేయటం మొదలుపెడతాడు. అనతికాలంలోనే శ్రమఫలించి వ్యాపారంలో హద్దులేని లాభాలు వస్తాయి. ఒకనాడు ఇతడిని అవమానించిన స్త్రీ ఇతనికి అడుక్కుంటూ కనిపిస్తుంది. ఇతని హృదయం ద్రవించింది. తన సమస్త సంపదను ఆకలి బాధ నివారించే నిమిత్తం సమర్పణ కావిస్తాడు.

గుజరాత్ లో ఒక స్త్రీ కి 30 సంవత్సరాల వయస్సులో ఆమె భర్త దివంగతుడైనాడు. భర్త సంపదగా ఆమెకు మిగిలిన సంపద ఎద్దు, నాగలి, 3 సెంట్లు భుమి. దానిని ఆమె భర్త సంపదగానే భావించి తనకు ఏ హక్కు లేదని, దానిని పరమార్థ ప్రయోజనానికి వెచ్చించి తాను కష్టించి జీవించాలని నిర్ణయించుకుంటుంది.

ఆ గ్రామంలో స్త్రీలు ఒక రెండు మైళ్ళు దూరం నడచి వెళ్లి త్రాగటానికి నీటిని తెచ్చుకుంటూ ఉండేవారు. పశువులకు నీరు పెట్టాలంటే చాలా అవస్థ అయ్యేది. ఆ స్త్రీ ఎడ్లు, 3 సెంట్లు భూమి అమ్మేసి ఒక చెరువు, పెద్ద బావి త్రవ్వించింది. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన.

జిలానీ అనే మహాత్ముడు రాత్రిపూట మొదటి ఝాములో రాజు యొక్క ఆదేశానుసారం ఒక పుస్తకం వ్రాస్తూ ఉండేవాడు. నాల్గవ ఝాములో తన పూజ, జపం, ధ్యానం చేసుకునేవాడు. ఆయన వద్ద ఉన్న రెండు దీపాలలో ఒక దీపాన్ని పుస్తకం వ్రాసేటప్పుడు, రెండవ దీపాన్ని పూజా సమయంలోను వెలిగించేవాడు.

మిత్రుడు ఒకసారి జిలానీని ఈ విధంగా రెండు దీపాలను మార్చి ఎందుకు వెలిగిస్తావని ప్రశ్నిస్తాడు. పుస్తకం రాజ్యం కోసం వ్రాస్తున్నాను. కాబట్టి ఆ దీపంలో రాజుగారి నూనెను ఉపయోగిస్తాను. నా వ్యక్తిగత మైన పూజ, ధ్యానం చేసుకునే సమయంలో వెలిగించే దీపంలో నా సొంత నూనెను ఉపయోగిస్తానని బదులు పల్కుతాడు. ఇది మహామానువుల విశిష్టత.

సత్యమైన అంతరంగంతో ఆర్జించి, ఆర్జించిన ఆ సాధనాల ద్వారా ఆచరించిన సత్కర్మ నూటికి నూరుపాళ్ళు సత్ఫలితాలను ఇస్తుంది.

అపవ్యయం, అనవసరం సంగ్రహం ఈ రెండు అనేక దుష్ప్రవృత్తుల ఉద్భవానికి కారణమవుతాయి. వీటివల్ల తాము, ఇతరులు కూడా హద్దులేనంతగా హానికి గురి కావలసివస్తుంది. ఆర్జన యొక్క సద్వినియోగం, సంపదను అనుభవించటం పట్ల నియంత్రణ ఈ రెండు లుప్తమైన ఇళ్ళు ఆడంబరం, ఫాషన్స్, దుర్వ్యసనాలతో నిండి ఉంటాయి. లక్ష్మి తనను గౌరవించేవారు, తనను సదుపయోగం చేసేవారు అవునా కాదా చూసుకుని, అయినట్లయితేనే ఆ ఇంట స్థిరంగా ఉంటుంది.

ధనాన్ని విచ్చలవిడిగా తమకోసం ఖర్చు చేస్తూ, అనవసరంగా అధిక ధనాన్ని ఇతరుల నుండి సంగ్రహిస్తూ ఉండేవారు, దైవ తిరస్కారాన్ని కోరి ఆహ్వనించినట్లే అవుతుంది. సమాజంలో ఈనాడు ఇటువంటి వారే ఎక్కువ కనిపిస్తున్నారు. కుటుంబ కలహాలు, సమాజంలో అపరాధాలు హద్దులేకుండా పెరగటం వీటికి ముఖ్య కారణం అపవ్యయమేనని ఖఛితంగా చెప్పవచ్చు.

సముద్రాలు ఆర్జించవు. పైగా మేఘాలుగా మారి రెట్టింపు వర్షిస్తాయి. దీనివల్ల జలాశయాలు నిండి ప్రవహిస్తాయి. అలాచేయక నదులు వాటి నీటిని అవే త్రాగివేస్తే లోకమంతా హాహాకారాలు చుట్టుముడుతాయి. అలాకాక మరీ ఎక్కువ ఉదారత్వం చూపించినా మంచిదికాదు. కాబట్టి నియమం, క్రమబద్ధతలతో ప్రతీపని జరగాలి.

సంతానవంతుడైన ఒక సేఠ్ చాలా సంపన్నుడు కూడా, కానీ కుటుంబంలో వారంతా మలినమైన మనస్సులతో నిరంతరం కలహించుకుంటూ ఉండేవారు. లక్ష్మీదేవికి కోపం వచ్చి వారిఇంట నుండి వెళ్లిపోవటానికి ఉద్యుక్తురాలై సేఠ్ని ఏదైనా వరం కోరుకోమంటుంది. సేఠ్ వారి కుటుంబ కలహాలు నివారించమని కోరుకుంటాడు.

లక్ష్మి నవ్వి, నేను మీ ఇంటిని వదలి పోవటానికి కారణం మీ కలహాలే. గుర్తించినా నీవు గుర్తించకపోయినా కోరవలసిన కోరికనే కోరుకున్నావు. కాబట్టి నేను ఇంక ఎక్కడికీ వెళ్లను. మీతోనే ఉంటాను అంటూ లక్ష్మి సేఠ్కి వరాన్ని ప్రసాదించి అతనివెంట నడచివెళ్ళి మరలా వారింటనే ప్రవేశిస్తుంది.

Leave a Comment