It is well known that the Mind is Formed by Food.

అన్నాన్ని బట్టే మనస్సు ఏర్పడుతుంది అనేది సర్వవిదితం.

ధన్వంతరి పక్షిరూపు ధరించి ఉపదేశాన్నివ్వటానికి వాగ్భట్టు వద్దకు కాశీ వస్తాడు. ఆరోగ్యవంతుడుగా జీవించాలంటే ఏమిచేయాలని వాగ్భట్టు పక్షి రూపుడైన ధన్వంతరిని ప్రశ్నిస్తాడు. “ఋతువుకి కాలానికి తగినట్టు తక్కువగా ఉపయోగకరమైన ఆహారాన్ని భుజించేవారు” ఆరోగ్యవంతులు అని ధన్వంతరి తెలియజేస్తాడు. ఆరోగ్య విజ్ఞానంలోను ఆధ్యాత్మిక విజ్ఞానంలోను కూడా మితహారానికి సమానమైన ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది.

శరీర నిర్వహణకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఆహారాన్ని స్వీకరించాలి. అన్నాన్ని బట్టే మనస్సు ఏర్పడుతుంది అనేది సర్వవిదితం. ఆహారం వల్ల రక్తం, మాంసమే కాక ఆలోచనలు, అంతఃకరణ కూడా ప్రభావితమవుతాయి. ఆలోచనలు చాంచల్యం, మనోవికారాల విజృంభణ, అవినీతికి లొంగటం మొదలైన వాటి వెనుక ప్రముఖ పాత్ర వహించేది ఆహార ప్రభావమే నిస్సందేహంగా.


అంపశయ్య మీద పడి ఉన్న భీష్మ పితామహుడు ఉత్తరాయణ సూర్యోదయం కాగానే ప్రాణత్యాగానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంటాడు. పాండవ వంశానికి, కురు వంశానికి చెందిన స్త్రీ పురుషులందరూ ఆయన చుట్టూ ఉన్నారు. వారందరకూ తన అంతిమ సందేశాన్ని ఇవ్వాలనుకొంటాడు భీష్ముడు.

ధర్మం, సదాచారం వీటికి ప్రాధాన్యతనిస్తూ భీష్ముడు ఇచ్చే సందేశం అందరూ శ్రద్ధగా వింటున్నారు. కానీ ద్రౌపది ముఖంమీద వ్యంగ్యమైన చిరునవ్వు భీష్ముడు గుర్తించి, అమ్మా! ఈనాడు నేను చెప్పేమాటలకు, నిండు సభలో నీకు అవమానం జరిగిన రోజున, నా చేతలకు ఏ మాత్రం పొంతన లేదని నీవు నవ్వుతున్నావు కదూ! నిజమేనమ్మా. ఆనాడు నాలో ప్రవహించేది కౌరవుల కుటిల సంపదను తినటం ద్వారా ప్రవహించే రక్తం.

అనాడు నా బుద్ధి మలినమై ఉంది. నా స్వరం న్యాయ పక్షం పలకనని మొండికేసింది. కానీ ఈనాడు అలాకాదు, అనేక రోజులుగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తూ ప్రాయశ్చితం చేసుకోబడిన పవిత్ర శబ్దాలు ఇవి. ధర్మోపదేశాన్ని ఇవ్వటానికి తగిన పాత్రతను ఉపవాసవ్రతం ద్వారా నేను పొందగలిగాను అని ద్రౌపదితో పల్కుతాడు. ద్రౌపది భీష్మ పితామహునికి కన్నీళ్లతో అంతిమ నమస్కారం చేసింది.

ఒకసారి మహాత్ముడు ధర్మోపదేశాన్ని ఇవ్వటానికి ఒక ప్రదేశానికి వెళ్లి, అక్కడనుండి చిన్న బంగారుహారాన్ని అపహరించి తీసుకొనివస్తాడు. మర్నాడు ఆయన చాలా బాధపడుతూ తిరిగి ఆ ప్రదేశానికే వెళ్లి హారాన్ని తిరిగి ఇచ్చి వేస్తాడు. క్షమాపణ కూడా కోరుకొంటాడు. ఆ గృహస్థుకు ఆశ్చర్యం కల్గింది. ఇంతటి జ్ఞాని మహాత్ముడు అయి ఉండికూడా హారాన్ని ఎందుకు అపహరించాడో, ఎందుకు తిరిగి ఇచ్చి వేశాడో కారణం తెలియజేయమని ప్రశ్నిస్తాడు.

మహాత్ముడు బాధతో, నాయనా! నిన్న నేను భిక్ష స్వీకరించిన ఇల్లు ఒక చోరుడిది. అతని ఇంటిలోని వస్తువులు ఆహార పదార్థాలు అన్నీ అపహరించి తెచ్చినవే. అటువంటి దోష భూయిష్టమైన భిక్ష స్వీకరించటం వల్ల నా బుద్ధి నన్ను దొంగతనం చేయుమని ప్రేరేపించింది. తరువాత నాకు వాంతులు మొదలై ఆహారం అంతా బయటకు పోయింది. నా వాస్తవిక బుద్ధి మేల్కొని మీ హారాన్ని మీకు ఇవ్వమని నన్ను ఒత్తిడి చేసింది అని కారణం వివరిస్తాడు.

జిహ్వ వాక్కు యొక్క పాత్రను పోషిస్తుంది. వాక్కు యొక్క స్థాయి మానవుని యొక్క గుణకర్మ స్వభావాలను ప్రకటీకరిస్తుంది. వాక్కు సంస్కారవంతంగా ఉంటే జీవనదేవత సౌందర్యం వృద్ధి చెందుతుంది.

Leave a Comment