నీకు వచ్చే పరిస్థితులన్నింటికి నీవే కారణం.

అగ్నివేషుడనే ఆచార్యుని శిష్యుడు ఒకనాడు, గురుదేవా! రోగ నివారణ ఒకటే చాలదని, ఆరోగ్య సంరక్షణ, బలహీనతయొక్క నిర్మూలన, అత్యంత ఆవశ్యకమని మీరు చెబుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటే రోగం దానంతటదే నయం అయిపోతుంది కదా, మిగిలిన తాపత్రయాలన్నీ ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. అయుర్వేద విద్యలో మర్మగ్నుడైన అగ్నివేషుడు, గంభీర స్వరంతో, వత్సా! ఏదైనా ఒక పోషకతత్వం యొక్క ఉపయోగం శరీరం నుండి విజాతీయ ద్రవ్యాలను తొలగించినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయుర్వేద విధానంలో రోగనిర్మూలనకు మొదటి స్థానాన్ని, స్వాస్థ్య సంవర్థనకు ద్వితీయ స్థానాన్ని ఈయటం జరిగింది.
నివారణ లేకుంటే రోగం శరీరంలో వ్రేళ్ళను వ్యాపింపచేసి స్థిరనివాసం ఏర్పరచు కొంటుంది. వేరుకు పట్టిన దోషం తొలగించకుండా చేసే బ్రహ్మోపచారాలు నామమాత్రంగా మిగులుతాయే గానీ ఫలితాలనీయవని తెలియజేస్తాడు.
మానవ పతనానికి కారణం బాహ్య పరిస్థితులు ఎంత మాత్రం కాదని, ఆత్మతత్త్వం మీద వ్యాపించిన మకిలి తుడిచివేస్తే పరమాత్మ ప్రకాశం ప్రతి అంతరంగంలోకి ప్రవేశిస్తుందనీ మహర్షి ఉపదేశాలన్నీ తెలియజేశాయి. విపత్తులు ఇతరుల ద్వారా వచ్చి మీదపడతాయనే భ్రమ అందరికీ దూరమయ్యింది. ఉన్నతి, పతనం మన చేతుల్లోనే ఉన్నప్పుడు మన దిశాధారలను మార్చుకొని ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా త్రిప్పుకోవటం ఏ మాత్రం కష్టం కాదనే వాస్తవం మహర్షి ద్వారా తెలియచేయబడింది.
తన విపత్తులకు, ప్రతికూల పరిస్థితులకు బయట ప్రపంచం కారణం అనేది గొప్ప పొరపాటు అభిప్రాయమనీ, ఎలాంటి మనఃస్థితి ఆచరణ ఉంటే అలాంటి వాతావరణం పరిస్థితులు ఏర్పడతాయని గుర్తించిన తక్షణం భౌతిక జగత్తులో అనేక పెద్ద పెద్దనదుల దిశాధారలను దారి మళ్ళించి అనుకూలంగా మార్చినట్లే అంతరంగంలో ప్రవేశించి ఈ భగీరథ పరాక్రమ ప్రవాహధారలను ఈశ్వరుని వైపు దారి మళ్ళించి తనకు తాను ఉత్కృష్ట స్థితికి చేరుకోవటం అసంభవం కాదని జిజ్ఞాసువులు గుర్తించారు.