Karma Yogis Easily Attain Wealth, Fame, and Prestige.

కర్మ యోగులకు సంపద, కీర్తి, ప్రతిష్ఠ, ఒకటేమిటి సర్వస్వం సునాయాసంగా లభిస్తాయి.

Karma Yogis Easily Attain Wealth, Fame, and Prestige.

అశోకుని రాజ్యంలో అనావృష్టి సంభవించి ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్న సమయమది. అశోకుడు అన్న రాశులను, అన్న సత్రావులను యేర్పాటుచేసి ఉదయం మొదలు సాయంత్రం వరకు విరామంలేకుండా అన్నదానం చేయించసాగాడు. ఒకరోజు భోజన వితరణ సమయం పూర్తియై అందరూ నిష్క్రమిస్తూ ఉండగా ఒక వృద్ధుడు ఆకలితో వచ్చి అన్నం పెట్టుమంటాడు. కానీ వారు నిరాకరించి సమయం ముగిసిపోయిందని రేపు ఉదయాన్నే రమ్మని వృద్ధుని పంపివేస్తారు.

అంతలో ఒక యువకుడు త్వరత్వరగా అచటకు వచ్చి నిరాశతో తిరిగి వెళుతున్న వృద్ధుని పిలిచి భోజనం పెట్టేవారితో, అయ్యలారా! ఈ వృద్ధుడు అన్నం కోసం చాలా సేపటి నుండి నిరీక్షిస్తున్నాడు. వృద్ధాప్యం వలన జనసమ్మర్థంలోనికి చొచ్చుకొని రాలేక వెనుకనే ఉండిపోయాడు. దయఉంచి కాస్త అన్నం పెట్టు మని అర్థస్తాడు. అతని వాక్కు యొక్క మహత్తు యేమోగానీ, అక్కడన్నవారు వెంటనే భోజనం పెడతారు. యువకుని సహాయంతో వృద్ధుడు అన్నాన్ని మూటకట్టుకుని చీకటి పడింది ఎలా గుడీశెకు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా యువకుడు అతని పరిస్థితి అర్థం చేసుకుని అన్నంమూటను తానే పట్టుకొని అతనికి తోడుగా నడవసాగాడు.

మార్గమధ్యంలో ఒక సైనిక బృందం ఎదురువచ్చింది. ఆ సేనానాయకుడు గుఱ్ఱాన్ని దిగి యువకునికి సైనిక వందనం చేస్తాడు. వృద్ధుడు ఇది చూచి ఆశ్చర్యచకితుడై నీవెవ్వరో చెప్పుమని యువకుణ్ణి ఒత్తిడి చేస్తాడు. యువకుడు చిరునవ్వు నవ్వి నేను శక్తిగల్గిన ఒక యువకుణ్ణి. నీవు శక్తిలేని వృద్ధుడివి. చాలు ఇంతకంటె ఎక్కువ పరిచయం దేనికి? నీ ఇల్లు ఎక్కడో పద అంటూ ముందుకు అడుగులు వేయబోతాడు. వృద్ధుడు ఆ యువకుణ్ణి పూర్తిగా గుర్తుపట్ట గల్గుతాడు. వెంటనే యువకుని పాదాలమీద వ్రాలి ఓ ప్రభూ! నీవు మమ్మల్ని పరిపాలించే ప్రభువువే కాదు, నిజమైన కర్మ యోగివి అంటూ నమస్కరిస్తాడు.

అశోకునివంటి కర్మ యోగులకు సంపద, కీర్తి, ప్రతిష్ఠ, ఒకటేమిటి సర్వస్వం సునాయాసంగా లభిస్తాయి. కానీ వారికి వాటియందు కోర్కెలేకుండా ఉన్నప్పుడే అది కర్మయోగం అనిపించుకుంటుంది.

వికాసక్రమం వృద్ధి చెందేకొలదీ జ్ఞానంతోబాటు కర్మ జోడించబడుతూ ఉంటుంది. కర్మ ప్రౌఢత్వాన్ని సంతరించు కొనేకొలది దానివెంట భావవీచికలు వెదజల్లబడతాయి.

బాలుడు కేవలం ఆటలతో కాలంగడుపుతాడు. ఇదే బాలుడు కిశోరావస్థకు వచ్చేసరికి ఆటలతో బాటు చదవడం కూడా ప్రారంభిస్తాడు. ఇదే బాలుడు యువావస్థలో కడుగిడగానే ఆడటం, చదవటంతో పాటు తన పురుషార్థంతో ఆర్జనను కూడా మొదలుపెడతాడు. ఇదే విధంగా జ్ఞానం, భక్తి, కర్మల సంగమం గంగా యమున సరస్వతీల సంగమంవలె త్రివేణి సంగమం. జ్ఞానం, కర్మల కలయిక ద్వారా కలిగే సాధన సరియైన దిశలో సాగుతున్నప్పుడు దానిలోనికి భక్తి యొక్క క్రొత్త ధారలు కూడా వచ్చి చేరుతాయి. ఆత్మ వికాసం ప్రౌఢదశకు చేరినపుడు జ్ఞానం కర్మలతోబాటు భక్తి యొక్క క్రొత్త కెరటాలు ఉప్పొంగుతాయి.

సద్ జ్ఞానంతో ప్రేరేపించబడిన కర్మలలో భావన యొక్క సమావేశం అంతరంగపు పరిపక్వతకు చిహ్నం. ఇదే ఆధ్యాత్మ ప్రగతికి చివరి మెట్టు. భావసంపదనలు, శ్రేష్ఠత యొక్క కెరటాలు జీవితంలో సమావేశం అవ్వటమంటే ఈశ్వరునిపట్ల శ్రద్ధకు విశ్వాసానికి తన అంతరంగంలో స్థానాన్ని ఇవ్వటమే. జ్ఞానాన్ని కర్మను తన జీవితంలోని సత్ర్పయోజనాలతో జోడించిన వ్యక్తికి భక్తి యొక్క భావతరంగాలు వాటంతట అవే ఉప్పొంగుతాయి. జ్ఞానం, భక్తి, కర్మల త్రివేణి సంగమం తీర్థరాజంగా ప్రతిఒక్కరి అంతరంగంలోను విరాజిల్లుతోంది. దీనిలో పుణ్యస్నానమాచరించి ప్రతిఒక్కరూ జీవితాన్ని పునీతం చేసుకోవచ్చు

Leave a Comment