నిజమైన కర్మ యోగి

ఒక బ్రాహ్మణుడు జీవితం మొత్తం మీద నాలుగు మహా యజ్ఞాలను నిర్వహిస్తాడు. అయినా ఆయన అంతిమకాలంలో పిరిస్థితులు ఎంతగానో దిగజారి దారిద్ర్యాన్ని భరించలేక నాల్గింటిలో ఒక యజ్ఞఫలాన్ని ధర్మరాజుకి అమ్మి జీవిత చరమాంకాన్ని సుఖంగా గడపాలని బయలుదేరుతాడు. మార్గమధ్యలో ఆకలివేసి ఒక చెట్టు క్రింద కూర్చొని తనవద్దనున్న రొట్టెలమూటను విప్పుకుంటాడు. ఇంతలో పదిరోజులుగా ఆకలి బాధతో పరితపిస్తున్న ఒక సన్యాసి చెట్టుక్రిందకు వచ్చి చేయిజాపుతాడు.
బ్రాహ్మణుడు ఆ దరిద్ర నారాయణునకు నమస్కరించి సగౌరవంగా తన రొట్టెలన్నింటిని సన్యాసికి సమర్పించి తను గ్లాసుడు నీళ్లుత్రాగి ధర్మరాజు వద్దకు చేరుకుంటాడు. ధర్మరాజు బ్రాహ్మణుని చూచి సంగతి గ్రహించి, అయ్యా! నీవద్ద ప్రస్తుతం ఐదు యజ్ఞాలఫలమున్నది. వీటిలో దేనిని అమ్మదలచుకొన్నావని అడుగుతాడు. ఐదవ యజ్ఞం మాటవిని బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడౌతాడు.
ధర్మరాజు అదిగమనించి, బ్రాహ్మణుడా! నీ జీవితకాలంలో ఆచరించిన నాలుగు యజ్ఞాలు, దారిలో నీవు కష్టాన్ని సహిస్తూకూడా కష్టంలో ఇతరులకు సహాయం చేయాలి అనే భావనతో సన్యాసికి సమర్పించిన రొట్టెలు అక్షయ యజ్ఞంగా నిర్థారించబడింది. కాబట్టి ఎక్కువ ధర పల్కే అక్షయ యజ్ఞాన్ని అమ్ముతావా? మిగిలిన నాల్గింటిలో దేనినైనా అమ్నదలిచావా? అని తిరిగి ప్రశ్నిస్తాడు. బ్రాహ్మణుడు ఆనంధపరవశుడై తన శేషజీవితాన్ని దారిద్ర్యంతో క్రుంగకుండా పరోపకారానికే వినియోగించాలని సంకల్పం తీసుకొంటాడు.