అందరికి మేలు జరగడం కోసం గురువులు తమ మంత్రశక్తిని అంతరిక్షంలో నిలిపి ఉంచారు.

జాలితోనో ప్రేమతోనో పాత్రతను చూడకుండా ఫలితాలను ప్రసాదించి కోరికలు తీర్చటం మొదలుపెడితే లాభం లేకపోగా అనర్థం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఒక విశేష నక్షత్రంతో ఒక మంత్రాన్ని ఉపయోగించి ఆకాశం నుండి స్వర్ణ ముద్రలను వర్షింపచేసే విద్య ఒకటి ఉంది. కొన్ని విద్యలు లుప్తమై పోరాదనేదృష్టితో బుద్ధుడు ఆత్మ సాక్షాత్కారానికి యోగసాధన చేసిన ప్రదేశంలోనే తంత్ర విద్యకు సంబంధించిన కఠోర సాధనకూడా చేసాడు. లోక కల్యాణానికి ముందు ముందు ఉపయోగపడుతుందని భావించి ఈ విద్యను నిలబెట్టాలని ప్రయత్నం చేసాడు. ఈ విషయం తెల్సి ఒక బ్రాహ్మణ యువకుడు ఆ విద్య నేర్పమని పట్టుబట్టాడు. బుద్ధుడు అతనికి ఈ విద్య నేర్పాడు.
ఒక రోజు ఇద్దరూ కలిసి అడవి వెంట ప్రయాణిస్తూ ఉండగా దొంగల ముఠా ఇద్దర్ని బంధించి 100 స్వర్ణ ముద్రలు తెస్తే రెండవ వ్యక్తి ని వదిలి పెడతామని చెప్పి బుద్ధుని వదిలి పెడతారు. నేను స్వర్ణ ముద్రలతో తిరిగి వచ్చే వరకు ధైర్యంగా ఉండుమని చెప్పి బుద్ధుడు బయలుదేరేడు. కానీ మర్నడే ఆ విశేష నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తూ బ్రాహ్మణ యువకునికి కనిపించింది. వెంటనే మంత్రాన్ని ప్రయోగించి ఆకాశం నుండి స్వర్ణ ముద్రలు కురిపిస్తాడు.
దొంగలు వాటిని మూటకట్టుకుని బ్రాహ్మణుని వదిలివేస్తారు. కాస్త దూరం వెళ్లేడో లేదో మరొక దొంగల ముఠా బ్రాహ్మణుని బంధించి మాకు కూడా స్వర్ణ ముద్రికల వర్షం కురిపించమంటారు. ఆ మంత్ర ప్రయోగం సంవత్సరం లో ఒక్కసారి మాత్రమే ఫలిస్తుందని బ్రాహ్మణుడు ఎంత చెప్పినా, వారు ఆ నిజాన్ని ఒప్పుకోక బ్రాహ్మణుని చావమోది చంపివేస్తారు.
స్వర్ణ ముద్రలతో తిరిగి వచ్చిన బుద్ధభగవానుడు ఇదంతా చూచి, బ్రాహ్మణుని పాత్రత కంటే అతని ఉత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి విద్య నేర్పి ఉంటానని పశ్చాత్తాపం చెందుతాడు. శిష్యులందర్నర్నీ పిలిచి పాత్ర త లేకుండా శక్తులు ప్రసాదిస్తే సంభవించే దుష్పలితాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాడు.
సాధారణంగా వ్యక్తి తన కుసంస్కారాలు, అంతరంగంలోని దుర్గుణాల పట్ల అపారమైన దయచూపిస్తూ, బాహ్య జగత్తుపట్ల నిర్థయంగా ఉంటాడు. సాధకుని సాధన ఫలించేటప్పుడు ఈ స్థితి తల్లకిందులవుతుంది.
భగవానుని అనుగ్రహం తనమీద వర్షిస్తోందో లేదో సాధకుడు స్పష్టంగా గుర్తించగలడు. ఆయన అనుగ్రహవర్షం యొక్క శాతాన్ని బట్టి సాధకుని అంతరంగంలో సద్గుణాల అభివృద్ధి, బాహ్య స్వభావంలో సుసంస్కారాల సమావేశం కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలా జరగని నాడు తన పిలుపు దైవం వరకు చేరలేదనీ, సాధన పేరుతో కాలక్షేపం మాత్రమే చేస్తున్నట్లు సాధకుడు గ్రహించాలి. అంతరంగంలో ప్రఖరత, బాహ్యక్షేత్రంలో సద్భావాలు ఈ రెండు విభూతులు లభించిననాడు కొరత అనేది లేనే లేదు.