సూర్య చక్రం యొక్క ప్రకాశతత్వమే ప్రాణశక్తియే

విక్రాంతుడనే రాజు అడవిలో అలసిపోయి ఆకలితో తిరుగుతూ ఉండగా ఒక సాధరణ మైన రైతు అతనికి అన్నం పెట్టి ఆశ్రయమిస్తాడు. రాజు సంతుష్టుడై రైతుకు తన రాజముద్రికనిచ్చి ఆపదలు అవసరాలు కల్గినపుడు నా వద్దకు తప్పక వచ్చి సహాయాన్ని పొందుమని చెప్పి శెలవు తీసుకుంటాడు.
ఒక సంవత్సరం పంటలు పండక రైతు ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకొంటాడు. ఆ సమయంలో అతనికి రాజముద్రిక రాజు మాటలను గుర్తుచేస్తుంది. రాజముద్రిక సహకారంతో అతను ఏ అడ్డంకులు లేకుండా సరాసరి రాజమందిరంలోకి ప్రవేశిస్తాడు. తీరా వెళ్లి చూడగా మహారాజు దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఏదో అర్థిస్తున్న దృశ్యం అతనికంట పడుతుంది. వెంటనే రైతులో ఆత్మవిశ్వాసం జాగృతమవుతుంది. రాజు ఎవరినైతో అర్థిస్తున్నాడో అతడినే నేనూ అర్థించవచ్చుగా. సర్వశక్తిమయుడైన దైవం ఉండగా మానవ మాత్రుణ్ణి నేను మాత్రం ఎందుకు అర్థించాలి? అని నిశ్చయం చేసుకుని నిశ్శబ్దంగా తిరిగి వెళ్లి పోతాడు.
దైవశక్తిని గుర్తించినవారు, ఆ పరమానందంలో తాదాత్మ్యం చెందగల్గినవారు తమకు దైవానికి మధ్య వేరెవ్వరినీ సమర్థుడుగాను సంపన్నుడుగాను అంగీకరించలేరు. విపత్తులలో కూడా నువ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవిస్తారేగాని కించిత్తు వ్యథ చెందరు.
విశ్వవిజేత సికిందర్, భారతభూమి మీద జన్మించిన సాధువులు, వారి సిద్దులు గురించి చాలా గొప్పగా విని ఉన్నాడు. ఒకసారి అతను వేసుకున్న డేరాకు దగ్గరలో ఒక సాధువుని, కుటీరాన్ని చూస్తాడు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న ఆయనను చూచి ఆశ్చర్య చకితుడవుతాడు. కనీసం ఒంటినిండా వస్త్రంకూడాలేని సాధువు పట్ల సానుభూతితో అయ్యా! మీకేమి కావాలన్నా చేయగలను. బట్టలా? భవనమా? ఆహాల సదుపాయమా? నౌకర్లా? ఏమికావాలో చెప్పండి అంటూ బ్రతిమాలసాగేడు. సాధువు సికిందర్ వంక జాలిగా చూస్తూ, నాయనా! నీవు ఇస్తానంటున్నవి, ఇవ్వగల్గినవి, నేను, నా పురుషార్థంతో సంపాదించుకోగల్గినవే. అవేవి నాకు అవసరంలేదు.
నాకు కావలసినవి ఇవ్వగలవాడు కేవలం ఒక్కడే ఉన్నాడు. నా అశయదాత ఆ పరమాత్ముడొక్కడే. కాబట్టి నీవు వెళ్లు నాయనా! నామీద ప్రసరించే సూర్యరశ్శికి అడ్డు నిలబడ్డివ్. అడ్డుతొలగి ఆ కిరణాలు నాపై ప్రసరింఛనీయ్ చాలు అని బదులు పల్కుతాడు.