How can God give so easily to those who cannot give to those who stretch out their hands before you and ask?

నీ ముందు చెయ్యి చాచి అడిగిన వారికి ఇవ్వలేని వారికి , దైవం సునాయసంగా ఎలా ఇస్తాడు?

సంత్ చిదంబరం గొప్ప సిద్ధ పురుషుడు. అనేక మంది అనేక కోరికలతో వారి వద్దకు వస్తూ ఉండేవారు. ఒక స్త్రీ కూడా ఒకరోజు వారివద్దకు వచ్చి, ఎల్లాగైనా సరే నాకు త్వరలో సంతానం కల్గేలా దీవించమని కాళ్ళు పట్టుకుంది. మహాత్ముడు క్షణం ఆలోచించి, నా కాళ్ళు వదిలివేయమ్మా, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన సంతానం కలగదు. ప్రాంగణంలో కూర్చొని ఈ డబ్బా శనగలు ఆనందంగా తిను. తిన్న తరువాత కనిపించు. ఏ సంగతి చెప్తానంటాడు.

ఆమె ఆ డబ్బా శనగలు సంతాన ప్రాప్తికి మహాత్ముడు ఇచ్చిన ప్రసాదంగా భావించి జాగ్రత్తగా తినసాగింది. ఆమె ఈ కార్యక్రమంలో మునిగి ఉండగా కొందరు పిల్లలు వచ్చి మాకు తినటానికి శనగలు కొన్ని పెట్టమని అడుగుతారు. ఆమె ఒక్క గింజ కూడా వారి చేతిలో రాల్చక తరిమి కొడుతుంది. నెమ్మదిగా డబ్బా శనగలు తినడం పూర్తిచేసి మరల ఆమె మహాత్ముని వద్దకు వచ్చింది. మహాత్ముడు ఆమె వంక జాలిగా చూస్తూ లాభంలేదని చెప్తాడు. ఎందుకు లాభంలేదు? చెప్పిన పని తూచా తప్పకుండా చేశాను కదా! అని ఆమె ప్రశ్నించింది.

“శనగలు ఇచ్చినది పాత్రతను పరీక్షించటానికే గాని సంతాన ప్రాప్తికి కాదని; డబ్బా శనగలలో గుప్పెడు శనగలు నీ ముందు చేయిజాచిన చిన్న బిడ్డలకు ఇవ్వలేని నీకు వెలకట్టలేని సంతానాన్ని దైవం సునాయాసంగా ఎలా ఇస్తాడనుకున్నావు తల్లీ!” నీకు దైవం ప్రసాదించిన వాటిని నీవు సద్వినియోగం చేస్తూ ఉంటే ఆయన నీకు కావల్సినవి కోరకపోయినా ప్రసాదిస్తాడు. సత్యం ఎప్పుడైనా ఎవ్వరికైనా ఇదేనని సంత్ చిదంబరం తెలియజేస్తారు.

తమ ద్వారాలన్నీ మూసుకొని కూర్చున్నవారికి ఎవరైనా ఏదైనా ఇవ్వాలన్నా ఎలా ఇవ్వగలరు? భగవంతుని కృప ప్రవేశించాలంటే అందుకు మార్గం కావాలి. ఆ మార్గమే కవాలి. ఆ మర్గమే పాత్రత. సాధనామార్గంలో కేవలం పాత్రతకి మాత్రమే తావుందనీ యాచనకు తావులేదు.

ఒక మైదానంలో ఒక కుండ ముఖం ఆకాశంవైపు రెండవ కుండ ముఖం భూమి వైపు బోర్లించి పెట్టబడి ఉన్నాయి. ముఖం ఆకాశానికి అభిముఖంగా ఉన్న కుండ వర్షం నీటితో నిండిపోయింది. కుండ ముఖం కింద వైపుకు ఉన్నడం వల్ల కురిసే వర్షం అంతా క్రిందికి జారిపోయింది. నీటితో నిండిన కుండను, వరుణదేవుణ్ణి రెండవ కుండ తిట్టటం మొదలు పెట్టింది.

వరుణ దేవుడు తిట్టే కుండను చూచి, “ఓ అభాగ్యురాలా! నీవు కూడా ముఖాన్ని నా వైపు త్రిప్పటానికి ప్రయత్నంచేయి. నిన్ను కూడా నింపుతాను. అంతేగాని ఈర్ష్యతో నిండిన కుండను తిట్టటం, నన్ను నిందించటం వల్ల ప్రయోజనం లేదు. పాత్రతను బట్టి ఫలితాలు ఉంటాయి” అని మందలిస్తాడు. వ్యక్తులు కూడా ఇదే విధంగా సాటివారిని చూచి ఈర్ష్య చెందటం, దైవాన్ని సయితం నిందించటం చేస్తూ ఉంటారు. పాత్రత పెంచుకోలేక ఇటువంటి పనులు ఎన్ని చేసినా గోరంత ఫలితం ఉండదు.

Leave a Comment