ధర్మనిష్ఠుడు కి దేవతల సహితం సహకరిస్తారు.

రఘు మహారాజొకసారి లోక కళ్యాణార్థం “సర్వమేధ” అనే యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. తన వద్దనున్న సమస్త సంపదను ప్రజాక్షేమం కోసం ఖర్చుచేసి, ఒక మట్టి పాత్రతో దర్భాసనం పై ఆసీనుడై ఉండగా కౌత్స మహర్షి గురుదక్షిణ కొరకు ధనాన్ని ఆశించి రఘుమహారాజు రాజ్యానికి వస్తాడు. రాజు పరిస్థితిని చూచి ధనాన్ని కోరకుండా తిరిగి వెళ్లిపోతాడు. కానీ దానశీలుడైన రఘుమహారాజు మహర్షి ఏదో కార్యార్థియై వచ్చిన సంగతిని గ్రహిస్తాడు. మహర్షి ద్వారా విషయాన్ని విని ధనాన్ని తప్పక యేర్పాటు చేస్తానని రిక్తహస్తాలతో వెళ్లవద్దని చెప్పి కుబేరునకు కబురు పంపిస్తాడు.
కబురందిన తక్షణమే కుబేరుడు కనకవర్షాన్ని కురిపిస్తాడు. రఘుమహారాజు మహర్షికి కోరినంత ధనమిచ్చి సత్కరిస్తాడు. ఒక్క రాజు చిన్న కబురంపినంత మాత్రాన కనకవర్షాన్ని కురిపించిన విశేషం మహర్షిని ఆశ్చర్యచకితుణ్డి గావిస్తుంది.
కుబేరుని కలిసి దీని వెనుక గల విశేషాన్ని వివరించమని కౌత్స మహర్షి అడుగుతాడు. ” ధర్శ నిష్టుడైన వ్యక్తి పరమార్థం కోసం ఏదైనా కోరినప్పుడు శక్తి కల్గి ఉండి మనం ఆ కోర్కెను తీర్చని పక్షంలో మన శక్తి, సంపద కూడా కళంకితమై పోతాయి. అందుకే వెంటనే సహాయం చేయవలసి వచ్చింది” అని కుబేరుడు బదులు పల్కుతాడు.