పిసినారి డబ్బుని ఎలా ఖర్చు పెడతాడో సాధకుడు కూడా కాలాన్ని అలా ఖర్చు పెట్టాలి.

ఒక వ్యక్తి ఆత్మ, మరణానంతరం యమధర్మరాజు ఎదుట హాజరు పరచబడింది. ఈ వ్యక్తి తపోసంపన్నుడనీ, నిండు యవ్వనంలోనే తల్లి తండ్రులను, ఆలుబిడ్డలను, భవబంధనాలను త్యజించవేసి తపో భూమికి పోయిన ధన్యుడని యమదూతలు తెలియ చెబుతారు. యమధర్మరాజు చిరునవ్వు నవ్వి స్వకుటుంబీకుల పట్ల విశ్వాస ఘాతాన్ని ఆచరించి కర్తవ్యాలను ఎగవేసి ఇతను చేసిన తపస్సు ఆధ్యాత్మ చింతన మహాపాపంగా లెఖ్ఖింబడింది. కాబట్టి ఇతడు దేవలోకం వంక కన్నెత్తి చూడడానికైనా అర్హుడు కాడు. వెంటనే భూలోకానికి పంపి బలవంతంగానైనా ఇతని కర్తవ్యాలను ఇతడు ఆచరించేటట్లు చూడండి. అని దూతలకి ఆజ్ఞాపిస్తాడు.
ప్రక్కనున్న రెండవ ఆత్మ గురించి దూతలను ప్రశ్నించగా ఇతడు గొప్ప కర్తవ్య పరాయణుడని భార్య జబ్బుపడి మరణించినా గోరంత చలించక తన కార్యనిర్వహణలో అనవరతము లీనమై తన పననే సర్వస్వంగా భావించే వాడని దూతలు తెలితజేస్తారు. యమధర్మరాజు క్రోధ దృక్కులతో అతనివంక చూచి హృదయహీనుడా! నీ వెంత కర్తవ్య పరాయణుడైనప్పటికీ స్వర్గం లో క్షణమైనా ఆగడానికి వీలులేదు. నైతికమైన కర్తవ్యాలను ఆచరించే మిగిలిన కర్తవ్యాలన్నీ పరుగుపందెం వంటివే. భావనాపూర్వకమైన కర్తవ్యమేదైతే ఉన్నదో అది మాత్రమే సర్వశ్రేష్ఠమైనది. కాబట్టి భావనాశీలుడవై ఇతరులను ప్రేమిస్తూ భూలోకంలో జీవించు అని ఆదేశిస్తాడు.
ఇంతలో మూడవ ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది. దూతలు యమునకు నమస్కరించి, ధర్మరాజా! ఈ ఆత్మ ఒక సాధారణ గృహస్థుది. సర్వవేళల ఆస్థికతను పరిపూర్ణ నిష్టతో పాటిస్తూ పవిత్ర జీవనం గడుపుతూ ప్రేమపూర్వకమైన కుటుంబ జీవితాన్ని గడిపి వారిని పెంచి, పోషించి, వికసింప చేయటమేగాక ఆదా చేయగల్గిన సమయాన్ని సంపదను పరుల మేలుకొరకు వెచ్చిస్తూ జీవితం గడిపిన వాడు అని తెలియచేస్తారు.
ధర్మరాజు ప్రసన్నుడై ఆ ఆత్మను దీవిస్తూ నాయనా! స్వర్గం నీవంటి వారి కోసమే నిర్మించబడినది. కాబట్టి సగౌరవంగా స్వర్గ పట్టణానికి పంపిస్తాను. నీవు కావాలంటే స్వర్గాన్ని భూమి మీదకు కూడా దింపగలను అంటూ ఆయనను దూతలకు అప్పగిస్తాడు.
జీవితం యొక్క పూర్ణ వికాసానికి జ్ఞానం, కర్మ, భక్తి ఈ మూడింటి సమన్వయం అనివార్యం. కానీ అనేక మంది ఏదో ఒక్కదానిని పట్టుకొని వ్రేలాడుతూ ఆ సాలెగూటిలోనే ఊగిసిలాడుతూ కాలాన్ని దొర్లిస్తూ ఉంటారు.