Nature [ప్రకృతి] ఎప్పుడు మీకు కొత్త విషయాలను నేర్పడానికి కావలసిన పరిస్థితులను కల్పిస్తుంది.

గంగ ఒడ్డున కూర్చొని ఒక వేదాంతి జీవ-బ్రహ్మల ఏకత్వం గూర్చి సందేశం చెపుతూ ఉంటాడు. మధ్యలో ఒక జిజ్ఞాసువు లేచి నిలబడి, అయ్యా! ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడని చెబుతున్నారు కదా! కానీ జీవుడు అలాకాదే. అల్పజ్ఞానం, స్వల్ప సామర్ధ్యం కలిగినవాడు జీవుడు. ఈ విధంగా భిన్నత్వం కనిపిస్తూ ఉండగా ఏకత్వం ఎలా ఒప్పుకోగలం? అని ప్రశ్నిస్తాడు. వేదాంతి చిరునవ్వుతో అయితే ఎదురుగా ప్రవహిస్తున్న గంగానది నుండి ఒక గ్లాసుడు నీటిని గొని రమ్మని పంపిస్తాడు.
గ్లాసులోని గంగా జలానికి, నదిలోని గంగాజలానికి ఏమైనా భేదమున్నదా అని అందర్ని ప్రశిస్తాడు. లేదని జవాబిస్తారు. మరి తేడా లేనప్పుడు ఆ గంగలో ప్రయాణించే బోటును తెచ్చి గ్లాసులో పెట్టండి అని ఆదేశిస్తాడు. గ్లాసు నీటిలో బోటు ఎలా ప్రయాణం చేస్తుందని, అంటాడు జిజ్ఞాసువు. వేదాంతి మరల చిరునవ్వు నవ్వి నాయనా! జీవుడు కూడా గ్లాసులాంటి వాడే. తన చుట్టూ ఒక సంకుచిత పరిధిని గీసుకుని దానిలోనే ఉండిపోవడం వల్ల గ్లాసులోని నీటి లా అల్ప సామర్ధ్యంతోను, అల్ప జ్ఞానంతోను కనిపిస్తున్నాడు.
ఈ గ్లాసులోని నీటిని తిరిగి గంగలోనికి వేస్తే ఈ నీటిమీద బోటు హాయిగా పయనించి గల్గినట్లే జీవుడు కూడా తన పరిధిని దాటి బంధ విముక్తుడై విస్తరించ గల్గినవాడు ఆ విరాట్ స్వరూపుని వలెనే సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు కాగలడని తెలియజేస్తాడు.