Unity and Cooperation. Together We can Achieve More.

దేవదానవుల మధ్య ఎవరుగొప్ప అనే విషయంలో ఒకసారి పోట్లాట చెలరేగింది. నిర్ణయం కోసం ఇద్దరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళగా, బ్రహ్మ ఇద్దరినీ చెరో పంక్తిలోను కూర్చోబెట్టి, మృష్టాన్న భోజనాలు వడ్డించి, తినే సమయానికి మోచేతుల వద్ద వంగకుండా, చేయి నోటి వద్దకు రాకుండా మాయ పన్నుతాడు.

రాక్షసులు చేతిని నిటారుగా ఎత్తి అంత ఎత్తుమీద నుండి నోటిలో పడవేసుకుంటూ, పదార్థాలను చెల్లాచెదురు చేయసాగేరు. దేవతలు ఉదారులు, సహకారులు కావటం వలన ఒకరి నోటి కొకరు అందించి తృప్తిగా భోజనాలు ముగించారు. ఈ చిన్న సంఘటనతోనే బ్రహ్మ ఇద్దరిలో ఎవరు గొప్పో ప్రత్యక్షంగా
నిరూపించి చూపించాడు.

అంత్యకాలంలో బుద్ధుడు శిష్యులను పిలిచి, “నాయనలారా! మీరు సత్యం, ధర్మంపట్ల స్థిరంగా ఉంటూ లభించినది పంచుకొని తింటూ పరస్పరం మిత్ర భావంతో మెలుగుతూ ఉండటం వలన ఎలాంటి ఘోర విపత్తులు ఎదురైనా అవలీలగా అధిగమించగలరు. పరాజయం అనేది మీ ప్రాంగణంలో అడుగు పెట్టజాలదు” అని సందేశమిస్తాడు.

సంఘటిత శక్తి, సహకారం, ఈ రెండూ భక్తియొక్క రెండు నేత్రాలు. ఈ రెండే అన్ని పరిస్థితులలోను మానవుని ధన్యుణ్ణి చేస్తాయి. సంఘటిత శక్తియొక్క స్థూల మహత్యం జనసముదాయాల శ్రమశక్తి ద్వారా ప్రతినిత్యం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.

ఒక వ్యక్తి ఒక మహాత్ముని వద్దకు వచ్చి, “అయ్యా! అధిక సంతానం, అతి తక్కువ ఆదాయంతో బాధపడుతున్నాను. ఆకలి బాధతో రోజుకొకరు చొప్పున మరణిస్తున్నారు. ఏదైనా దారి చూపుమని” ప్రాధేయపడతాడు.

మహాత్ముడు “నాయనా! ఇటువంటి ప్రతి చిన్నదానికి దైవాన్ని, మహాత్ములను ప్రాధేయపడనవసరం లేదు. కుటుంబం అనే రథం లాగటానికి సిగ్గుపడకుండా ఎవరికెంత శక్తి ఉంటే అంతవరకు తలోచేయి వేసి కుటుంబ రథాన్ని లాగి గమ్యం చేర్చండి. చావులు అరికట్టబడటమే గాక, ప్రశాంత జీవితం లభిస్తుంది” అని చెప్పి పంపిస్తాడు.

ఇదే వ్యక్తి కొంతకాలం తర్వాత విలువైన కానుకలతో మహాత్ముని వద్దకు వచ్చి నమస్కరించి, “స్వామీ! కుటుంబ సభ్యులందరూ కలసిమెలసి తలోక పని చేసుకోవటం వలన మా సంసార రథం దేవుడు ఊరేగుతున్న పూలరథం కంటే కూడా వైభవంగా సాగిపోతోంది. దైవానుగ్రహం, మహాత్ముల ఆశీర్వాదాల
కంటే కూడా సహకారం, సంఘటిత శక్తి గొప్పవని, వాటి ద్వారా అప్పటికప్పుడే ఫలితాలను పొందవచ్చునని మాకు అర్థమయిందని” తెలియ చేస్తాడు.

“పరమాత్మ అనుగ్రహం కలిసి మెలసి జీవించే వారికి, ఉన్నది పంచుకు తినే వారికే లభిస్తుంది నాయనా!” అంటూ మహాత్ముడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు.

Unity and Cooperation. Together We can Achieve More.

Leave a Comment