True Greatness Lies in Selfless Service.

“Servants of Peoples” సంస్థ యొక్క సభాపతి లాలాలజపతిరాయ్ యొక్క మరణ సమయం ఆసన్నమవడంతో, ఆ సభాపతిస్థానాన్ని భర్తీ చేయటానికి యోగ్యుడైన వ్యక్తి ఎక్కడ లభించగలడని గాంధీజీ ఆలోచించసాగారు. అతి తక్కువ వేతనానికి తమ సుఖాన్ని, వైభవాన్ని వదలుకొని తమ జీవితాన్ని సమర్పణ గావించుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు? కానీ రండన్‌జీ ఈ వార్త తెలిసి తన బ్యాంక్ మేనేజర్ పదవిని వదలివేసి ఈ పదవిని ఆనందంగా స్వీకరిస్తానంటూ ముందుకు ఉరికాడు.

బాపూ పాదాలకు నమస్కరిస్తూ, “బాపూ! లోక కళ్యాణం కోసం మీరు వదలి వేయమంటే జీవితాన్ని కూడా ఆనందంగా వదలివేస్తాను. జీవితం ముందు బ్యాంకు మేనేజరు పదవి ఎంత అల్పమైనదో మీకు నేను వేరే చెప్పనవసరం లేదు.” అంటూ జీవితం గడపడానికికూడా చాలీచాలని వేతనంతో అపరిగ్రహ జీవితాన్ని గడుపుతూ సభాపతి పదవీ బాధ్యతను స్వీకరిస్తాడు. బాపూ సమకాలికులలో ఈ త్యాగమూర్తికి లభించిన కీర్తి, గౌరవం మరెవ్వరికీ లభించలేదు.

నిజమైన భక్తజనులు బ్రాహ్మణునివలె అపరిగ్రహులు గానూ, సాధువునివలె పరమార్థ పరాయణులుగానూ జీవిత యాత్ర సాగిస్తూ ఉంటారు. వీరిని ప్రజలు ధనవంతులుగా అంగీకరించి సహించలేరు. కానీ వీరి వద్దగల ఆత్మ విభూతి సంపద ముందు కుబేరుని సర్వ సంపదలు సరితూగజాలవు.

బ్రాహ్మణత్వమనేది, వర్ణము వలన కాక కర్మలవల్ల నిర్ధారించవలసియున్నది. నిజమైన బ్రాహ్మణుడు సంపదలు తనకోసం కోరక ఆపదలోనున్న వారికి పంచుటకై అనవరతము ఆతృత చెందుతూ ఉంటాడు. ఈ లక్షణమే బ్రాహ్మణత్వముగానూ, బ్రాహ్మణ వృత్తిగానూ నిర్ధారించవలసియున్నది. నిరాడంబర జీవితమును గడుపుతూ, విశ్వ కళ్యాణ కారకుడైన భగవదిచ్ఛలో తన ఇచ్చను మిళితంచేసి, ప్రలోభం అనేదాన్ని సమీపానికి కూడా రానీయక, లభించిన దానితోనే అత్యంత ప్రసన్నుడై జీవించుట బ్రాహ్మణుని స్వభావమై ఉంటుంది.

మధురబాబు అనే అనన్య భక్తుడొకసారి పట్టు వస్త్రాలను పరమహంసకు సమర్పిస్తాడు. వాటిని ధరించి ధ్యానమగ్నుడైన పరమహంస ధ్యానానంతరం సాష్టాంగ ప్రణామం ఆచరించటానికి ఉద్యుక్తుడౌతూ ఉండగా మనస్సులో క్షణకాలం ఈ వస్త్రాలకు దుమ్ము అంటదుకదా! అనే ఆలోచన కల్గింది. బ్రాహ్మణత్వాన్ని పాటించాలంటే ఇటువంటి వస్త్రాలను ధరిస్తే సాధ్యంకాదు. కాబట్టి ధరించటానికి ఒకటి, కప్పుకోవటానికి ఒకటి సాధారణమైన ముతక వస్త్రాలు నాకు సరిపోతాయని తెలియచేస్తూ, పట్టు వస్త్రాలను విప్పివైచి తిరిగి భక్తునకు ఇచ్చివేస్తాడు.

జీవనోపాధికోసం పేద బ్రాహ్మణుడైన పద్మనాభుడు కథాకాలక్షేపం చేస్తూ ఉండే వాడు. కానీ ఒకసారి ఆయన ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉండగా, జ్ఞానాన్ని దానంచేసి దానికి ప్రతిఫలంగా ధనాన్ని స్వీకరించటం చాలా దోషం అనే వాక్యాలను గుర్తించాడు. దానికి ఆయన మనస్సు కలత చెందింది.

ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించక, నియమోల్లంఘన చేస్తూ జ్ఞానాన్ని అమ్ముకొని కడుపు నింపుకొన్నానే అని దుఃఖించసాగేడు. జరిగినది జరిగిపోయినా, ఇకపైన ఈ పొరపాటు జరుగరాదని దృఢంగా నిశ్చయించుకొని అడవికిపోయి ఎండు కట్టెలు ఏరి తెచ్చి, బజారులో అమ్మి జీవనోపాధికి కావలసిన డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు. కథా కాలక్షేపం ద్వారా ప్రజలు తామంత తాముగా సమర్పించిన దాన దక్షిణలతో లైబ్రరీలు స్థాపించటంలాంటి పనులు చేస్తూ, సమాజంలో జ్ఞానాన్ని వృద్ధి చేయటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ, అనతికాలంలోనే అసలైన పురోహితుడుగా తనను తాను తీర్చి దిద్దుకున్నాడు.

True Greatness Lies in Selfless Service.

Leave a Comment