సిద్ధార్థుడు, దేవదత్తుడు కలిసి తోటలో విహరిస్తుండగా అందమైన రెండు రాజహంసలు ఆకాశంలో ఎగరటం చూసి అత్యంత ఆనందభరితుడై సిద్ధార్థుడు దేవదత్తుని కూడా చూడమంటాడు. అతడు బాణాన్ని తీసి ఒక హంసను కొట్టగా అది నేల కూలింది. ఆనందాన్ని దుఃఖంగా మార్చివేసింది. రక్తంలో తడిసి కొట్టుకుంటున్న రాజహంసను సిద్ధార్థుడు ఒడిలో పెట్టుకొని ప్రేమతో సేవచేసి రక్షిస్తాడు.
అయినా దేవదత్తుడు హంస తనదని తనకివ్వమంటాడు. సిద్ధార్థుడు నిరాకరిస్తాడు. విషయం రాజదర్బారుకు చేరింది. చంపినవాని కంటే రక్షించినవాడు గొప్పవాడని రాజు తీర్పు చెబుతాడు. బాల్యంలో నాటుకున్న ఈ భావబీజాలు మొలకెత్తి మహావృక్షంగా ఆత్మ విస్తరణ రూపాన్ని ధరించి వ్యక్తిని విశ్వమానవునిగా మార్చివేశాయి.
మరాఠీ దినపత్రిక సంపాదకులు, ప్రసిద్ధి చెందిన సాహితీవేత్త ఆచార్య ప్రప్రహ్లాద కేశవ అత్రి తన జీవితం మంతా శ్రమించి, ఆర్జించిన 50 లక్షల సంపదను భారత ప్రజలకు వీలునామా వ్రాస్తాడు. తన వారసులైనప్పటికీ స్వయంగా ఆర్జించుకోగల శక్తి ఉన్న వ్యక్తులెవ్వరికీ ఈ సంపద మీద అధికారం లేదని వీలునామాలో పేర్కొంటాడు. దేశమంతా తన కుటుంబమని, భారత ప్రజలు తన సోదరులని, వసుదైక కుటుంబక భావనను, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని మాటలలోకాక, చేతలలో చూపిన మహనీయుడితడు.
వ్యక్తికి కుటుంబానికే పరిమితమైన ప్రేమ మోహంగా పేర్కొనబడింది. అదే ప్రేమ విశ్వవ్యాప్తకత్వం చెందినప్పుడు ‘భక్తి’గా కీర్తించబడుతోంది. సేవ, సాధన రూపంలో ప్రేమ పరిణతి చెందినప్పుడు వ్యక్తికి అందరూ తనవారుగా దృష్టి గోచరవుతారు.
తన వారిని సంస్కరించాలని, సుఖపెట్టాలని ఆరాటం సహజంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. పరమార్థపరమైన వ్యాకులత కేవలం భక్తజనులలోనే పొంగిప్రవహిస్తూ ఉంటుంది. స్వీకరించడం అనే పదాన్ని వీరు పూర్తిగా మరచి ఎల్లవేళలో ఎదో దూరంలో ఎవరికి ఏమివ్వగలనాయని ఆరాటపడుతూ ఉంటారు. భక్తుల లక్షణం ఇది.
కుటుంబం అనే పరికరంతో ఆరంభమైన ప్రేమ విశ్వకుటుంబం వరకూ విస్తరించని నాడు ఆ ప్రేమకు, ఆ కుటుంబాలకు అర్థం లేదు. ఇంక కుటుంబాలనే ప్రేమించి సేవించలేని వ్యక్తులు సమాజాన్ని ఏదో ఉద్దరిస్తారని ఆశించడం వెర్రితనమే అవుతుంది.
ఒక మహిళ ఒక మహాత్ముని వద్దకు వచ్చి, “స్వామీ! మీరు భగవంతునితో ఏనాడు వేరుపడిలేనని చెబుతూ ఉంటారు. ఆ మాటలు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఎంతో కాలంగా దైవాన్ని పూజిస్తున్న పరమ భక్తురాలు నా తల్లి. ఆమెకు దైవం కనీసం స్వప్నంలోనైనా కానరాలేదు. మీ ఇద్దరివద్య వ్యత్యాసం ఏమిటని” ప్రశ్నిస్తుంది.
మహాత్ముడు మందహాసంచేసి, ధ్యానములో దైవాన్ని అడిగి నీకు జవాబు రేపు చెబుతానని అంటాడు. మర్నాడు మహిళను పిలిచి, “అమ్మా! నీ తల్లి తన బిడ్డలందరిపట్ల ప్రేమతోను, సమభావంతోను ప్రవర్తించక అహంకారంతోను, పక్షపాతం తోను ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే పరమాత్ముడు ఆమెను కలవడం ఇష్టంలేదని నీ ప్రశ్నకు బదులు పలుకుతున్నాడు”. భగవంతుని అభిమతాన్ని తెలుసుకున్న ఆ తల్లి పూజలకంటే ప్రవర్తన మృదువుగా, మధురంగా ఉండటం వల్లనే భగవంతుడు ప్రసన్నుడవుతాడని తెలుసుకొని తన ప్రవర్తనను మార్చుకుంటుంది.
అరణ్యవాస సమయంలో దప్పిగొన్న పాండవులు చెరువువద్దకు ఒక్కొక్కరుగా వెళ్లి యక్షుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడే మూర్ఛపోతారు. చివరగా వచ్చిన యుధిష్ఠిరుడు యక్షుని ప్రశ్నలన్నింటికీ అమూల్యమైన సమాధానాలనిచ్చి అతని ఆనందపరవశుణ్ణి చేస్తాడు. ప్రసన్నుడైన యక్షుడు కోరుకోమన్న వరానికి మాద్రి కుమారుడైన నకులుని జీవింపచేయుమని, తన తల్లి కుంతికి తాను ఉన్నట్లే మాద్రికి కూడా ఒక పుత్రుడు ఉండితీరాలని యుధిష్ఠిరుడు కోరిన కోరిక యక్షుని ఆనందపరవశుణ్ణి చేసింది. నలుగురు సోదరులను జీవింపచేసి ధర్మరాజు యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు.
