Devotion is not Just Words or Rituals.

జ్ఞానార్జనానంతరం కర్మభూమిలో కాలుమోపటం భారతభూమి యొక్క అర్ష సాంప్రదాయం. ప్రౌఢస్థితికి చేరేసరికి లోపలనుండి భక్తిభావనలు ఉప్పొంగుతాయి. పరివ్రాజక ధర్మాన్ని ఆచరించకుండా జీవింపజాలమంటూ ప్రజలే ఇల్లువదలి బయలుదేరుతారు. ఎప్పుడు ఏ పరిస్థితులు ఎదురైతే వాటికి తగినట్లే మహామానవులు జనసముదాయాలకు దారిచూపుతూ ఉంటారు.

శృంగారరసం భక్తియొక్క రూపాన్ని వికృతంగా మార్చివేసి దాని ప్రభావాన్ని జనసముదాయాలపై అసహ్యంగా ముద్రించడం చైతన్య మహాప్రభువును కలచివేసింది. లక్ష్యప్రాప్తికి బదులు కుటిల మనోరంజకాన్ని కల్గించే సాధనంగా భక్తిని మార్చివేయడం ఆయన సహించలేకపోయాడు. బెంగాల్ నుండి బృందావనం వరకూ పాదయాత్ర చేస్తూ భక్తియొక్క పవిత్ర ప్రవాహధారలను ఇంటింటికీ ప్రవహింపజేశాడు.

శుష్క హృదయాలలోని శూన్య స్థితిని తొలగించివేసి కర్మను ఆచరిస్తూనే భక్తి మార్గాన్ని ఆశ్రయించండని వ్యక్తి వ్యక్తికి పిలుపునిచ్చాడు. వికృతమైన ఆచారాలను సాంద్రదాయాలను ఖండించి బృందావనంలో నెలవైయున్న తన భగవానుడైన కృష్ణుని జీవితగాథను ప్రేరణాత్మకంగా మలచి కృష్ణుడు లీలలు చూపిన స్థానాలలో జీవం పోసి వాటిని తీర్థాలుగా మార్చివేశాడు. జీవితంలో భక్తియొక్క సమన్వయం అనేది అవతార శక్తియొక్క విశిష్టత.

బాలగంగాధరతిలక్ స్వాతంత్ర్య సంగ్రామ సేనాని. జీవన పర్యంతం కర్మాచరణపట్లే పరిపూర్ణ విశ్వాసాన్ని చూపిన ఈ మహాయోధుడు జైలుగోడల మధ్య గీతారహస్యాన్ని వెల్లడించాడు. జ్ఞానం, భక్తియొక్క సమన్వయం ఇంతటి గొప్ప సమీక్షాయుత ప్రతికూల పరిస్థితులలో జైలుగోడల మధ్య కూర్చుని వ్రాయటం అనేది ఆయన అంతరంగ పరిపక్వత యొక్క నిదర్శనం.

ఆదర్శాలపట్ల ప్రేమ, అట్టడుగున ఉన్నవారిని పైకి తీసుకొని రావటం, ముందుకు పోగలవారిని మరికాస్త ముందు కురికేలా ప్రోత్సహించడం ఈ కర్మల పట్లగల ఉత్కంఠలోనే భక్తియొక్క కాంతిదృష్టి గోచరవుతుంది. ఆ వెలుగు దివ్యమై, భవ్యమై విస్తృతమై వ్యాపించి ఉంటుంది.

భక్తి అంటే అర్థం శ్రేష్ఠమైన వాటిపట్ల గాఢమైన మైత్రి. అంతేగాక భక్తి ఎల్లవేళలా ఒక విశిష్టమైన ఉద్దేశ్యాన్ని కల్గివుంటుంది. దైవత్వం వలనే ఆత్మ విస్తరణా భావనలు నిండి ఉంటాయి. నిజమైన భక్తుడు తనకంటే కిందనున్న వారిని పైకి తీసుకొని రాకుండా తన ఔన్నత్యం గూర్చిగాని, ప్రగతిగురించి గాని ఆలోచనలను దరిచేరనీయడు.

భక్తి అంటే పారవశ్యం చెంది స్మరణచేయటం మాత్రం కాదు. తన అంతరంగంలో ఉప్పొంగే కరుణతోను, శ్రద్ధతోను అసంఖ్యాకులైన సాటి వ్యక్తులను ప్రాణవంతులను చేయటమే భక్తికి నిర్వచనం.

మదనమోహన్ మాళవీయ ముఖ్యమైన పని ఉండి ఒక బ్రిటిష్ అధికారిని కలవాలని వెళ్తూ ఉండగా దారిలో ఒక అసహాయురాలైన పెద్ద స్త్రీ పాదంలో బలమైన గాయంతో భరించరాని బాధను అనుభవిస్తూ పడిఉండటం చూస్తాడు.

ఆయన తన గుఱ్ఱపు బండి దిగి ఆమెను లేవనెత్తి తన బండిలో ఎక్కించుకొని ఆసుపత్రికి బయలుదేరుతుండగా కొందరు వ్యక్తులు వారిస్తూ, అయ్యా! ఈ చిన్న పనికోసం మీ విలువైన కాలాన్ని వృథా చేయకండి. ఈ పని మేము చేస్తామని ముందుకు వస్తారు. కానీ మాళవీయజీ వారికి ఆ అవకాశాన్ని ఈయక “నా కాలం కంటే కూడా అత్యంత విలువైనది ఈపనే. కాబట్టి, నేనే స్వయంగా ఈమె బాగోగులు చూస్తాను. ” అంటూ వాత్సల్యంగా కన్నబిడ్డకి శుశ్రూష చేసినంత ప్రేమగా ఆమెకు సేవను, సదుపాయాన్ని కలుగజేస్తాడు.

తీర్థయాత్రకు బయలుదేరిన ఇద్దరు సోదరులవద్ద పుష్కలంగా ధనం ఉంది. ఒక సోదరుడు తనవద్ద కల ధనాన్ని ప్రతి యాచకునికి అవసరం, అనవసరం పాత్రత, అపాత్రత వంటి విచక్షణగాని, ఆలోచనగానీ చేయకుండా యాంత్రికంగా ధర్మం చేయసాగాడు.

యాత్ర కొంత దూరం సాగిన తరువాత దారిలో నిర్థనుడైన ఒక గృహస్థుడు చలితో వణుకుతూ తమ ముందునుండి పోవటం రెండవ సోదరుడు చూస్తాడు. వెంటనే తన కోటు విప్పి ఆయనకిస్తాడు. “సోదరుడా! నీ కుటుంబం మొత్తం నీపై ఆధారపడిఉంది. చలి బారినుండి వెంటనే శరీరాన్ని కాపాడుకో” అని అంటాడు. తీర్థయాత్ర యొక్క ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని చక్కగా అవగతం చేసుకొని ఆచరణలో పెట్టిన తన సోదరునిచూచి మొదటి సోదరుడు సిగ్గుతో శిరస్సు వంచుకుంటాడు.

భక్తి వీటికి అసలైన అర్థం ఇతరుల బాధను తనదిగా భావించి ఆపదలో ఆదుకోవటమే అన్న తథ్యాన్ని
తెలుసుకొంటాడు.

Devotion is not Just Words or Rituals.

Leave a Comment