ఓ ఋషిపుంగవులారా! ఈ విధి వ్యవస్థలో ఈశ్వరుడు, జీవి, ప్రకృతి మూడు ఉన్నట్లే చైతన్య క్షేత్రంలో కూడా జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడు ఉన్నట్లుగా విజ్ఞులు పేర్కొన్నారు. ఈ మూడింటిని విద్యార్థులు అధ్యయనం చేసిన రీతిలోనే ఒకొక్క విషయాన్ని అధ్యయనం చేస్తూ తరువాత దాన్ని జోడిస్తూ పెంచుకుంటూ పోవాలి.
రెండు వస్తువుల కలయిక వల్ల మూడవ రూపం యేర్పడుతుంది. రాత్రి పగలు కలయిక వలన సంధ్య యేర్పడుతోందే గానీ ఈ సంధ్య రాత్రిగానీ, పగలుగానీ కానేకాదు. ఈ రెండింటి అస్థిత్వము సంధ్యా కాలంలో దాగియున్నది. సరిగ్గా ఇదే విధంగా జీవుడు కూడా పరబ్రహ్మ, ప్రకృతి ఈ రెండింటి కలయిక వల్ల యేర్పడిన మూడవరూపం. చైతన్య బ్రహ్మ యొక్క గుణాలైన ఆత్మచేతన, అంతఃకరణ భావనల రూపంలో మనలోపల విరాజిల్లుతున్నాయి.
ప్రకృతి జడమైనది. కాబట్టి శరీరాకృతి మొత్తము జడమైనదే. కాని జీవి యొక్క చైతన్యం జడత్వం ద్వారానే పయనిస్తోందనేది ప్రతి ఒక్కరూ గుర్తించ వలసిన విషయం. ఈ విధంగా సృష్టి యొక్క వ్యవస్థ ననుసరించి చైతన్య జగత్తులో గూడ సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మ యొక్క లక్షణాలు జ్ఞాన, కర్మ, భక్తిధారలుగా జీవశక్తి యొక్క ప్రగతి మార్గాన్ని నిర్థారణ గావిస్తూ దృష్టి గోచరమవుతూనే ఉన్నాయి.
వ్యక్తి యొక్క విశిష్టతను బట్టి ఈ మూడు విడివిడిగానూ హెచ్చు తగ్గులు గానూ దృష్టి గోచరమైనప్పటికీ ఈ మూడు ఆన్యోన్యాశ్రితమైనవి; అత్యంత మహత్వపూర్ణమైనవి. ఒకటి లేక వేరొకటి పరిపూర్ణతను పొందజాలవు అని మహర్షి జిజ్ఞాసువులకు విశదపరస్తూ ఇంకా సరళంగా తెలియచెప్పే తలంపుతో ఒక కథ వినిపించారు.
అజమహారాజు నిర్వహిస్తున్న యజ్ఞ కార్యక్రమానికి వశిష్ఠ మహర్షి ప్రధాన పురోహితుడుగా ఆహ్వానించ బడతాడు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి వశిష్ఠునకు నమస్కరించి దుఃఖిస్తూ, దేవా! నేను నిరంతరం శ్రమిస్తూ సదాచార సంపన్నుడిగా జీవిస్తూ, సమస్త గ్రంథాలను స్వాధ్యాయం చేసి జ్ఞానాన్ని ఆర్జించాను. కానీ పూర్ణత్వాన్ని పొందలేకపోయాను. ప్రజల ఆదరాభిమానాలను ఏమాత్రం పొందలేకపోయాను. ఏదో కొరత నన్ను నిరంతరం వేధిస్తోంది అని తెలియజేస్తాడు.
క్షణకాలం కన్నులు మూసుకుని మహర్షి అతని మనోవేదనకు, ఓటమికి కారణాన్ని తెల్సుకుంటాడు. వాత్సల్యంతో ఆ వ్యక్తి భుజం తట్టి, నాయనా! నీవు కర్మ, జ్ఞానం ఈ రెండు ప్రవాహ ధారల వెంట తత్పరతతో పయనించేవు. కానీ భావపక్షాన్ని పూర్తిగా విస్మరించేవు. నీవు ఆర్జించిన జ్ఞానాన్ని స్నేహంతో అందరకూ పంచు.
నీవు ఆచరించే కర్మలో ప్రేమను మిళింతంచేయి. సమస్త జీవధారలలోను నీ ఆత్మ కలసి ఉన్నదన్న సత్యాన్ని గ్రహించి భక్తి ప్రవాహం గుండా ఎల్లలు లేకుండా ప్రవహించు. ఆ నీ ప్రవాహదిశను పరమాత్మ యొక్క అక్షయ ఆనంద రూపమైన గంగ దిశగా మళ్ళించి ఆ గంగలో కలసిపోనీయ్. అలా చేసిననాడు నీ దుఃఖం దూరమవుతుంది. శ్రేయస్సు, జనాదరణ సర్వం నీకు లభిస్తాయి. అని మహర్షి తెలియచేస్తాడు. ఆ వ్యక్తి ఆనంద పరవశుడై మహర్షి ఆదేశానుసారం జీవిత విధానాన్ని మార్చుకోవటానికి సంకల్పం తీసుకుంటాడు. కలక్రమేణ అతడు ఇచ్చిన దానికి అనేక రెట్లు పొందసాగేడు.
ఆధ్యాత్మ క్షేత్ర వికాసక్రమ మార్గంలో ఆత్మజ్ఞానానికి ప్రథమ స్థానం ఇవ్వబడింది. ఆత్మజ్ఞానం కరువైతే మానవుడు జడత్వం యొక్క భవబంధనాలలో బంధింపబడి శిశ్నోదర పరాయణుడిగా బ్రతుకు ఈడుస్తూ అహానికి, కామక్రోధ మోహాలకి బందీయై జీవిస్తాడు.
కేవలం ఆత్మజ్ఞానం వలన మాత్రమే మానవుడు తన స్వరూప స్వభావాలను, భవిష్యత్తును, కర్తవ్యాలను తెల్సుకోగలడు. ఆత్మజ్ఞానంవల్లనే వ్యక్తి సుషుస్తావస్థను వీడి జాగృతావస్థలో ప్రవేశించగలడు. “ఆత్మబోధన” ను దేవజన్మగా పేర్కొనటం జరిగింది.
లౌకిక ఆధ్యాత్మిక క్షేత్రాలలో జ్ఞానం యొక్క స్థానం వేరే విధంగా ఉంటుంది. బాహ్యమైన క్రియా కలాపాలకు, జీవిత వ్యవహారం యొక్క విభిన్న క్షేత్రాలకు ఆత్మజ్ఞానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జ్ఞానం ప్రకాశం గా పేర్కొనబడింది. ఎవరికైతే అసలైన జ్ఞానం లభిస్తుందో వారు పశుస్థాయి నుండి పైకి చేరి మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని మానవుడుగా తాను భూమిమీదికి దిగిరావటంలో గల ఉద్దేశ్యాన్ని అవగతం చేసుకుంటాడు.
ఇతర జీవరాసులకు మధ్య గల అంతరం ఇదే. మానవుని అంతర్ నేత్రం తెరచుకొని లోపల వెలుగు ప్రసరించేసరికి అతడు తినటానికి, కనటానికి పరిమితమై ఉన్నా మన్న తన చిరసంచిత ప్రవృత్రుల ద్వారా ప్రేరేపించబడే కార్యక్రమాలను వీడి ఆత్మ ప్రగతి యొక్క మహాత్వాన్ని అవగతం చేసుకుంటూ ఆ మార్గం వెంబడి ముందుకు ప్రయాణించటం ప్రారంభిస్తాడు. ఆత్మ జ్ఞానం కొరవడటం వల్లనే చైతన్య ప్రాణధారియైన మనుజుడు జడుడుగాను, ఊగిసలాడే మొక్కగాను నిరూపించబడుతున్నాడు.
ఆత్మజ్ఞాన ప్రకాశం అంతరంగంలోనికి ప్రవేశించగానే మానవుడు నిద్రావస్థకు స్వస్తి చెప్పి జాగృత స్థితికి చేరి వెలుగులు వెదజల్ల నారంభిస్తాడు.
