Every Action Echoes Back

ఒక బాలుడు అడవిలోకి వెళ్లి ఆ క్రొత్త వాతావరణానికి భీతిచెంది భూతం భూతం అని అరుస్తాడు. ఆ శబ్దాలే కొండల్లో ప్రతిధ్వనించి మరింత గట్టిగా బాలుడికి వినిపిస్తాయి. బాలుడు భయంతో నన్ను తినేస్తావా అని అరుస్తాడు అవే శబ్దాలు “తినేస్తా” నని వినిపిస్తాయి. భయంతో కట్టెలు కొట్టటానికి తెచ్చిన గొడ్డలి కిందపడేసి ఇంటికి తిరిగివెళ్ళి తల్లికి జరిగిన సంగతి అంతా చెప్తాడు.

తల్లి విషయాన్ని అర్ధం చెసుకొని రేపు అడవికి వెళ్లి “భూతమా! నీవు నా మిత్రుడివి. నీవంటే నాకు చాలా ప్రేమ” అని అరవమంటుంది. ఆ బాలుడు అలాగే చేస్తాడు. ఆ శబ్దాలే ప్రతిధ్వనించి బాలుడికి వినిపిస్తాయి. భూతానికీ తనంటే ప్రేమ, అని తననేమీ చేయదని బాలుడు అర్ధం చేసుకుని ఆనందంతో గంతులు వేస్తాడు. మన క్రియలకు ప్రతి క్రియలు కూడా ఇలాగే ఉంటాయి.

ఈశ్వరుని ద్వారా దయ, దండన, అనుగ్రహం ఇలా ఏ రూపంలో లభించినా అవి మానవుల ప్రారబ్ధకర్మల ప్రతిఫలమే అవుతాయి. కౌరవసభలో పాండవులు ఉండగానే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయబోతాడు. ఆ రోజు ఆ దుష్టుని చేతుల్లో ఆమె మర్యాద కోల్పోకుండా రక్షించటానికి ఎవరైనా సహాయంగా రండని సభలోని అందర్నీ దుఃఖిస్తూ పిలుస్తుంది. కానీ ఎవరు రాలేకపోతారు. చివరకు దైవాన్ని పిలుస్తుంది. అంతర్యామి పరమాత్ముడు పరుగున వచ్చి, ఎవరికైనా ఎప్పుడైనా వస్త్రాన్ని ఇచ్చావేమో గుర్తుచేసుకోమంటాడు.

నది ఒడ్డున తపస్సు చేసుకొనే ఋషీశ్వరుడి వస్త్రం ప్రవాహంలో కొట్టుకుపోగా ఆ రోజు ద్రౌపది తన చీర సగం చించి ఇచ్చిన సంగతి చెబుతుంది. అయితే నిశ్చింతగా ఉండమని చెప్పి ఆమెకు కృష్ణ పరమాత్మ అక్షయమైన వలువలనిచ్చి గౌరవాన్ని కాపాడుతాడు.

వ్యక్తిగత వ్యాధులు, బాధలేకాక ప్రకృతి ప్రకోపాల వల్ల కూడా సామూహిక పతనాలు సంభవిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటని చరకుని అగ్నివేశుడు ప్రశ్నిస్తాడు. వ్యక్తి ఆర్జించిన పాపకర్మల స్థాయిని బట్టే ఇవన్నీ సంభవిస్తాయి. సమస్త విశ్వం యొక్క కార్యకలాపాలు కర్మ ఫల సిద్ధాంతాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఈ మర్యాద ఈ కట్టుబాటుతోనే సృష్టి అంతా బంధించబడి ఉంది. ఈ శాశ్వత సత్యాన్ని తేల్చుకొన్న జ్ఞాని కర్మఫలాలు ఎటువంటివైనాసరే ఈశ్వర ప్రసాదంగానే భావించే ఆనందంతో స్వీకరిస్తాడు అని చరకుడు తెలియజేస్తాడు.

మహాపురుషులందరూ సమయానికి దానంతట ఏది లభిస్తే దానినే దైవప్రసాదం అనుకుని స్వీకరిస్తారే గానీ, ఇది కావలనిగానీ, ఈకష్టం నివారించమని గానీ, ఈ వ్యాధి తగ్గించమనిగానీ దైవాన్ని ఏదీ కోరరు. తమ తపోశక్తి దగ్గరనించి తమ సమస్త సంపదలు శక్తులు పరహితార్థమే ఉపయోగిస్తారు.

రామకృష్ణ పరమహంస ఒక కేన్సర్ రోగి, ఆయనను చూడటానికి శశిధరచూడామణి అనే మహనీయుడు వచ్చి పరమహంస శరీరపరిస్థితికి చింతిస్తూ, స్వామీ మీ మనసును ఏకాగ్రంచేసి రోగాన్ని పొమ్మంటే పోతుంది. అలాచేయుమని సలహాఇస్తాడు. అతని ప్రేమకు చిరునవ్వు నవ్వి, నాయనా, నా హృదయం సచ్చిదానంద స్వరూపురాలైన అమ్మను స్మరించటానికి లభించింది.

ఆ హృదయాన్ని సంసారిక విషయాలలో ఎందుకు లగ్నంచేయాలి? అని ఎదురు ప్రశ్న వేస్తాడు. రోగ విముక్తి కల్గించమని కాళీమాతకు చెప్పుమని శిష్యులందరూ పట్టుబడతారు. నాయనలారా! సర్వజ్ఞురాలైన అమ్మకు నారోగం గురించి నేను చెప్పాలా? ఆమె నాకు ఏది మేలు అనుకుంటె అది చేస్తుంది. నా నివేదనలు అభ్యర్థనలతో ఆమె ప్రణాళికకు నేనెందుకు అడ్డుపడాలి? నేను అంతటి మూర్ఖత్వాన్ని ఆశ్రయించలేనని పరమహంస శిష్యులకు తెలియజేస్తారు.

ఆదిశంకరాచార్య కూడా మూలవ్యాధితో బాధపడేవారు. అయినా వారు దైవాన్ని రోగవిముక్తి కల్గించుమని ఏనాడు స్తోత్రాలు, అర్చనలు చేయలేదు. రోగాన్ని కర్మ ఫలంగా భావించి, తన సమస్త సామర్థ్యాన్ని లోక కల్యాణానికి వినియోగిస్తారు.

Every Action Echoes Back

Leave a Comment