వ్యక్తి తనను తాను ఎంత ఎక్కువగా ప్రేమించుకోగలడో, విశ్వసించగలడో అంతగానూ దైవాన్ని ప్రేమించి విశ్వసించగల్గుతాడు.
పర్యటన ప్రవచనాలతో శ్రమించిన రామతీర్థుడు తన నివాస స్థానానికి ఒకరోజు తిరిగి వస్తాడు. అలవాటు ప్రకారం తనకు తానే వంట ప్రారంభించి, ఇంట్లో లభించిన కాస్త పిండితో రొట్టెలు చేసుకుంటాడు. పూర్తి అయ్యేసరికి కొందరు పిల్లలు ఆకలంటూ వచ్చి కడుపు చూపిస్తారు. స్వామీజీ పిల్లలు ఆకలి తీరేవరకూ రొట్టెలను ముక్కలు చేసి తినిపిస్తాడు. ఇదంతా చూస్తున్న ఒక మహిళ ఇపుడు ఇంక నీవేమి తింటావ్ అంటూ బాధగా ప్రశ్నించింది.
స్వామీజీ అధరాల మీద ధరహాసం మెరుస్తుంది. పిల్లల వంక తృప్తిగా చూస్తూ రొట్టెలు అనేవి కడుపులోని ఆకలి బాధను తీర్చే సాధనాలు. వాటిపని అవిచేశాయి. నిరర్థకం కాలేదు. ఆ కడుపులో అయితేనేమి ఈ కడుపులో అయితేనేమి, ఆకలి తీరటం ముఖ్యం. అయినా ఆనందంతో నా కడుపు కూడా ఇపుడు నిండుగానే ఉంది. అని త్రేనుస్తూ చేయి కడుక్కుంటాడు.
ఉదారుడైన మాఘుడి వద్దకు ఒక యాచకుడు వచ్చి తన కుమార్తెకు వివాహం చేయబోతున్నాను సహాయం చేయమంటాడు. ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉండికూడా, మాఘుడి హృదయం ఆర్థించ వచ్చిన వానికి సహాయం చేయాలని తహతహలాడింది.
నిద్రించే భార్య చేతులకున్న రెండు బంగారు గాజులు తప్పించి ఇంట్లో ఏ విధమైన సంపద లేదు. మెల్లగా వెళ్లి ఒక గాజు తీస్తాడు. భార్య కన్నులు విప్పి, పరిస్థితి అర్ధం చేసుకుని, రెండవ గాజు కూడా ఇస్తూ నాథా! వివాహం ఒక్క గాజుతో ఎలా జరుగుతుంది? అంటూ యాచకుని ఆదరంగా సాగనంపుతుంది. భూమిపై నివసించే ఆ దేవదంపతులకు యాచకుడు శిరసు వంచి నమస్కరిస్తాడు.
ఇంటువంటి ప్రజలే మానవ దేహాలు ధరించిన దేవతలు, వీరివల్లనే భువి దివిగా మారింది. పారలౌకికమైన ఆత్మానుభూతి తప్ప లౌకికమైన ఆకర్షణలేవీ వీరిని ప్రభావితం చేయలేవు.
వరదుడనే మహర్షి స్వర్గానికి వెళ్లి ఇంద్రుని కలుస్తాడు. ఇంద్రుడు ప్రసన్నుడై వరదునికి స్వర్గమంతా చూపిస్తాడు. కర్మను బట్టి ఎవరు ఏఏ సుఖభోగాలు అనుభవిస్తున్నారో వివరిస్తూ ప్రతిభవనం దగ్గర ఆపి వివరిస్తున్నాడు. సరిగ్గా స్వర్గానికి మధ్య భాగంలో సమస్త సౌకర్యాలతో నిండివున్న ఒక అందాల భవనం ఖాళీగాపడి ఉంటుంది. ఇలా ఖాళీగా ఉండటానికి కారణం ఏమిటని వరదుడు ప్రశ్నిస్తాడు.
ఇంద్రుడు ఆ భవనానికి నమస్కరిస్తూ, మహర్షీ! ఈ భవనం ఉదారులు మహాత్ములు అయిన, దేవతలను మించిన, మానవ దేహధారుల కోసం నిర్మించింది. వారు, వారి కర్మభూమిని వదలి ఇక్కడకు వచ్చి సుఖభోగాలు అనుభవించటానికి ఇష్టపడరు. అందుకే ఇది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది అని బదులు పల్కుతాడు. వరదుడు ఆనందంతో ఇంద్రుని వద్ద వద్ద శలవు తీసుకుని తన కర్మభూమి భూలోకానికి తిరిగి వస్తాడు.
“అరిష్టనేమి” అనే మహాత్ముని భక్తికి ఇంద్రుడు ప్రసన్నుడై ఆయనను సగౌరవంగా స్వర్గానికి తోడ్కొని రమ్మని దేవదూతలని పంపిస్తాడు. దేవదూతలు వచ్చి అరిష్టనేమికి నమస్కరించి, విషయాన్ని వివరిస్తారు.
సురపతి ఆహ్వనాన్ని మహర్షి నిరాకరిస్తూ, నాయనలారా! మీ స్వర్గాన్ని నేను ఇక్కడే నా పరమార్థంతో నిర్మించుకోగలను. అక్కడ భోగభాగ్యాల ద్వారా పొందే ఆనందం, ఇక్కడ నేను సాటివారికి సేవచేసి పొందగలను. కాబట్టి నేను మీ వెంట అక్కడకు వచ్చి చేసేదేమీ లేదని నామాటగా సురపతికి చెప్పుమని దేవదూతలను వెనక్కి పంపించి వేస్తాడు.
సద్గుణాలు వృద్ధిచెందే కొలదీ వ్యక్తిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తనపై తనకున్న విశ్వాసాన్ని బట్టే దైవం మీద కూడా విశ్వాసం పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తి తనను తాను ఎంత ఎక్కువగా ప్రేమించుకోగలడో, విశ్వసించగలడో అంతగానూ దైవాన్ని ప్రేమించి విశ్వసించగల్గుతాడు. తనపై తనకు గల అసలైన విశ్వాసమే “ఆస్తికత” గా చెప్పవచ్చు. ఇటువంటి వ్యక్తులకు కుబేరుని సంపద, ఇంద్రుని సహకారం కూడా సునాయాసంగా లభిస్తాయి. వీరు తమకు లభించిన విభూతులను సద్వినియోగం చేసి తాము ధన్యులై ఇతరులను ధన్యం కావిస్తారు.